ప్రొ.నాగేశ్వర్ : ఇప్పటికే కింగ్‌ మేకర్ అయిన పవన్ కల్యాణ్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు.. కీలక మలుపులు తిరుగుతున్నాయి. పవన్ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోతోందని… సాక్షి పత్రిక ప్రచారం చేస్తోంది. అదే సమయంలో.. కేటీఆర్.. ఏపీలో జగన్ గెలుస్తారని చెబుతున్నారు. టీడీపీ కూడా.. తాము ముందు నుంచీ చెబుతున్నామని.. ఏపీలో టీడీపీని ఓడించాడనికి జగన్, మోడీ, కేసీఆర్ ఏకమయ్యారని… తాజా పరిణామాలతో నిరూపితమయిందని అంటున్నారు. దీంతో ఎవరు ఎవరి వైపు ఉన్నారనే చర్చ రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.

జనసేనకు వచ్చే ఓటింగే విజేత ఎవరో తేల్చబోతోందా..?

తెలుగుదేశం పార్టీ అధినేత చాలా కాలం పాటు… మోడీ, జగన్, పవన్‌, కేసీఆర్‌లు కలిసి.. తెలుగుదేశం పార్టీపై దండయాత్రకు వస్తున్నరని చెప్పారు. కాని ఈ మధ్య కాలంలో.. పవన్‌ను ఆ జాబితా నుంచి తొలగించారు. చాలా కాలం పాటు.. మోడీ, జగన్, పవన్, కేసీఆర్ .. తమపైకి వస్తున్నారని చెప్పిన ఆయన ఆకస్మాత్‌గా పవన్ కల్యాణ్‌ను ఈ జాబితా నుంచి తొలగించారు. అప్పట్నుంచే రాజకీయవర్గాల్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. పవన్ కల్యాణ్ అభిమానులు.. తమ నేత .. ముఖ్యమంత్రి అవుతారని అశిస్తున్నారు. కనీసం కింగ్ మేకర్ అయినా అవుతారనే అంచనాలో ఉన్నారు. కానీ.. పవన్ కల్యాణ్.. ఇప్పుడే కింగ్ మేకర్ అయిపోయారు. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఇప్పుడు హోరాహోరీగా ఉంది. ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. గత ఎన్నికల ఫలితాల్లో.. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా రెండు మాత్రమే ఉంది. అప్పటితో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. బీజేపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఆ పార్టీకీ.. ఏ నియోజకవర్గంలో అయినా వెయ్యి ఓట్లు వస్తే.. గొప్ప అన్నట్లుగా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ ఏపీలో లీడర్లు, క్యాడర్లు, ఓటర్లు లేని పార్టీగా మారిపోయింది. రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా.. మరొకరు వచ్చి ప్రచారం చేసినా.. కాంగ్రెస్ మిత్రులకు లాభం కలుగుతుంది కానీ… కాంగ్రెస్‌కు లాభం కలిగే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ఎటు వైపు ఉంటే… ఆ పార్టీ గెలుస్తుదనే పరిస్థితి కనిపిస్తోంది.

పవన్ ఎవరి వైపు ఉంటే వారికి అడ్వాంటేజ్..!

పవన్ కల్యాణ్‌కు గొప్పగా ప్రజాదరణ ఉందని నేను అనడం లేదు. అలాగే. ప్రజారాజ్యంతో పోల్చితే.. అప్పుడు ఉన్నంత ఆదరణ కూడా లేదు. కానీ.. ఏపీ రాజకీయ పరిస్థితులు ఇప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య చాలా తక్కువ మార్జిన్ ఉంది. అందుకే.. పవన్ కల్యాణ్‌కు వచ్చే.. కొంత ఓటింగ్ అయినా.. ఫలితాలను తారుమారు చేస్తుందనే అంచనాలు వేస్తున్నారు. అందుకే.. చంద్రబాబు ఓడిపోవాలని కోరుకునే ప్రతి ఒక్కరు.. జగన్, పవన్ కలవాలని కోరుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ఓడిపోతే… ఎలా అని ఆందోళన చెందిన వారంతా.. జగన్, పవన్ కలిస్తే..ఎలా అని మథనపడ్డారు. మళ్లీ చంద్రబాబు గెలవకూడదని కోరుకునేవారు.. పవన్, చంద్రబాబు కలవాలని కోరుకోలేదు. జగన్, పవన్ కలవాలని కొందరు.. పవన్, చంద్రబాబు కలవాలని కొందరు కోరుకున్నారు. వారి కలపాలని ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేయడం వల్ల… ఐదు శాతమో.. పది శాతమో ఓటింగ్.. ఆ పార్టీకి వెళ్తుంది. ఏదో ఓ పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఒక వేళ .. ఈ నష్టం జరగకుండా.. ఏదో ఓ పార్టీతో పొత్తుకు పెట్టుకుంటే.. ముందుగానే .. బద్నాం చేయడానికి రెండు వైపుల నుంచి విమర్శలు ప్రారంభించారని చెప్పుకోవచ్చు.

ముందస్తు జాగ్రత్త కోసమే పార్టీలు నిందలేస్తున్నాయి…!

మొదట్లో.. జగన్, పవన్ ఒక్కటేనని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ పని… జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ముందు ముందు ఎవరితో కలుస్తారో తెలియదు కానీ.. రెండు పార్టీలు మాత్రం జనసేనను టార్గెట్ చేసుకున్నాయి. టీడీపీతో కలుస్తున్నారని… వైసీపీ ప్రచారం చేస్తోంది. ఒక వేళ రహస్యంగా చర్చలు జరుపుకున్నా.. ఎన్ని రోజులు ఉంటుంది. రేపో మాపో తెలియాల్సిందే కదా..!. ఇప్పటి వరకైతే పవన్ కల్యాణ్.. ఎవరితోనూ ఉండనను చెబుతున్నారు. వామపక్షాలతో మాత్రమే పొత్తులు పెట్టుకుంటామన్నారు. చర్చలు జరుపుతున్నారు. సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ.. వైసీపీ నేతలు.. టీడీపీతో కలుస్తారని పదే పదే ప్రచారం చేస్తున్నారు. అంటే… ఇప్పటికే పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అయ్యారని అర్థం. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కానీ.. ఆయన అభిమానులు కానీ ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. ఆయా పార్టీలు బయటకు చెబుతున్నట్లు.. పవన్ కల్యాణ్ ప్రభావం ఏమీ లేదని… అనుకున్నట్లయితే.. ఇలా పవన్ ను టార్గెట్ చేసుకుని.. ఒకరితో ఒకరు కలుస్తున్నారని ఎందుకు ప్రచారం చేస్తారు..? అంటే.. పవన్ కల్యాణ్ ఇప్పటికే కింగ్ మేకర్ అయ్యారని అర్థం చేసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.