ప్రొ.నాగేశ్వర్ : ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు ఎలా..? నివారించలేమా..?

తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో అనేక రకాల తప్పులు దొర్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని వేల మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ బోర్డు ముందు కొంత మంది తల్లిదండ్రులు కూడా ధర్నాలు చేశారు. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న కారణంగా కొంత మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం ఎక్కడా లేని విధంగా జరుగుతోంది. దాంతో.. తెలంగాణలో ఇంటర్ పరీక్షల వివాదం.. కలకలంగా మారింది.

అధికారుల నిర్లక్ష్యమే విద్యార్థుల పట్ల శాపం..!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాల్లో అనేక తప్పులు బయట పడ్డాయి. పరీక్ష రాయకపోయినా… రాసిటన్లుగా చేసి మార్కులు వేశారు. రాసిన వాళ్లకు ఆబ్సెంట్ వేశారు. అలాగే.. మొదటి ఏడాది 90 శాతానికిపైగా మార్కులు తెచ్చుకున్న వారికి రెండో ఏడాది.. ఒక్కో సబ్జెక్ట్‌లో సున్నా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివి అనేకం జరిగినట్లు ఆరోపణలు వచ్చినా… ఇంటర్ బోర్డ్ అధికారులు చాలా క్యాజువల్‌గా వ్యవహరిస్తున్నారు. పది లక్షల మంది పరీక్షలు రాసినప్పుడు.. ఒకటో .. రెండో తప్పులు జరుగుతాయి కదా.. అన్నట్లుగా ఇంటర్ బోర్డు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. పది లక్షల మంది రాసినా.. ఇరవై లక్షల మంది రాసినా.. ఒక్క తప్పు కూడా జరగకూడదు. ఒక్క తప్పు జరిగినా.. ఒక్క విద్యార్థి జీవితంపై ఆ ప్రభావం జరుగుతుంది. ఓట్లు గల్లంతు అయిపోయిన తర్వాత తీరిగ్గా ఎన్నికల సంఘం సారీ చెప్పినట్లుగానే… ఆ ప్రభావం ఉంటుంది. అన్ని కోట్ల మంది ఓటర్లను నమోదు చేసుకున్నప్పుడు.. జరగకుండా ఉంటాయా.. అన్న భావనలో వారున్నారు. ఎన్ని లక్షల మంది రాశారన్నది లెక్క కాదు… ఆ లెక్కకు తగ్గట్లుగా… వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అంతే కానీ నిర్లక్ష్యంగా ఉండటం కరెక్ట్ కాదు

ఎంసెట్ లీకేజీ సహా అనేక గందరగోళాలు..! తప్పెక్కడ జరుగుతోంది..?

తమ పిల్లలకు అన్యాయం జరిగిందని.. విద్యార్థుల తల్లిదండ్రులొస్తే… రీ వాల్యూయేషన్ పెట్టుకోండి.. రీ వెరీఫికేషన్ చేయించుకోండి.. అని నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడం తప్పు. అది పరిష్కారం కాదు. ఈ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కాబట్టి… మేము తప్పులు చేసుకుంటామని… చెప్పడం… పద్దతి కాదు. అదే సమయంలో… మార్కుల మూల్యంకనాన్ని చేసే కాంట్రాక్ట్‌ను… ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే.. వారి కంపెనీకి.. అదీ కూడా అనుభవం లేని వారికి ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి ప్రచారం… ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఇంటర్ బోర్డు కమిషనర్‌ను టార్గెట్ చేయడం మాత్రమే కాదు.. బాధ్యతను .. మంత్రి తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకోవాలి. ఈ తప్పిదాలకు విద్యామంత్రిది తప్పిదం కాకపోవచ్చు కానీ.. ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి. రెండు సార్లు ఎంసెట్ పేపర్ లీక్ అయింది. ఎవరు చేశారో ఇంత వరకూ కనిపెట్టలేకపోయారు. ప్రతీసారి గందరగోళం ఏర్పడుతోంది. అయినా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు లేవు. గందరోగళం ఏర్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించడం లేదు.

మళ్లీ మళ్లీ తప్పులు జరగకుండా… ప్రభుత్వం ఏం చేస్తుంది..?

అసలు సమస్య ఎక్కడ వస్తుందో ముందుగా గుర్తించాలి. ఎగ్జామినర్ తప్పులు చేస్తున్నారా..?. ఎగ్జామినర్ తప్పులు చేస్తే.. పై అధికారి క్రాస్ ఎగ్జామిన్ చేసే ప్రయత్నం ఉండాలి. ఒకప్పుడు జూనియర్ లెక్చరర్లు ఎక్కువగా ఉండేవారు. వారు ఎగ్జామినర్‌గా పేపర్లు దిద్దేవారు. కానీ.. ఇప్పుడు ప్రైవేటు కాలేజీల నుంచి లెక్చరర్లు వచ్చింది. ఎవాల్యూయేషన్ చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు తప్పులు చేస్తే ఉద్యోగం పోతుందన్న భయం ఉంటుంది. ప్రైవేటు లెక్చరర్లకు అవి ఉండవు. ఇప్పుడు ఎక్కడ ఎక్కువగా తప్పులు జరుగుతున్నాయంటే… పేపర్లు దిద్దడంలో కాదు.. దిద్దిన పేపర్లపై ఉన్న మార్కులను… ట్యాబ్లెట్ చేయడంలో తప్పులు వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అందుకే… పేపర్లు దిద్దినప్పుడు వచ్చిన మార్కులు.. నిజంగానే ప్రకటించారా.. అన్నదాన్ని.. విద్యార్థులకు తెలిసేలా చేయగాలి. విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని సరి చేయాలి. జరిగిన తప్పులు.. మళ్లీ.. మళ్లీ జరగకుండా… జాగ్రత్తలు తీసుకోవాలి. ఓ కమిటీని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రెడీ చేసుకుంది. విద్యావంతులతో కూడిన… ఓ ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయడం మంచిది. ఇంటర్ బోర్డు వద్దకు వెళ్తే న్యాయం జరగదని.. భావించేవారు ఆ వ్యవస్థను ఆశ్రయించేలా అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా సంస్థాగతంగా… జరిగే తప్పులను దిద్దుకునే ప్రయత్నం చేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.