ప్రొ.నాగేశ్వర్ : చంద్రుల విమర్శల్లో ఎవరి మాట నిజం..?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చాలా ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత డర్టియస్ట్ పొలిటిషియన్ అన్నారు. దీనిపై చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఫెడరల్ ఫ్రయత్నాలు సాగక.. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తనపై చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశానికి కౌంటర్ ఇచ్చారు. వీరిలో ఎవరు చెప్పేది నిజం..?

హైకోర్టు విషయంలో చంద్రబాబు మాట మార్చారా..?

రాజకీయ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటారు. వారు చెప్పే దాంట్లో… వంద శాతం సత్యం కానీ.. అసత్యం కాని ఉండదు. వారికి ఆ సమయంలో ఏది ఉపయోగమో… ప్రత్యర్థిని విమర్శించడానికి ఎలాంటి విమర్శలు కావాలో.. అలాంటివే చేస్తారు. వారు అక్కడ రాజకీయ ప్రయోజనమే చూసుకుంటారు తప్ప… విమర్శలు నిజాలున్నాయా.. అబద్దాలున్నాయా అన్నది చూసుకోరు. హైకోర్టును హడావుడిగా విభజించారని చంద్రబాబు వ్యాఖ్యలపై.. కేసీఆర్ .. తీవ్రంగా విరుచుకుపడ్డారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి కోర్టు భవనాలుసిద్ధం చేస్తామని అఫిడవిట్ ఇచ్చారని.. అయినా ఎందుకు రెడీ చేయలేదని … కేసీఆర్ అంటున్నారు. అది నిజమే. ఎందుకంటే… ఇప్పటికి రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లవుతోంది అసెంబ్లీ, సెక్రటేరియట్ అన్నీ.. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించారు, హైకోర్టును మాత్రం ఎందుకు తరలించలేదు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి హైకోర్టు విభజన విషయంలో కొన్ని ఆప్షన్లు ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఉన్న భవనాన్ని ఏపీ హైకోర్టుకు ఇచ్చేయడానికి సిద్ధపడింది. తామే వేరే చోట పెట్టుకుంటామన్నారు. అదీ కాకకపోతే.. ఉన్న భవనంలోనే రెండు హైకోర్టులు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. దానికీ అంగీకారం తెలియజేయలేదు. అలాంటప్పుడు… కొత్త భవనాన్ని గడువులోపు.. సిద్ధం చేయాలి కదా. ఈ విషయంలో కేసీఆర్ వాదన నిజమే..!

ప్రత్యేకహోదాపై కేసీఆర్, చంద్రబాబు ఎప్పుడైనా ఒక మాట మీదున్నారా..?

ప్రత్యేకహోదా విషయంలో.. ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు నిజమే. చంద్రబాబునాయుడు మొదట్లో ప్రత్యేకహోదా కావాలన్నారు.. ఆ తర్వాత ప్యాకేజీ ఇస్తామంటే.. అంగీకరించారు. అందుకు సమర్థించడానికి ప్రత్యేకహోదా సంజీవని కాదని.. మరొకటని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో చంద్రబాబుపై కేసీఆర్ చేసిన విమర్శ నిజమే. అదే సమయంలో కేసీఆర్ కూడా… అదే చేశారు కదా..! టీఆర్ఎస్ మొదట్లో.. ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతు పలికింది. పార్లమెంట్‌లో కవిత, కేకే కూడా.,. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్నట్లుగా మాట్లాడారు. కానీ.. ఎన్నికల సమయంలో ఏం చేశారు..? ఏపీకి ప్రత్యేకహోదా ఎట్లా ఇస్తారని.. మాట్లాడారు. పార్లమెంట్‌లో వినోద్ కుమార్ కూడా… అదే చెప్పారు. ఇక ఎన్నికల ప్రచారం.. సోనియా గాంధీ మేడ్చల్ సభలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెబితే.. తెలంగాణ గడ్డపై నుంచి.. ఏపీకి హామీ ఎలా ఇస్తారని.. ఆమెపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో.. ప్రత్యేకహోదాను.. టీఆర్ఎస్ నేతలంతా ఉపయోగించుకుని సెంటిమెంట్ రెచ్చగొట్టారు. ఇప్పుడు మాత్రం.. కేసీఆర్ అవసరం అయితే తాను లేఖ రాస్తానంటూ.. చెబుతున్నారు. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులూ మాటమార్చారు.

ఎన్టీఆర్ ఉన్న సమయంలోనే అసలైన టీడీపీ ఏదో ప్రజలే చెప్పారు కదా..?

ఇక మామ నుంచి చంద్రబాబు పార్టీ లాక్కున్నారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో.. కేసీఆర్.. చంద్రబాబు వెనకే ఉన్నారు కదా..! అదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పుకొచ్చారు. వైశ్రాయ్ సిద్ధాంతకర్త అయనే అని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్ ఎందుకు ఈ విమర్శలు చేశారో కానీ… అది తెలుగుదేశం అంతర్గత వ్యవహారం. అప్పట్లో ఆయన టీడీపీలోనే ఉన్నారు. ప్రజలకు కూడా ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని చెప్పారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశమే అసలైన తెలుగుదేశం అని… ఎన్టీఆర్ కాలంలోనే ప్రజలు తీర్పు చెప్పారు. ఎన్టీఆర్ తర్వాత లక్ష్మిపార్వితి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నా… ప్రజలు తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా అంతిమ తీర్పు… ప్రజలు ఇచ్చేదే. కాబట్టి… ఆ విషయాన్ని ఇప్పుడు లేవనెత్తడం ద్వారా సాధించిందేమీ ఉండదు.

ఐటీ అభివృద్ధి, అమరావతిపై కేసీఆర్ విమర్శల్లో నిజం లేదా..?

ఇక హైదరాబాద్‌ ఐటీకి చంద్రబాబు ఏమీ చేయలేదని కేసీఆర్ అన్నారు. భౌగోళిక పరిస్థితుల వల్లే ఐటీ రంగం వచ్చిందని.. చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఓ సందర్భంలో కేటీఆర్… హైదరాబాద్ లోని ఐటీ రంగం.. చంద్రబాబు కృషేనని చెప్పుకొచ్చారు. మరి ఎవరిది నిజం..?. భౌగోళిక పరిస్థితులతో పాటు … అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కృషి వల్లనే ఐటీ రంగం అభివృద్ధి సాధించింది. ఇక రాజధానికి రూ. 1500 కోట్లు ఇచ్చారు చాలదా..అంటూ.. కేసీఆర్… మోడీని సమర్థించినట్లుగా మాట్లాడారు. రాజధానికి రూ. 1500 కోట్లు సరిపోతాయా..? ఈ విషయంలో.. కేసీఆర్ మోడీని సమర్థించినట్లుగా మాట్లాడారు. హైదరాబాద్ ను తలదన్నే.. ఢిల్లీ ఆసూయపడే రాజధాని ఇస్తారని.. ఏమీ ఇవ్వకుండా.. ఏదో ఇచ్చినట్లు… చెప్పడం అసంబద్ధం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.