ప్రొ.నాగేశ్వర్ : సీఎంగా ప్రమాణం చేస్తానంటున్న పవన్ కల్యాణ్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తామని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ముఖ్యమంత్రిపదవిని చేపట్టడమే తరువాయి అన్నట్లుగా ఎన్నికల ప్రచారసభల్లో చెబుతున్నారు. గతంలో అయితే… ప్రభుత్వాన్ని స్థాపిస్తామనేవారు కానీ.. ముఖ్యమంత్రిగా ప్రమాణం గురించి చెప్పేవారు కాదు. ఇప్పుడు మరింత నమ్మకాన్ని అటు మాటల్లో.. ఇటు బాడీ లాంగ్వేజ్ పరంగా పవన్ కల్యాణ్ చూపిస్తున్నారు. దీనికి మారుతున్న రాజకీయ పరిస్థితులే కారణం అనుకోవచ్చు.

చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నరని వైసీపీ విమర్శలు..!

పవన్ కల్యాణ్ ఇలా.. నేరుగా సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పడం వెనుక.. తనది సీరియస్ పాలిటిక్స్ అని.. ఓటర్లకు తెలియ చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ.. పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒకప్పుడు.. పవన్ కల్యాణ్ సినిమాకు ఇంటర్వెల్ ఎక్కువ.. అసలు సినిమా తక్కువ అని విమర్శించారు. ఇది చాలా తీవ్రమైన విమర్శనే. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ రాజకీయ కార్యక్రమాలు కన్సిస్టెంట్‌గా జరగలేదు. అప్పడొక కార్యక్రమం.. ఇప్పుడొక కార్యక్రమం అన్నట్లుగా సాగాయి. ఇదే పవన్ కల్యాణ్‌పై వచ్చిన ప్రధానమైన విమర్శ. దీంతో పాటు.. జనసేన పార్టీ తనకు తానుగా అధికారంలోకి రావడం కన్నా… ఇతర పార్టీలకు మద్దతివ్వడమో.. మద్దతు తీసుకోవడమో చేస్తుందనే అభిప్రాయం ఉంది. 2014 ఎన్నికల్లో పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేయకుండా.. టీడీపీ, బీజేపీకి మద్దతు పలికారు. ఇప్పుడు.. కూడా.. జనసేనపై.. వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలనుకుంటుంన్నారని… చంద్రబాబు చెప్పినట్లే జగన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. టిక్కెట్లు కూడా చంద్రబాబు చెప్పిన వారికే ఇస్తున్నారని రోజూ చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో.. లోకేష్‌పై జనసేన పోటీ పెట్టలేదని.. కమ్యూనిస్టులకు ఇచ్చారని అంటున్నారు. నిజానికి మంగళగిరిలో కమ్యూనిస్టులు… బలంగా ఉన్నారు. ప్రతీ సారి వారు పోటీ చేస్తూనే ఉంది. మెరుగ్గా ఓట్లు సాధిస్తూ ఉంటారు. అయినా… చివరి రోజు..జనసేన అభ్యర్థిని మంగళగిరిలో నిలబెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి విమర్శలు అనేక చేశారు.

మోడీ, కేసీఆర్, జగన్‌తో పవన్ కుమ్మక్కయ్యారని గతంలో టీడీపీ విమర్శలు..!

ఇప్పుడు ప్రచారవ్యూహంలో.. చంద్రబాబు ప్లాన్‌నే.. పవన్ కల్యాణ్ అమలు చేస్తున్నారని… వైసీపీ ఆరోపిస్తోంది. కేసీఆర్ విషయంలో.. టీఆర్ఎస్ విషయంలో.. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలనే.. పవన్ కల్యాణ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి విమర్శలు గతంలో చంద్రబాబు నుంచి కూడా పవన్ కల్యాణ్ ఎదుర్కొన్నారు. మోడీ, జగన్, పవన్ లు కలిసి.. టీడీపీని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని.. చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు కూడా ఇవే ఆరోపణలు చేశారు. కేసీఆర్ ను పవన్ కలిసినప్పుడు… కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే.. ఇటీవలి కాలంలోనే… తమ విధానాన్ని మార్చుకుని పవన్ కల్యాణ్‌ను విమర్శించడం మానేశారు. ఇలా.. జగన్ ముప్పేట దాడికి గురవుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్.. సీరియస్‌గా వ్యాఖ్యలు చేసే వారు కాదు. తాను ఎన్ని సీట్లకు పోటీ చేస్తానో చెప్పలేకపోయేవారు. తన బలం తనకు తెలుసంటూ వ్యాఖ్యానించేవారు. అంటే.. అప్పట్లో సీరియస్ ప్లేయర్ కాదన్న అభిప్రాయాన్ని ఆయనే తీసుకొచ్చారు. వీటన్నింటికీ పులిస్టాప్ పెట్టాలంటే… నేనే సీఎం అవుతానని ప్రకటించాలి. ఒక వేళ అలా ప్రకటించకపోతే.. సీరియస్‌గా రాజకీయాలు చేయడం లేదనుకుంటారు.

విమర్శలకు సమాధానం చెప్పేలా సీఎం పీఠంపై గురి పెట్టిన పవన్ కల్యాణ్..!

గతంలో సీఎం అవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని గతంలో ప్రకటించారు. అప్పట్లో.. ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. మరి రాజకీయాల్లోకి ఎందుకొచ్చారన్న ప్రశ్నలు వచ్చాయి. రాహుల్ గాంధీపై కూడా.. బీజేపీ చాలా కాలం ఇదే విమర్శలు చేసింది. ప్రధాని పదవిపై ఆసక్తి లేదన్నప్పుడల్లా… ఆయనకు బాధ్యత లేదని బీజేపీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తన పార్టీకి మెజార్టీ వస్తే.. తానే ప్రధాని అవుతానని.. రాహుల్ ప్రకటిస్తే.. మళ్లీ బీజేపీ నేతలు పదవీ దాహం రాహుల్‌కి అంటూ విమర్శలు ప్రారంభించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలో.. అదే జరుగుతుంది. నేను సీఎం అవుతానని పవన్ కాన్ఫిడెంట్‌గా చెబితే ఓటర్లు వస్తారు. భారతదేశంలో.. ఓటింగ్ ట్రెండ్ …చూస్తే.. తమ ఓటు మురిగిపోకూడదని.. ప్లాన్ అనుకుంటారు. గెలిచే వారికే ఓటెయ్యాలని చూస్తూంటారు. తటస్థ ఓటర్లు… తమ ఓటుతో .. కచ్చితంగా.. ఫలితం రావాలనుకుంటారు. అనిశ్చితిలో ఉన్న వారికి ఓటు వేయరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.