తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు సమ్మె విరమించాయి. రూ. ఐదు వేల కోట్లు ఇస్తే తప్ప మళ్లీ కాలేజీలు తెరిచేది లేదని భీష్మించుకున్న కాలేజీల యాజమాన్యాల సంఘం.. హడావుడిగా భట్టి విక్రమార్కతో మాట్లాడి వెంటనే సమ్మె విరమిస్తున్నామని ప్రకటించేశాయి. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇప్పటికిప్పుడు విడుదల చేయడం లేదు. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికలే కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
జూబ్లిహిల్స్ ఉపఎన్నికలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం.. రాజకీయంగా దెబ్బకొట్టే లక్ష్యాలతో ప్రైవేటుకాలేజీల యాజమాన్యాలు పెద్ద కుట్ర చేశాయన్న అనుమానాలు ప్రభుత్వంలో ఉన్నాయి. జూబ్లిహిల్స్ పోలింగ్ కు ముందు కాలేజీ పిల్లల్ని తీసుకు వచ్చి హైదరాబాద్ లో బహిరంగసభ ఏర్పాటు చేయాలని అనుకున్నారు.కానీ అనుమతి రాలేదు. ఈ లోపు కుట్రను తెలుసుకున్న రేవంత్.. తాట తీస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
అదే సమయంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు .. ప్రభుత్వంపై,అధికారులపై అనుచితంగా మాట్లాడారు. ఐఏఎస్ అధికారులపై ఘోరంగా మాట్లాడటంతో వారు కూడా ఫీలయ్యారు.ఖండన విడుదల చేశారు. పరిస్థితి విషమిస్తుందని తెలుసుకుని.. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం క్షమాపణలతో ఓ లేఖ అధికారులకు పంపారు. ప్రభుత్వం రూ.300 కోట్లు ఇస్తామంటే.. సరే అని సమ్మె విరమణ ప్రకటన చేశారు.