ప్రొ.నాగేశ్వర్ : బీజేపీకి ఎన్నికల ముందే రామాలయం ఎందుకు గుర్తొస్తుంది..?

అయోధ్య రాముని అంశాన్ని భారతీయ జనతా పార్టీ మళ్లీ తెరమీదకు తెస్తోంది. అయోధ్యలో.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మాదిరిగా… అతి పెద్ద రాముని విగ్రహం పెడతామని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పును ఎదిరించి అయినా… రామ మందిరం కడతామని.. ఓ వైపు బీజేపీ, హిందూత్వ సంస్థలు ప్రకటనలు చేస్తున్నాయి. మరో వైపు .. విగ్రహం అంటున్నారు. అంటే.. పూర్తిగా రాముని అంశాన్ని తెర ముందుకు తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసిపోతుంది.

పూర్తి మెజార్టీలు ఉన్నా రామాలయం ఎందుకు కట్టడం లేదు..?

భారతీయ జనతా పార్టీ తొంభైవ దశకం నుంచి రాముడ్ని.. రాజకీయాలకు వాడుకుంటోంది. ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు… అయోధ్య రామ మందిరం అంశాన్ని తెరపైకి తీసుకువస్తారు. గతంలో వాజ్‌పేయి హయాంలో… బీజేపీకి రామమందిరం అంశంపై అనే ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు వాజ్‌పేయి.. తమది సంకీర్ణ ప్రభుత్వం అని.. పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పుడు.. అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని చెప్పుకొచ్చేవారు. అందుకే మాకు సంఖ్యాబలం ఇవ్వండి.. చేసి చూపిస్తామనేవారు. కారణాలేమైనా… 2014 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. గుజరాత్ మోడల్ ను ముందు పెట్టి… 2014 ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ మోడల్‌లో ఎక్కడా రామ మందిరం లేదు. ఉత్తరప్రదేశ్‌లో అధికారం ఉంది. దేశంలో అధికారం ఉంది. రెండు చోట్లా కూడా.. పూర్తి స్థాయి మెజార్టీలు ఉన్నాయి. అయినా ఎందుకు రామ మందిరం నిర్మించడం లేదు..?. ఇప్పుడు బీజేపీ నేతలు… విషయం సుప్రీంకోర్టులో ఉంది. మేము చట్టానికి, రాజ్యాంగానికి లోబడి పరిష్కారాన్ని చూస్తున్నామని చెబుతున్నారు.

ప్రతీసారి ఎన్నికలకు ముందే ఎందుకు తెరపైకి తెస్తున్నారు..?

భారతీయ జనతా పార్టీకి సంబంధించి రామమందిరం ఇష్యూ వచ్చినప్పుడల్లా.. ఇదే చెబుతున్నారు. చట్టం, సుప్రీంకోర్టు.. రాజ్యాంగం గురించి చెబుతున్నారు. అదే.. శబరిమల ఇష్యూకి వచ్చే సరికి.. చట్టం, సుప్రీంకోర్టులను లెక్కలోకి తీసుకోవడంలేదు. భక్తుల విశ్వాసమే ముఖ్యం అంటున్నారు. మరి ఇలాంటి విశ్వాసాన్ని… అయోధ్య విషయంలో ఎందుకు తీసుకోవడం లేదు. భక్తుల విశ్వాసమే ముఖ్యం అనుకుని ఎందుకు రామ మందిర నిర్మాణం చేపట్టడం లేదు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి.. చేయలేకపోతున్నామన్న దాని మీదే ఉండే….. ఓ నిబద్ధత ఉండేది. కానీ కరెక్ట్‌గా ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు, సంఘ్ పరివార్ నేతలు.. ఇప్పుడు.. రామ మందిరం ఇష్యూని తెరపైకి తెస్తున్నారు. ఇంత వరకూ.. ఎప్పుడూ.. రామ మందిరం ఇష్యూ బయటకు వచ్చిందా..? రాలేదు.అసలుఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి… బయటకు తీశారు. బీజే్పీ మార్క్ రాజకీయాలు పరిశీలించేవాళ్లందరికీ ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది.

రాముడి భారీ విగ్రహానికి ఆగమశాస్త్రం ఒప్పుకుంటుందా..?

బీజేపీ తరపున ఈ విషయంలో కొన్ని డ్రామాలు కూడా ప్రారంభమయ్యాయి. కొంత మంది చట్టాలు చేయాలంటున్నారు. మరికొంత మంది ఎంపీలు ప్రైవేటు మెంబర్ బిల్లు పెడతామంటున్నారు. అధికారంలో ఉన్న వారు ప్రైవేటు మెంబల్ బిల్లు పెట్టడం ఎందుకు..? నేరుగా అసలైన బిల్లే పెట్టవచ్చు కదా..?. చట్టం చేయాలని ఆరెస్సెస్ అంటారు. చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి… ఆలయం కట్టలేము కానీ… భారీ విగ్రహం పెడతామని యోగి ఆదిత్యనాథ్ చెబుతున్నారు. అంటే విగ్రహం పేరుతో.. కొన్నాళ్లు… రామ మందిరం ఇష్యూని వాయిదా వేసి… ఆ తర్వాత మళ్లీ రాజకీయ ప్రయోజనాలు అవసరమైనప్పుడు తెరమీదకు తెస్తారన్నమాట. విగ్రహం పెట్టాలో వద్దో ఆగమశాస్త్ర పండితులు చెప్పాలి. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం విషయంలో.. ఆగమశాస్త్ర నిపుణుల మధ్యలోనే అభిప్రాయబేధాలొచ్చాయి. మరి … గర్భగుడిలో ఉండాల్సిన సీతారామచంద్రుడ్ని అలా విగ్రహంలా పెడతారా..? దానికి ఆగమశాస్త్రం ఒప్పుకుంటుందా..?. అది భగవంతుని విగ్రహం గర్భగుడిలోనే ఉండాలి. అలాంటి విగ్రహాన్ని.. రాజకీయ అవసరాల కోసం రోడ్డు మీదకు తీసుకు రావడం సమంజసమా..?

ప్రజా సంక్షేమం కోసం రాజకీయం చేయాలి..!

అసలు విగ్రహాలు చుట్టూ.. ఆలయాలు చుట్టూ.. నమ్మకాల చుట్టూ రాజకీయం కాకుండా.. అసలు చేయాల్సిన రాజకీయం వేరే ఉంది. ఆలయాల గురించి ఆగమశాస్త్ర పండితులు చూసుకుంటారు. కానీ రాజకీయ నేతలు చేయాల్సిన పని అది కాదు. రాజకీయ నేతలు చేయాల్సిన పని ప్రజల సంక్షేమం. ప్రజలకు సేవ చేయడమే… నిజమైన దేవుని సేవ. అది బాధ్యత. ప్రజల సంక్షేమం కోసం రాజకీయం చేయాలి కానీ.. ప్రజల విశ్వాసాల చుట్టూ రాజకీయం జరగకూడదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.