ప్రొ.నాగేశ్వర్ : టీఆర్ఎస్‌కు మహాకూటమి పోటీ ఇస్తుందా..?

తెలంగాణలో మహాకూటమి రెడీ అవుతోంది. మహాకూటమి టీఆర్ఎస్‌ను ఓడించగలుగుతుందా.. అన్న ఆసక్తి రాజకీయాల్లో ప్రారంభమయింది. ఈ మహాకూటమి ఫలితాలను ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేము. అది అనుభవమే చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మహాకూటమి విషయంలో భిన్నమైన అనుభవాలు చూశాయి. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్, లెఫ్ట్ కలిసి టీడీపీని ఓడించాయి. 2009లో టీడీపీ, టీఆర్ఎస్, లెఫ్ట్ కలిసి.. కాంగ్రెస్ పార్టీని ఓడించలేకపోయాయి.

మహాకూటమికి నాయకుడు ఎవరు..?

తెలంగాణలో మహాకూటమి కట్టడం వల్ల టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పలేము. కానీ.. మహాకూటమి వల్ల బలాలు పోగవుతాయి. చిన్నాచితకో.. కొద్దో గొప్పో… బలం పోగవడం వల్ల… బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మహాకూటమి విషయంలో… ఓ పెద్ద సవాల్‌గా ఉన్న వ్యవహారం…నాయకత్వం. టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. మరి మహాకూటమి గెలిస్తే.. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు..? ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అవుతాను అంటే.. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమస్య అది. మనం ఔనన్నా.. కాదన్నా.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ని ఎన్నుకుంటారు. కానీ.. ఆ ముఖ్యమంత్రిగా బలమైన నాయకుడిగా ఎదురుగా ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. 2004లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై అధికార వ్యతిరేకత ఉన్నప్పుడు… రాజశేఖర్ రెడ్డి ఓ బలమైన నాయకుడిగా ప్రజల ముందు నిలబడ్డారు. ఆయనను ప్రజలు ఆదరించారు. ఇలా చూడటం వల్ల ప్రతిపక్ష కూటమికి ఎవరు నాయకుడు..?. కేసీఆర్‌కు ధీటైన నాయకుడు ఎవరన్నది ప్రజలకు చూపించగలగాలి.

కేసీఆర్‌పై ఎదురు దాడి చేసే నెతలెవరున్నారు..?

కేసీఆర్‌ను రాజకీయంగా మాత్రమే కాదు..మాటలతోనూ ఎదుర్కొనే సత్తా విపక్ష పార్టీల్ల ఎవరికీ లేదు. కేసీఆర్ చేసే విమర్శలను తిప్పికొట్టే పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో చూస్తే.. కేసీఆర్ విమర్శలు చేస్తారు. దాన్ని తిప్పికొట్టాడనికే సమయం కేటాయిస్తూంటారు. హుస్నాబాద్‌లో జానారెడ్డిపై కేసీఆర్ ఆరోపణలు చేశారు. ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇస్తే..టీఆర్ఎస్‌కు ప్రచారం చేస్తానని జానారెడ్డి అన్నట్లుగా కేసీఆర్ చెప్పారు. దానిపై.. జానారెడ్డి ప్రెస్ మీట్.. పెట్టి.. తను ఎప్పుడూ అలా అనలేదని చెప్పుకొచ్చారు. అంటే.. కేసీఆర్ అలా బురదజల్లేస్తూ ఉంటారు. వీళ్లు అలా తుడుచుకుంటూ ఉంటారు. ఆటలో కేసీఆర్ ఎప్పుడూ బౌన్సర్లు వేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ ఆడుతూనే ఉంది. అలా కాకుండా.. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పై బౌన్సర్లు వేయాలి. అలా వేయలేనంత కాలం… కేసీఆర్‌పై విపక్షాలు పైచేయి సాధించే అవకాశం లేదు.

కేసీఆర్‌ గేమ్‌లో పావులుగా ఉన్నంత కాలం గెలవగలరా..?

అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీని బపూన్ అని కేసీఆర్ విమర్శించారు. అప్పట్నుంచి.. రాహుల్ గాంధీని బపూన్ అంటావా అని ప్రతి విమర్శలు చేస్తున్నారు కానీ… పెట్రోల్ ధరలు ఇంత పెరుగుతున్నాయి..? ఎందుకు స్పందించడం లేదని.. ఒక్క నాయకుడైనా ప్రశ్నించారా..? రాష్ట్ర పన్నులు తగ్గించమని ఎవరైనా అడిగారా..? పెట్రో రేట్లు పెంచుతున్నా.. మోడీకి మద్దతు ఎందుకిస్తావని.. ఎవరైనా ప్రశ్నించారా..? లేదు. అలా చేయకుండా.. ఎప్పుడూ.. కేసీఆర్ చేసే విమర్శలకు కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతే.. ఎప్పటికీ గెలవలేరు. కూటమిలు కట్టడమే కాదు.. చర్చల్లోనూ పైచేయి సాధించాలి. కేసీఆర్‌కు గట్టిగా కౌంటర్ ఇస్తే.. సోషల్ మీడియా ద్వారా… క్షణాల్లో కోట్ల మందికి చేరుతుంది. అలా చేయడం లేదు. కేసీఆర్‌ విసిరే బంతుల్ని పట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ అంతా పరుగెడుతున్నంత కాలం..కేసీఆర్‌కు చాలెంజ్ ఎదురయ్యే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com