అందరూ ఊహించినదే జరిగింది. ‘అఖండ 2’ వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం వల్ల, క్వాలిటీ సినిమా ఇవ్వాలన్న ఆలోచన వల్ల… సినిమాని వాయిదా వేయాల్సివస్తోందని నిర్మాత ప్రకటించారు. అఖండ 2 వాయిదా వల్ల… ఓజీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేసినట్టైంది. ఎందుకంటే.. ఈ దసరాకి సోలో రిలీజ్ అంటే మామూలు విషయం కాదు. అసలే ఫుల్లు హైపు. ఆపై దసరా. ఇక ఓజీని ఆపేదెవరూ..?
‘ఓజీ’ అడ్వాంటేజ్ సంగతి అటుంచితే.. ఇప్పుడు ‘అఖండ 2’కి సరైన రిలీజ్ డేట్ ఏమిటన్నది పెద్ద ప్రశ్న. సెప్టెంబరు మిస్సయ్యింది కాబట్టి మహా అయితే నవంబరు, డిసెంబరుల్లో రావొచ్చు. డిసెంబరు 5న రాజాసాబ్ రావాలి. అది కాస్త సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ డేట్.. అఖండ 2 కోసం ఎదురు చూస్తోంది.
అయితే.. బాలయ్యకు సంక్రాంతిపై గురి ఉంది. సంక్రాంతికి విడుదలైన బాలయ్య సినిమాలన్నీ దాదాపుగా హిట్టే. పైగా అఖండ 2కి విపరీతమైన హైప్ ఉంది. ఇలాంటి సినిమా సంక్రాంతికి పడితే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. అయితే సంక్రాంతికి రావాలంటే కొన్ని సమీకరణాలు కుదరాలి. ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీ చేతిల్లోకి వెళ్లిపోయాయి. వాళ్లే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నారు. అఖండ 2 ఓటీటీ డీల్ క్లోజ్ అయితే తప్ప.. రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రాదు. అఖండ 2 ఓటీటీ డీల్ పై నిర్మాత భారీ ఆశలే పెట్టుకొన్నారు. ఎందుకంటే బడ్జెట్ పరంగా చాలా కాస్ట్లీ సినిమా ఇది. దాన్ని రాబట్టుకోవాలంటే ఓటీటీ రూపంలో మంచి బేరం సెట్ అవ్వాలి. మంచి రేట్ కి ఇచ్చినప్పుడు ఓటీటీ వాళ్లు చెప్పిన డేట్ కి సినిమా రిలీజ్ చేయడం మినహా మరో మార్గం ఉండదు. కాబట్టి.. ఓటీటీ డీల్ ఓకే అయిన తరవాతే.. అఖండ 2 రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుంది.
మార్కెట్ వర్గాలు మాత్రం.. ‘అఖండ 2’ డిసెంబరులో విడుదలైతే బెటర్ అంటున్నాయి. ఎందుకంటే.. డిసెంబరులో మిగిలిన సినిమాలతో పెద్దగా పోటీ లేదు. సంక్రాంతి బరిలో దిగి.. రెండు మూడు సినిమాలతో పోటీ పడడం కంటే.. సోలో రిలీజ్ డేట్ చూసుకొని రావడమే కలక్షన్ల పరంగా బెటర్ అన్నది ట్రేడ్ వర్గాల లాజిక్.