ప్రీమియర్లు, పెయిడ్ ప్రీమియర్లు… ఈ పదాలు తెలుగు నాట తరచూ వినిపిస్తున్నాయి. ఇది వరకు ఓ పెద్ద సినిమా వస్తేనే ప్రీమియర్ల హడావుడి ఉండేది. స్టార్ హీరోల కోసం పెయిడ్ ప్రీమియర్లు వేసేవారు. అభిమానులు సినిమాని ముందే చూడ్డానికి ఎగబడేవారు. కానీ కాలక్రమేణా ఈ పరిస్థితులు మారాయి. అందరూ ప్రీమియర్లకు అలవాటు పడ్డారు. కొన్ని సినిమాలకు చిత్రబృందం టీమ్ తో ప్రీమియర్లు వేసుకొంటే, ఇంకొన్ని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన సెంటర్లలో కూడా ప్రీమియర్ షోలు వేయడం మొదలెట్టారు. దాంతో విడుదలకు ముందు రోజే టాక్ బయటకు వచ్చేస్తోంది. సినిమాలు బాగుంటే.. ఫర్వాలేదు. కాస్త అటూ ఇటూ అయినా ఈ టాక్.. బాగా ఇబ్బంది పెడుతోంది. రివ్యూలు ముందే వచ్చేస్తున్నాయి. వెబ్ రివ్యూల మాట అటుంచితే.. సోషల్ మీడియాలో రివ్యూల వల్ల ఇంకాస్త చేటు జరుగుతోంది. సినిమా చూడాలన్న మూడూ, ఉత్సాహం లేకుండా చేస్తున్నాయి.
గత వారం విడుదలైన సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది. అన్ని సినిమాలకూ విడుదలకు ముందే ప్రీమియర్లు వేశారు. తెల్లారేసరికి టాక్ బయటకు వచ్చేసింది. దాంతో ఆ ఎఫెక్ట్ రెవిన్యూపై పడింది. ప్రీమియర్ల వల్ల నష్టమే తప్ప, లాభం లేదని కొంతమంది నిర్మాతలు ఇప్పటికే గ్రహించారు. ఇంకొంతమంది.. సినిమాపై అతి నమ్మకంతో ప్రీమియర్ వేసే ధైర్యం చేస్తున్నారు. సినిమాలు నిజంగా బాగుంటే… ప్రీమియర్ల వల్ల లాభమే జరుగుతుంది. మంచి రివ్యూలు వస్తాయి. ప్రేక్షకుల్లో సినిమా చూడాలన్న ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కానీ.. ఫలితం రివర్స్ అయితే మాత్రం జరగాల్సిన డామేజీ కంటే ఎక్కువే నష్టం జరుగుతోంది. ఈవారం కొన్ని సినిమాలు రాబోతున్నాయి. ‘ఘాటీ’కి ప్రీమియర్లు లేవు. ‘మదరాసీ’ది కూడా అదే దారి. ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రీమియర్ల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలని, ప్రీమియర్లు వేయకపోతేనే మంచిదని చాలామంది నిర్మాతలు ఇప్పటికే
ఓ నిర్ణయానికి వచ్చారు. మిగిలినవాళ్లూ అతి త్వరలోనే ఆ దారిలోనే వెళ్లే అవకాశం ఉంది.