బాలీవుడ్ సినీ పరిశ్రమను కొన్ని దశాబ్ధాలుగా ఏలుతున్న చక్రవర్తులు ఈ ముగ్గురు ఖాన్స్. సల్మాన్, షారుఖ్‌ల కంటే కూడా అమీర్ ఖాన్ మాత్రం కొన్ని సామాజిక విషయాలపైన తరచుగా స్పందిస్తూ ఉంటాడు. అసహనం లాంటి విషయాలపైన షారుఖ్ ఖాన్ కూడా మాట్లాడాడు. పాకిస్తాన్ కళాకారులకు జరుగుతున్న అన్యాయం గురించి తాజాగా సల్మాన్ ఖాన్ స్పందించాడు. అసహనం గురించి అమీర్, షారుఖ్ మాట్లాడిన మాటలు, ఇప్పుడు సల్మాన్ మాటలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ప్రజల ఆగ్రహం కొంత తగ్గాక షారుఖ్, అమీర్ ఖాన్లిద్దరూ కూడా తాము చెప్పాల్సిన సమాధానాలకు అవకాశం ఉండేలా పెయిడ్ జర్నిలిస్టుల చేత ప్రశ్నలు అడిగించుకుని, వాళ్ళు మాట్లాడిన మాటలకు వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా కొంత కాలం తర్వాత అదే విధంగా ప్రయత్నం చేస్తాడనడంలో సందేహం లేదు. అయితే ఆ వివరణ ఇచ్చేటప్పుడు మాత్రం విమర్శకులపైన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. లేకపోతే మీడియా ఓవర్ యాక్షన్ చేసిందని అంటున్నారు. అభిప్రాయాలు చెప్పే స్వాతంత్ర్యం లేకుండో పోతోందని ఆవేధన(?) చెందుతున్నారు. విమర్శకులు, మీడియా విషయం ఎలా ఉన్నా కూడా ఈ ముగ్గురు స్టార్ హీరోస్ చేస్తున్న తప్పు కూడా ఒకటుంది.
భారతదేశంలో ఉన్న చాలా సమస్యలపైన తన స్పందన ఏంటో దేశం మొత్తానికి తెలిసేలా చేశాడు అమీర్. మరి టెర్రరిజం, ఐసిస్ ఉగ్రవాద సంస్థ, లేకపోతే ఇండియాలో పుట్టి పెరిగిన యువకులు కూడా తీవ్రవాదానికి ఆకర్షితలవుతున్న విషయాలపైన ఎప్పుడైనా మాట్లాడాడా? తీవ్రవాద భావాలకు ఆకర్షితులవుతున్న యువతకు ఏమైనా సందేశం ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు. సినిమాల్లో ఇచ్చాడు కదా అని అనకండి. అలాగే భారతదేశం పైన ఎన్నో సార్లు ఉగ్రవాద దాడులు జరిగాయి. రీసెంట్గా పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత సైనికులను చంపేశారు. మరి ఈ ఖాన్స్ ముగ్గురూ ఎందుకు స్పందించలేదు. పాకిస్తాన్ కళాకారులకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, కళామతల్లి కంట కన్నీరు కార్చేస్తోందనే స్థాయిలో హడావిడి చేసేవాళ్ళకు సైనికుల కుటుంబాలు కనిపించవా? భారతీయుల బాధలు అర్థం కావా? పాకిస్తాన్ నుంచి వచ్చి భారతదేశ పౌరసత్వం తీసుకున్న అద్నాన్ సమీకి ఉన్నంత బాధ్యత కూడా ఈ ఖాన్స్‌కి ఉండదా? సర్జికల్ స్ర్టైక్స్ గురించి దేశంలో ఉన్న చాలా మంది స్పందించారు. మరి అమీర్, సల్మాన్, షారుఖ్‌లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. గుండెల్లోతుల్లో నుంచి మాట్లాడుతున్నా….అని అద్నాన్ సమీ ఎన్ని మంచి మాటలు చెప్పాడు. భారతదేశం, పాకిస్తాన్ పౌరులందరూ కూడా ఉగ్రవాదులను ఏరివేయాలని ఎంత సృజనాత్మకంగా, సునిశితంగా చెప్పుకొచ్చాడు. సామాజిక విషయాలపైన స్పందిస్తాం అనే కలరింగ్ ఇస్తూ ఉండే ఈ ముగ్గురు సూపర్ స్టార్స్‌కి ఇలాంటి విషయాలపైన ఎందుకు మాట్లాడరు?