టీవీ9 అమ్మకం : వివాదాల వల్లే ప్రక్రియ వేగవంతం అయిందా ?

టీవీ9 అమ్మకం : వివాదాల వల్లే ప్రక్రియ వేగవంతం అయిందా ?

“టీవీ9 అమ్మబోతున్నారహో” అనే రూమర్ చాలా ఏళ్లుగా వస్తున్నదే. ఆ వార్త అలా రావడం, వెంటనే దానిని టీవీ9 తరపున వారు ఖండించడం, యధా విధిగా జరుగుతూ ఉండేదే. ఒకసారి ‘మై హోమ్ గ్రూప్” వాళ్లు కొనబోతున్నారని, ఇంకొకసారి ‘మల్టీ నేషనల్ కంపెనీలు’ కొన్ని ముందుకు వచ్చాయని, మరొకసారి “కొన్ని (ఇతర భాషకి చెందిన )మీడియా గ్రూపులు” టీవీ9 తో చర్చలు జరుగుతున్నాయని, ఒకసారేమో, నెల రోజుల లోపే ప్రక్రియ ముగియబోతోందని, ఇంకోసారి రెండు మూడు నెలల్లో స్పష్టత రానుందని, ఇలా గత 10 ఏళ్ళుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈసారి వచ్చినంత బలంగా గతంలో ఇలాంటి వార్తలు ఎప్పుడు రాలేదు.

ఈసారి రూమర్ – ఇంతకీ ఎవరు కొంటున్నారట ? ఎంతకి కొంటున్నారట?

MEIL సంస్థ (Megha Engineering and Infrastructures Ltd ) అధిపతి కృష్ణారెడ్డి, మై హోమ్ అధినేత రామేశ్వరరావు, కలిసి వాటాలు కొనబోతున్నారని ఈసారి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీని రాజు, రవి ప్రకాష్ మరి కొంతమంది పేరిట వాటాలు ఉండగా, వాటిలో సింహ భాగం శ్రీని రాజుదే. ఇప్పుడు శ్రీనిరాజు మాత్రం “ఎగ్జిట్” కానున్నాడని, ఆ వాటాని కృష్ణారెడ్డి, మై హోం రామేశ్వరరావు కొనబోతున్నారని, రవిప్రకాష్ యధావిధిగా కొనసాగుతాడని, ఇలా వార్తలు వస్తున్నాయి. 500 కోట్లకు పైగానే ఈ డీల్ ఉండబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ అనధికారమైన వార్తలే , అనధికారమైన లెక్కలే. ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వివరాలు బయటకి రాకపోవచ్చు. ఒకవేళ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా పూర్తి వివరాలు బయటకు రావు.

అయితే వీటన్నింటి మధ్యలో- ఎందుకు ఇప్పుడు ఈ ప్రక్రియ ఇంత వేగవంతమైంది ఇటీవలికాలంలో టీవీ9 మీద ముసురుకుంటున్న వివాదాలే దీనికి కారణమా అనే చర్చ కూడా నడుస్తోంది.

టీవీ9 -బంగారు గుడ్లు పెట్టే బాతు

ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు న్యూస్ ఛానళ్లలో టీవీ9 ది నంబర్ వన్ స్థానం. అందరికంటే ముందుగా చానల్ ప్రారంభించడం వల్ల వచ్చిన “ఎర్లీ అడ్వాంటేజ్ ” కావచ్చు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి వాటికి మల్లె “రాజకీయ పార్టీకి సంబంధించిన మీడియా” అన్న ముద్ర పడకపోవడం కావచ్చు, వార్తల్లోని నాణ్యత కావచ్చు, సమాచారం లోని ఖచ్చితత్వం కావచ్చు, కొంతమంది విమర్శిస్తున్నట్టుగా సంచలనం కోసం ప్రాకులాడే ప్రోగ్రాంస్ కావచ్చు, వీటన్నింటి కారణంగా టీవీ9 అగ్రస్థానంలో కొనసాగుతోంది.వేరే ఛానెల్ లో ఏదైనా వార్త రాగానే (ఉదాహరణకి ఫలానా సెలెబ్రిటీ చనిపోయాడు అని) దానిని కంఫర్మ్ చేసుకోవడానికి జనాలు ఇప్పటికీ టీవీ9 చూస్తారంటే, అది ఆ ఛానెల్ క్రెడిబిలిటీ కి నిదర్శనం. అలాంటిది, అగ్రస్థానంలో కొనసాగుతున్న చానల్ను, బంగారు గుడ్లు పెట్టే బాతు ని, ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? ఎందుకు అమ్ముతున్నారు ?అన్న చర్చ సామాన్యుల్లో కూడా నడుస్తోంది.

టీవీ9 మీద ముసురుకుంటున్న వివాదాలే దీనికి కారణమా :

అయితే దీనికి ఇటీవల టీవీ9 మీద ముసురుకుంటున్న వివాదాలు కారణమని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. టీవీ9 మీద గతంలో కూడా అడపాదడపా చిన్న చిన్న వివాదాలు ఉన్నప్పటికీ, ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ దీన్ని “పచ్చ మీడియా” అంటూ విమర్శించి, అధికార పార్టీతో కుమ్మక్కయి తన మీద కుట్ర చేశారని తిరగబడిన తర్వాత, ఎంత కాదనుకున్నా ఎంతో కొంత డ్యామేజీ మాత్రం టీవీ9 కి జరిగింది. పవన్ కళ్యాణ్ ఆధారాలు చూప లేక పోయినప్పటికీ, టీవీ9 పవన్ కళ్యాణ్ మీద ఉద్దేశపూర్వకంగానే “వ్యక్తిత్వ హననానికి’ పాల్పడిందని మాత్రం ఆయన తన అభిమానులనే కాకుండా చాలామంది తటస్థుల ని కూడా నమ్మించగలిగాడు. దీంతో సహజంగానే చానల్ టీఆర్పి లు కూడా నేల చూపులు చూశాయి. టీవీ9 స్థాపించిన తర్వాత 14 ఏళ్లలో టీవీ9 మీద ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం మాత్రం ఈ నాలుగు నెలల్లోనే జరిగింది.

అమ్మడానికి ఇదే సరైన సమయమా?

అయితే ఈ మాత్రం వివాదాలకి ఎవరూ తమ వ్యాపారాన్ని అమ్మేసుకోరు. కాబట్టి కేవలం పవన్ కళ్యాణ్ వల్ల జరిగిన వివాదం కారణంగానే టీవీ9 అమ్మకం ప్రక్రియ జరిగిందని అనుకోవడానికి వీలులేదు. అయితే ఎప్పటినుండో అనుకుంటున్నదాన్ని ఈ వివాదం కాస్త వేగవంతం చేసి ఉండొచ్చు. కానీ, న్యూస్ ఛానల్ ల విషయంలో మార్కెట్ కూడా భలే విచిత్రంగా ఉంటుంది. ఎన్నికల ఏడాదిలో ఉన్నట్టుండి చానెళ్లకు భలే గిరాకి వస్తుంది. ఎన్నికలు అయిపోయాక మళ్లీ ఆ స్థాయి డిమాండ్ ఉండదు. అందుకే న్యూస్ ఛానల్ ల అమ్మకాలకు సంబంధించిన రూమర్లు కానీ, అమ్మకాలు గాని ఎన్నికల ఏడాదిలో జోరందుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పటినుంచో అమ్ముదామని ఉద్దేశ్యం ఉంది కాబట్టి, ఈ ఎన్నికల ఏడాదిలోనే ప్రక్రియను ముగించాలని కూడా టీవీ9 అధిపతి శ్రీనివాసరాజు భావించి ఉండవచ్చు. గతంలో కూడా ముందుగా టీవీ9 అమ్మకానికి సంబంధించిన రూమర్లు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో కేవలం ఆర్థిక వ్యవహారాలలో కుదరక పోవడం వల్లనే డీల్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. డీల్ సరిగ్గా కుదిరినందువల్లే శ్రీనిరాజు ఈసారి ముందుకు అడుగు వేసి ఉండవచ్చని ఒక విశ్లేషణ జరుగుతోంది.

మిగతా బిజినెస్ ల పై ప్రభావం

ఇక చర్చలోకి వస్తున్న మరొక కారణం ఏమిటంటే, టీవీ9 అధిపతి శ్రీని రాజుకి, మీడియా మాత్రమే కాకుండా వేరే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. అయితే టీవీ9 విషయంలో వస్తున్న వివాదాల కారణంగా, వస్తున్న తలనొప్పుల కారణంగా, మిగతా వ్యాపారాల మీద కూడా ప్రభావం పడుతుండడంతో, సరైన సమయంలో దీని నుంచి బయటపడాలని ఆయన భావిస్తున్నట్టు కూడా కొంతమంది విశ్లేషించారు.

“నెట్ వర్త్” మీద కొత్త ఛానెళ్ళ ప్రభావం:

ఇక ఇదే చర్చ లోకి వచ్చినా మరొక అంశం ఏమిటంటే, మీడియా రంగంలో పెరిగిపోతున్న పోటీ. ఇటీవలే మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ కూడా వార్తా చానల్ ని కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అలాగే ఇటీవల వచ్చిన ఒకటి రెండు కొత్త ఛానళ్లు కూడా బాగానే వ్యూయర్ షిప్ సంపాదించుకుంటున్నాయి. ఎంత అగ్రస్థానంలో ఉన్న ఛానల్ అయినా, వ్యూయర్ షిప్ ని మిగతా ఛానల్ లో కూడా పంచుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన కొత్త ఛానల్ లు బాగా బలపడితే ఆ ప్రభావం కూడా తమ చానల్ మీద, దాని “నెట్ వర్త్” మీద తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఎన్నికల ఏడాది ముగిసి పోవడమే కాకుండా, ఈ కొత్త ఛానళ్ల ప్రభావం పెరగడం కూడా పరోక్షంగా టీవీ నైన్ ‘నెట్ వర్త్’ ని తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఆ లెక్కన చూసుకున్నా కూడా బహుశా ఇది రైట్ టైం అని టీవీ9 అధిపతి భావించి ఉండవచ్చు.

టీవీ 9- 500 కోట్ల డీల్, స్టార్ మా 2,500కోట్ల తో పోలిస్తే తక్కువ

ఇక ఈ డీల్ ఎంతకు జరిగింది అన్న విషయం కూడా ఊహాగానాలే తప్ప అధికారిక ప్రకటనలు ఉండకపోవచ్చు. మా టీవీ ని స్టార్ యాజమాన్యానికి 2500 కోట్లకు అమ్మారని జాతీయ పత్రికలు ఆంగ్ల మీడియా చెబితే అవును కాబోలు అనుకోవడమే తప్ప ఎక్కడ అధికారిక ప్రకటన అయితే లేదు. వినోదాత్మక ఛానళ్ళ తో పోలిస్తే వార్త ఛానల్ లకు ఉండే పరిధి తక్కువ. టిఆర్పి రేటింగ్స్లో చూసినా కూడా, న్యూస్ ఛానల్ తో పోలిస్తే ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ప్రేక్షకాదరణ కలిగి ఉంటున్నాయి. ఆ లెక్కన ఛానల్ నెట్వర్త్ కూడా అదే నిష్పత్తిలో ఉండే అవకాశం ఉంది.

మున్ముందు ఎవరికి సపోర్ట్?

ఇక సామాన్యుల లో చర్చ జరుగుతున్న మరొక అంశం ఏమిటంటే, ఇప్పటిదాకా కాస్తోకూస్తో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న టీవీ9, యాజమాన్యం మారిన తర్వాత ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది అని. ఒకవేళ ఈ ప్రక్రియ ఈసారి పూర్తిగా సఫలమైతే ఆ ప్రశ్నకు సమాధానం అతి కొద్ది నెలల్లోనే తెలుస్తోంది.

మై హోం అధినేత ఉన్నాడు కాబట్టి, తెలంగాణా లో టీఆరెస్ కి మద్దతు పలకవచ్చని టీఆరెస్ అభిమానులు అంటున్నారు. ఇక MEIL కృష్ణారెడ్డి సామాజిక వర్గం చూసి తమ పార్టీ కే సపోర్ట్ ఉంటుందని వైఎస్సార్సీపీ అభిమానులు భావిస్తూంటే, ఆంధ్ర ప్రభుత్వం లో MEIL ప్రాజెక్టులు చేపడుతోంది కాబట్టి టిడిపి కి సపోర్ట్ చేస్తుందని తెలుగుదేశం అభిమానులు భావిస్తున్నారు. ఇక మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ లో భాగంగా ఉన్న టర్బో మేఘా అధ్వర్యం లో నడుస్తున్న ట్రూజెట్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ భాగస్వామి కాబట్టి జనసేన కి మద్దతిస్తుందని, జనసేన అభిమానులు లాజిక్ చెప్తున్నారు.

ఈ చర్చ లో దుస్థితి ఏమిటంటే – ఛానెల్ అన్నాక ఏదో ఒక పార్టీకి ఖచ్చితంగా వంత పాడాల్సిందేనన్న స్థాయి కి ఫోర్త్ మీడియా మీద జనాల అభిప్రాయం బలపడటం మన ప్రజాస్వామ్య దుస్థితి ని సూచిస్తోంది.

ఇంతకీ ఈ వార్త విషయంలో టీవీ9 వెర్షన్ ఏంటి?

టీవీ9 యాజమాన్యం మారుతోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో ఎవరికి తోచినట్టు వాళ్ళు రాస్తుండగా, అధికారికంగా టీవీ9 కూడా దీనిపై స్పందించింది. టీవీ9 ప్రకటన మేరకు చూస్తే , ఇది కేవలం యాజమాన్యం మార్పే తప్ప మేనేజ్మెంట్ లో ఎటువంటి మార్పు ఉండదు. అంటే శ్రీని రాజు తన వాటా విక్రయం చేసుకున్న తర్వాత, వేరేవాళ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి టీవీ9 లో భాగస్వాములు అయినప్పటికీ మేనేజ్మెంట్ మాత్రం టివి 9 సీఈఓ రవిప్రకాష్ ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది మరియు తన టీమ్ లో ఎటువంటి మార్పు చేర్పులు ఉండవు. అలాగే టీవీ9 ని విస్తరించే విషయంలో కానీ, మరింతగా అభివృద్ధి చేసే విషయంలో కానీ, టీవీ9 ఇదివరకే అనుకున్న ప్రణాళికలోనూ , అలాగే ఆ ప్రణాళికలను అమలు చేసే విషయంలోనూ ఎటువంటి మార్పుచేర్పులు ఉండబోవు. ఒకవేళ ఈ ప్రకటనను ప్రామాణికంగా తీసుకున్నట్లయితే గనక, టీవీ9 ఇప్పటివరకు ఎలా ఉందో ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుందని భావించవచ్చు. అయితే ఇది అధికారికమైన ప్రకటన అని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది

తుది ప్రకటన వచ్చే వరకూ సస్పెన్సే

వ్యాపారంలో సరైన సమయంలో ఎంటర్ అవడం ఎంత ముఖ్యమో సరైన సమయంలో ఎగ్జిట్ అవడం కూడా అంతే ముఖ్యమని బిజినెస్ పాఠాలలో చెబుతూ ఉంటారు. ఈ లెక్కన అనవసరమైన వివాదాలు, దానివల్ల మిగతా వ్యాపారాల మీద వచ్చి పడుతున్న తలనొప్పులు, అనుకున్న ధర రావడం, ఎన్నికల ఏడాది గడిస్తే లెక్కలు మారిపోవడం, కొత్త ఛానళ్ల ప్రభావం ఎంతో కొంత ఉండడం – బహుశా ఇవన్నీ ఎంతో కొంత ప్రభావం చూపి ఉండవచ్చు అన్న చర్చ సామాన్యుల లో జరుగుతోంది. బహుశా ఆ సామాన్యుల జీవన శైలిలో ఈ ఛానల్ ఒక భాగం కావడం వల్ల అలాంటి చర్చ జరుగుతూ ఉండవచ్చు.

అయితే ఇవన్నీ కేవలం సామాన్యుల చర్చలో భాగంగా వచ్చిన అంశాలు. వీటికి మించిన వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా అన్నది మాత్రం సామాన్యులకి తెలిసే అవకాశం లేదు. ఏది ఏమైనా ఈ సారైనా ఈ రూమర్ నిజమవుతుందా లేదా అనేది తుది ప్రకటన వచ్చే వరకూ సస్పెన్సే!

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close