ప్రొ.నాగేశ్వర్: ముందస్తుపై వెనకస్తు గందరగోళమా..? వ్యూహమా..?

తెలంగాణలో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలపై… గందరగోళంగా వ్యవహరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని ముందస్తు ఉంటుందని.. మరికొన్ని సార్లు ఉండకపోవచ్చన్నట్లుగా చెబుతున్నారు. కానీ ఇది గందరగోళం కాకపోవచ్చు. వ్యూహాత్మకం కూడా అయి ఉండవచ్చు. ప్రతిపక్షాలను గందరగోళానికి గురి చేయడానికి వేసిన ఎత్తుగడ అయి ఉండవచ్చు.

ముందస్తుకు వెళ్తే ఓడిపోతారా..?

ముందస్తుకు వెళ్తే అధికార పార్టీకి లాభమా..? నష్టమా..? అన్నదే ఇక్క పాయింట్. ఓటింగ్ శాతం పెరిగితే… ప్రతిపక్షాలకు లాభమని.. మన దేశంలో విశ్లేషిస్తారు. తగ్గితే అధికార పార్టీకి లాభమంటారు. ఓటింగ్ శాతం పెరిగితే… ప్రభుత్వంపై కోపంతో ప్రజలు కసిగా వచ్చి ఓట్లేశారని ప్రతిపక్ష పార్టీలు చెబుతూంటాయి. కానీ అధికార పార్టీ మాత్రం దీనికి విరుద్ధంగా విశ్లేషించుకుంటుంది. కానీ దేశంలో ఎక్కడా కూడా.. ఓటింగ్ శాతం పెరిగితే… అధికార పార్టీ ఓడిపోతుందని.. ప్రతిపక్షం గెలుస్తుందని… శాస్త్రీయంగా ఎక్కడా నిరూపణ కాలేదు. అలాగే ముందస్తు ఎన్నికలపై కూడా అలాంటిదే. ముందస్తుకు వెళ్తే.. అధికార పార్టీ కచ్చితంగా గెలుస్తుందని కానీ.. ఓడిపోతుందని కానీ ఎక్కడా లేదు. భారత దేశ ఎన్నికల చరిత్రలో చూస్తే ఇదే తెలుస్తుంది.

ముందస్తుకు వెళ్లి గెలిచిన వాళ్లెవరు..?

అయితే భారత రాజకీయాల్లో ఇది అసాధారణమేమీ కాదు. అధికార పార్టీలు మూడు నెలలు, ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా వెళ్లినప్పుడల్లా గెలుస్తారా అంటే… చెప్పలేదం. మనకు వాజ్‌పేయి ప్రభుత్వం ముందస్తున్న ఎన్నికలకు వెళ్లారు కానీ ఓడిపోయారు. చంద్రబాబు కూడా…అలిపిరి ఘటన తర్వాత సానుభూతి వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ గెలుపొందలేదు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు బీజేపీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఇండియా వెలిగిపోతోందని ప్రచారం చేసి.. వాజ్‌పేయి వద్దన్నా… అద్వానీ పట్టుబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ పరాజయం పాలయ్యారు. సానుభూతి గెలిపుస్తుందని చంద్రబాబు… ఇండియా వెలిగిపోతోందని ప్రచారంతో బీజేపీ .. మళ్లీ గెలిచేస్తామని.. ముందస్తుకు వెళ్లాయి. కానీ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా పరాజయం ఎదురొచ్చింది. కానీ 1999లో రెండు నెలల ముందు చంద్రబాబు ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు గెలిచారు. అంతకు ముందు 1983లో ఎన్టీఆర్ ప్రభంజనం… తట్టుకునేందుకు కాంగ్రెస్ ముందస్తుకు వెళ్లింది. కానీ గెలవలేకపోయింది. 1985, 1999లో తెలుగుదేశం పార్టీ ముందుగా ఎన్నికలకు వెళ్లి గెలవగలిగింది. 1969లో ఇందిరా గాంధీ.. కాంగ్రెస్ పార్టీ చీలిక నేపధ్యంలో.. ముందస్తుకు వెళ్లి గెలవగలిగింది. వీటిని చూస్తే.. ముందస్తుకు వెళ్తే.. గెలుస్తామని కానీ ఓడిపోతామని కానీ గ్యారంటీ లేదు.

ప్రజలకు ఏ కారణం చెబుతారు..?

ముందస్తుకు వెళ్తే.. ప్రజలకు ఏమని చెబుతారు..? ఏదో ఓ కారణం చెప్పాలి..? రాజ్యాంగ సంక్షోభం వచ్చిందా..? పార్టీలో చీలిక వచ్చిందా..?. ఇలాంటి కారణాలు ఏమైనా ఉంటే… ప్రజలకు కన్విన్స్ చేయవచ్చు. కానీ ఇప్పుడేం చెబుతారు..?. లోక్‌సభకు కూడా… ముందస్తు ఎన్నికలు రావని చెబుతున్నారు. అయినా తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు ఖాయమంటున్నారు. జమిలీ ఎన్నికలకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్… ఇప్పుడు జమిలి ఎన్నికలను కాదని.. ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడానికి కారణం ఏమిటి..? . లోక్‌సభ ఎన్నికలు కూడా.. ముందుగా వస్తే కేసీఆర్‌కు చెప్పుకోవడానికి ఓ కారణం ఉండేది. జమిలి ఎన్నికలకు తాము మద్దతిస్తున్నాం కాబట్టి… ఖర్చు తగ్గించుకోవడానికి పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పుకోవచ్చు. ఇప్పుడా అవకాశం కూడా లేదు. ఐదేళ్ల కాలానికి ప్రజలు అవకాశం ఇస్తే ముందుగానే ఎందుకు .. ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న చర్చ కచ్చితంగా ప్రజల్లో వస్తుంది.

ప్రజలను కన్విన్స్ చేయలేకపోతే ఇబ్బందే..!

అసెంబ్లీలో ఎంఐఎం, పార్లమెంట్‌లో బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికే టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్తోందన్న విమర్శలు ఇప్పటికే వస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలసి వెళ్లడం సాధ్యం కాదు కనుక… ముందస్తుగా ఎన్నికలకు వెళ్లి… ఎంఐఎంతో కలిసి ఎన్నికలు ఎదుర్కొని. పార్లమెంట్ కు వచ్చే సరికి..మళ్లీ బీజేపీతో జత కట్టే ఆలోచన చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణలో అన్నీ సానుకూలంగా ఉన్న సమయంలో ముందస్తుకు వెళ్లడానికి కారణం ఏమిటి..?. కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టింది. ఈ పథకాలన్నీ ప్రజల్లో ఆదరణ పొందాయని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వంద సీట్లు గ్యారంటీగా వస్తాయన్న ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీలో మెజార్టీ ఉంది. మరి అలాంటప్పుడు ముందస్తుకు వెళ్లడానికి తొందర ఎందుకు..?. ఈ విషయంపై ప్రజల అనుమానాలకు సంతృప్తికర సమాధానం ఇవ్వాల్సిందే. ప్రజలను కన్విన్స్ చేయకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.

ముందస్తు కోసం కేసీఆర్‌కు రాజకీయ కారణాలున్నాయి..!

కానీ ముందస్తుకు వెళ్లడానికి కేసీఆర్ కారణాలు కేసీఆర్‌కు ఉండొచ్చు. మార్చి, ఏప్రిల్ పంటలు చేతికొచ్చే సీజన్. గిట్టుబాటు ధరలు లేకపోతే.. రైతులు తీవ్ర అసంతృప్తితో ఉంటారు. అలాగే టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం కట్టు తప్పి పోతోంది. అలాగే.. విపక్ష పార్టీలు ఇంకా.. సమీకృతం కాలేదు. కాంగ్రెస్, టీడీపీ తెలంగాణలో కలసి పోటీ చేసే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు జరిపితే.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకునే అవకాశాల్ని నిలువరించవచ్చని కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చు. ఇలాంటి కారణాలతో… కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు.

వెనకస్తు వ్యూహాత్మకం కూడా కావొచ్చు..!

వీటన్నింటిని చూస్తే.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై వెనక్కి తగ్గారని చెప్పలేం. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని కూడా అంచనా వేసుకోవచ్చు. టీఆర్ఎస్ అధినేత ఎప్పుడు.. ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది కీలకం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.