ప్రొ.నాగేశ్వర్ : టీఆర్ఎస్‌లో ఆపరేషన్ వికర్ష్‌ ఎందుకు..?

తెలంగాణ రాష్ట్ర సమితికి .. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ.. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేసింది. ఇప్పుడు ఆపరేషన్ వికర్ష్ ప్రారంభమయింది. అయితే.. ఒక్క చేవెళ్ల ఎంపీ రాజీనామా చేసినంత మాత్రం.. టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోతుందని.. కేసీఆర్ పట్టాభిషేకం ఆగిపోతుందని చెప్పడం కరెక్ట్ కాదు. అలాగని…కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఏ ప్రభావం ఉండదని కాదు. కచ్చితంగా ఎంపీ రాజీనామా ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్ర సమితిపై ఉంటుంది.

అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎందుకెళ్లిపోతున్నారు..?

సాధారణంగా.. ఎన్నికల్లో రాజకీయ పార్టీ గెలుపునకు కానీ.. ఓటమికి కాని అనేక కారణాలు ఉంటాయి. ఏ ఒక్క కారణమో.. బలంగా.. బలీయంగా.. ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్దేశించదు. కానీ.. కొంత ప్రభావం చూపిస్తుంది. బెల్లం ఉన్న చోటనే ఈగలు ఉంటాయన్నట్లు.. రాజకీయ నాయకులు ఎక్కువగా అధికార పార్టీలోనే ఉండటానికి ఆసక్తి చూపిస్తారు. దీనికి భిన్నంగా మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుందని… కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని.. పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ ఎంపీ ఎందుకు రాజీనామా చేస్తారు..?. రేవంత్ రెడ్డి… ఇద్దరు ఎంపీల పేర్లు చెప్పకుండానే.. టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని.. ధైర్యం ఉంటే ఆపుకోండి.. అని సవాల్ చేశారు. ఆయన పేర్లు చెప్పకపోయినా… పత్రికల్లో ఆ ఇద్దరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీతారామ్ నాయక్‌లు అని ప్రచారం జరిగింది. ఇద్దరూ ఖండించారు. కానీ.. ఐదు రోజుల్లోనే.. ఓ వికెట్ పడిపోయింది. సోనియా సమక్షంలో.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. పట్నం మహేందర్ రెడ్డిపై విమర్శలు చేశారు.

నేతలు వెళ్లిపోతే టీఆర్ఎస్‌కు ఓటమి ఖాయమవుతుందా..?

నాకు బాగా గుర్తు.. పట్నం మహేందర్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పక్కన కూర్చున్నారు. ఆ ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర సమితిని తీవ్రంగా విమర్శించారు. సాయంత్రానికి ఢిల్లీ వెళ్లి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. రాజకీయ నాయకుల తీరే ఇంతే ఉంటుంది. ఐదు రోజుల కిందట.. తాను టీఆర్ఎస్‌కు రాజీనామా చేయడం లేదని ప్రకటించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఐదు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి చెప్పిన రెండో ఎంపీ ఎవరు..? సీతారామ్ నాయక్ తను కాదని పదే పదే వివరణ ఇస్తున్నారు. దానికి ఆయన చెప్పే కారణాలు ఆయన చెబుతున్నారు. మరి రెండో ఎంపీ ఎవరు..?. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డినా..? ఆయన కొద్ది రోజుల క్రితం.. కాంగ్రెస్ లో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారని ప్రచారం జరిగింది. అందుకే ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని కూడా చెప్పుకున్నారు. ఇంకా ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారని చెబుతున్నారు. అందువల్ల … అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. నేతలు వెళ్లిపోతున్నారంటే.. కచ్చితంగా అది ఓ సూచన లాంటిది. ఎ ఎదురుదెబ్బ తగిలినట్లే. అయితే.. దీనితోనే.. టీఆర్ఎస్‌కు ఓటమి ఎదురవుతుందని చెప్పలేం.

ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ల పెత్తనం వల్లే సమస్యలా..?

కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. రాజీనామా చేస్తూ.. చెప్పిన విషయాల్లో పండమెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన లేవనెత్తిన విషయం ముఖ్యమైనదే. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పని చేస్తున్న వారికి.. టీఆర్ఎస్‌లో ఫక్తు రాజకీయవాదంతో.. అవకాశవాదంతో చేరిన వారికి మధ్య.. టీఆర్ఎస్‌లో ఓ ఘర్షణ వాతావరణం ఉంది. ఉద్యమ కాలంలో.. ఉద్యమకారులపై దాడులు చేసినవారు.. ఉద్యమ ఫలంతో వచ్చిన తెలంగాణలో… కూడా.. వారే డామినేట్ చేస్తున్నారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. నాయిని నర్సింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు.. బహిరంగంగానే చెప్పారు… ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది. మహేందర్ రెడ్డి కూడా.. ఉద్యమకారులపై కేసులు కూడా పెట్టించారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం మొత్తం ఆయన అనుభవిస్తున్నారు. ఇదే ఆరోపణలు కొండా సురేఖపై కూడా వచ్చాయి. మహబూబా బాద్‌లో కొండా దంపతులు.. ఉద్యమకారులపై తుపాకులు ఎక్కుపెట్టారు. తర్వాత వాళ్లు టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు టిక్కెట్ రాదనుకునే.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. లేకపోతే వాళ్లు.. టీఆర్ఎస్‌లో ఉండేవాళ్లు కదా..!. టీఆర్ఎస్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పక తప్పదు.

ఉద్యమ వ్యతిరేకుల ఆధిపత్యంపై కేసీఆర్ సమాధానం ఇస్తారా..?

తెలంగాణలో ఉద్యమకారులకు.. టీఆర్ఎస్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్లు కాదు.. ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లు…వాళ్లు ఇవ్వాళ.. టీఆర్ఎస్‌లో పెత్తనం చేస్తున్నారు. వాళ్లే ఇవాళ కోదండరాంపై కూడా దాడి చేస్తున్నారు. దాని ప్రకంపనలు ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామాలపై పడుతుంది. వరుసగా.. ఇలాంటివి కొన్ని జరిగితే.. కచ్చితంగా ఆ ప్రభావం అధికార పార్టీపై తీవ్రంగా ఉంటుంది. ఎంత మేర ఉంటుందనేది మాత్రం చెప్పలేం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.