టాలీవుడ్ లోని ప్రతిభావంతమైన హాస్య నటుల్లో ప్రియదర్శి ఒకరు. ఓవైపు కమిడియన్‌గా చేస్తూనే, మరోవైపు హీరోగా అలరించాలని ప్రయత్నిస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ తన కెరీర్లో మర్చిపోలేని సినిమా. ‘మల్లేశం’, ‘కోర్ట్’ చిత్రాలు మరింత పేరు తీసుకొచ్చాయి. యేడాదికి హీరోగా రెండు మూడు సినిమాలు వదులుతున్నాడు. ఇటీవలే ‘మిత్రమండలి’తో పలకరించాడు. ఇప్పుడు ‘ప్రేమంటే’ అనే మరో ప్రయత్నం చేశాడు.
నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆనంది హీరోయిన్. యాంకర్ గా సుపరిచితమైన సుమ… ఓ కీలక పాత్రధారి. ఈనెల 21న విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు. ‘థ్రిల్ ప్రాప్తిరస్తు’ అనే ట్యాగ్ లైన్ కి తగట్టుగానే ఈ ట్రైలర్ ని థ్రిల్లింగ్ గా కట్ చేశారు. భార్యా భర్తల కథ ఇది. ఆనంది టిపికల్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు మూలం. మధ్యలో సుమ పాత్ర కూడా చిత్రంగా ఉంది. పేరుకే కానిస్టేబుల్. కానీ… హీరో, హీరోయిన్లని విడగొట్టే విచిత్రమైన క్యారెక్టర్ ఇది. ‘సారం లేని సంసారం వద్దు… విడాకులే ముద్దు’ అనే ఒక కొటేషన్ ని నమ్మి… భార్యాభర్తల మధ్య కలహాలు సృష్టిస్తుంటుంది. ఈ ముగ్గురి మధ్య నడిచే వినోదం ఎలా సాగిందో.. వెండి తెరపై చూడాల్సిందే.
ప్రియదర్శికి ఈ విజయం చాలా కీలకం. ఎందుకంటే గత చిత్రం ‘మిత్రమండలి’ బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ రిజల్ట్ దక్కించుకొంది. హీరోగా తన కెరీర్‌కు అదో ఝలక్. పైగా ఇది సోలో సినిమా. కాబట్టి.. హిట్టుతో ఫామ్ లోకి రావడం చాలా కీలకం.