2026 బాక్సాఫీసు సంబరాలు సంక్రాంతి సినిమాలతో మొదలయ్యాయి. రాజాసాబ్ నిరాశ పరిచినా, మన శంకర వర ప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి మంచి విజయాల్ని సాధించాయి. జనవరి అంతా ఈ సినిమాల హడావుడితో నడిచిపోయింది. ఈ జోష్ ఫిబ్రవరిలోనూ కనిపిస్తుందని భావించారంతా. కానీ… ఈనెలలో ఒక్క హిట్టు కూడా పడలేదు. గుణశేఖర్ ‘యుఫోరియా’ బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయింది. విశ్వక్ సేన్ ‘ఫంకీ’ డిజాస్టర్ జాబితాలో కలిసిపోయింది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఓకే అనిపించుకొందంతే. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. అయితే దానికి తగిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కాకపోతే.. రిజల్ట్ పరంగా చూస్తే చిత్రబృందం హ్యాపీ. గత వారం విడుదలైన `హే బలవంత్` కూడా నిరాశ పరిచింది.
ఈ ఫిబ్రవరి ‘విష్ణు విన్యాసం’తో ఎండ్ కార్డ్ పడబోతోంది. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఈమధ్యకాలంలో శ్రీవిష్ణు చేసిన ఎంటర్టైన్మెంట్ సినిమాలన్నీ బాగా ఆడాయి. ‘సామజవరగమన’, ‘సింగిల్’ చిత్రాలు కమర్షియల్ గా బాగా వర్కవుట్ అయ్యాయి. సో… ఈసారి కూడా అదే రిజల్ట్ వస్తుందని విష్ణు నమ్ముతున్నాడు. పైగా ఈవారం ఈ సినిమాకు పోటీ లేదు. ఈ సినిమా హిట్ ఖాతాలో చేరితే, ఫిబ్రవరిలో హిట్ లేని లోటు శ్రీవిష్ణు తీర్చినట్టు అవుతుంది. ఓవారం ఆగితే.. శ్రీవిష్ణు నుంచి ‘మృత్యుంజయ్’ వస్తుంది. ఓవారం గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల కావడం.. శ్రీవిష్ణు కెరీర్ లో ఇదే తొలిసారి. ఓకే రోజు ఈ రెండు సినిమాలూ విడుదల కావాల్సింది. కానీ ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొని, ఓవారం గ్యాప్ తో ‘మృత్యుంజయ్’ వస్తుంది.
