పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా భారత్ తన అవసరాలకు కావాల్సిన ముడిచమురులో సింహభాగం ఈ ప్రాంతం నుంచే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే సప్లై చైన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ముందే పసిగట్టిన ప్రధాని మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశీయంగా ఇంధన భద్రతను కాపాడటం, సంక్షోభ సమయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ సమావేశంలో ఇంధన పొదుపు , ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంపై ముఖ్యమంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలోని కొన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు నిల్వలను ఎలా నిర్వహించాలో చర్చించనున్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో భయాందోళనలు కలగకుండా చూడాలని ప్రధాని సూచించవచ్చు. ముఖ్యంగా రవాణా రంగంపై ఈ భారం పడకుండా రాష్ట్రాలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఈ సమావేశం క్షేత్రస్థాయి ప్రణాళికను సిద్ధం చేయనుంది.
ఆర్థిక కోణంలో చూస్తే, యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అదుపు చేయడంలో రాష్ట్రాల పాత్ర కీలకమని కేంద్రం భావిస్తోంది. ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు పన్నుల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఎగుమతి-దిగుమతులపై పడే ప్రభావం గురించి ఈ భేటీలో చర్చకు రానున్నాయి. కేంద్ర-రాష్ట్రాల సమన్వయంతోనే ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కోగలమని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేసే అవకాశం ఉంది.
