ప్రొ.నాగేశ్వర్: తెలంగాణలో రైతుల ఆందోళనకు కారణమేమిటి..?

నిజామాబాద్ జిల్లాలో రైతులు కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు. గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉన్న అతి పెద్ద సాగునీటి ప్రాజెక్ట్. తెలంగాణ ప్రాంతంలో గోదావరికి ఉన్న సమస్య ఏమిటంటే.. చాలా చోట్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తుంటుంది. నీరు కిందికి వెళ్లిపోతూంటుంది. అందు వల్ల చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్..తప్ప మరో మార్గం లేదు. ఒక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మాత్రం గ్రావిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఓ రకంగా ఉత్తర తెలంగాణకు వరప్రదాయని లాంటిది. ఈ శ్రీరామ్ సాగర్ లో 80 టీఎంసీల నీళ్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో వర్షాలు లేవు.

ఉపనదులు కలవక ముందు గోదావరిలో నీళ్లు తక్కువ..!

చాలా మంది ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో ఉన్న గోదావరి నది నీటిని చూసి.. గోదావరిలో నీళ్లు ఉన్నయనుకుంటారు. నేను ఉత్తర తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన వాడినే. భద్రాచలంలో ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరిని చూసి.. గొప్ప ప్రవాహం అనుకుంటారు. అది కాదు గోదావరి. కాళేశ్వరం దిగువన ప్రాణహిత – ఇంద్రావతి నదులు కలసిన తర్వాతనే గోదావరిగా ప్రవాహం ఉద్ధృతంగా ఉంటుంది. ఆ తర్వాత భద్రాచలం వద్ద శబరి నది కలిసిన తర్వాత మరింత ఉద్ధృతమవుతుంది. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఉపనదులు కలవక ముందు గోదావరిలో నీళ్లు చాలా తక్కువగా ఉంటాయి. ప్రాణహిత నది ప్రత్యేకత ఏమిటంటే..తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రవహిస్తుంది. ఆ నీటిని ఎవరూ ఆనకట్టలు కట్టి ఆపరు కాబట్టి… గోదావరిలో కలిసిన తర్వాత వేగం పెరుగుతుంది. ప్రాణహిత కలవక ముందు గోదావరిలో నీటి ప్రవాహంచాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంలోనే శ్రీరామ్ సాగర్ లో నీళ్లు లేవు. ఎగువన వర్లాల్లేవు.

శ్రీరామ్‌సాగర్‌లో నీళ్లు లేవు..!

శ్రీరామ్ సాగర్ లో మామూలుగా అయితే ఈ సమయానికి 20 టీఎంసీల నీళ్లు ఉండాలి. ఇప్పటికి కేవలం 16 టీఎంసీలు నీళ్లు మాత్రమే ఉన్నాయి. గత నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్ లో తగినన్ని నీళ్లు ఉండటం లేదు. దీని ఫలితంగా..శ్రీరామ్ సాగర్ ఆయుకట్టు పరిధిలో ఉన్న లక్షలాది ఎకరాల్లో నాట్లు పడలేదు. ఎకరానికి రూ. 4వేలు ఇచ్చాం అని ప్రభుత్వం చెబుతోంది. కానీ నాట్లే పడలేదు. ఆ నాలుగు వేలు ఏం చేసుకుంటారు..?. రైతు ఆత్మగౌరవం ఉన్నవారు. నాలుగు వేలు ఇస్తున్నాం కదా అంటే.. ఊరుకోడు.. నేను కష్టపడతాను..నాకు సహకరించండి అంటాడు. కానీ ప్రాజెక్టులో నీళ్లు లేవు. ఏం చేయాలి..?. నిజానికి ఉన్న నీటి నుంచే నీళ్లివ్వాలని రైతులు అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఇవ్వడం లేదు.

ఉన్న నీటిని మిషన్ భగీరథకు తరలిస్తున్న ప్రభుత్వం..!

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిషన్ భగీరధ. ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్లివ్వకపోతే.. ఓట్లే అడగబోమని.. ప్రభుత్వం చాలా రోజులుగా ప్రకటిస్తోంది. ఎన్నికలకు ముందు అన్ని చోట్లా పైప్ లైన్లు వేస్తున్నారు. నీళ్లు ఇవ్వకపోతే.. రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తాయి.నీళ్లిస్తే.. శ్రీరామ్ సాగర్ లో ఉన్న నీరు మంచినీటికే సరిపోతాయి. సాగునీటికి వదిలితే మిషన్ భగీరథకు నీళ్లు ఉండవు. ఒక వేళ సాగు కోసం వదిలినా..అవి నారుమళ్ల వరకే సరిపోతాయి. ఆ తర్వాత వర్షాలు పడకపోతే… ఆ నారుమళ్లు ఎండిపోతాయి. అప్పుడు ఇంకా రైతుల ఆగ్రహం ఎక్కువ అవుతుంది. నీళ్లు లేనప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. ప్రభుత్వాలు నీళ్లు సృష్టించలేవు కదా..!

రైతులకు ప్రత్యామ్నాయ ప్రణాళికాలు సిద్ధం చేయాలి..!

కానీ ప్రభుత్వం చేయగలిగింది చేయాలి. ముందస్తు ఆలోచన చేయాలి. ఇంకా వర్షాకాలం అయిపోలేదు.ఇప్పటికిప్పుడే మంచినీళ్ల కోసం.. మొత్తం నీటిని తరలించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఆలోచించాలి. ఒక వేళ అవసరమే అనుకుంటే.. కంటింజెన్సీ ప్లాన్ ఉండాలి. అంటే సమగ్ర పంటల పథకం ఉండాలి. నీళ్లున్నప్పుడు పంటలు వేసుకుంటారు. నీళ్లు లేకున్నా.. వేసుకోగలిగే పంటలను వేసుకునేలా రైతులను ప్రొత్సహించాలి. తక్కువ నీరు అవసరం ఉన్న పంటలను ప్రొత్సహించాలి. రైతుల్లో అవగాహన కల్పించాలి. రైతుల్ని సమీకరించాలి. వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించాలి. అందరికీ అవగాహన పెంచాలి.. సంప్రదాయకంగా వేసుకునే పంటలకు నీళ్లు సరిపోవు..ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని నచ్చ చెప్పాలి. అందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని వివరించాలి. ఈ పని చేయడానికే రైతు సమన్వయ సమితులు పెట్టారు. ఈ పని చేయకపోవడం వల్లే రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.

రైతుబంధు పథకం పెట్టినంత మాత్రాన రైతులు సంతోషంగా ఉండరు..!

రైతు బంధు పథకం పెట్టిన తర్వాత రైతులంతా.. సంతోషంగా ఉన్నారని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అన్ని చోట్లా రైతులు రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్నటిదాకా చెక్కుల పంపిణితో గ్రామాల్లో పండుగ వాతావరణం ఉంది. ఇప్పుడు బీమా పత్రాలు పంపిణి ఇస్తున్నారు. అయినా రైతుల్లో ఆందోళన ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఎకరానికి రూ.4 వేలు ఇస్తే రైతులు సంతోషంగా ఉండరు. రైతులు కావాల్సింది పంటలు పండించుకోవడానికి సౌకర్యాలు, పండించిన పంటలు అమ్ముకోవడానికి గిట్టుబాటు ధరలు. చాలా కాలం నుంచి వర్షాభావ పరిస్థితులు, సమయానుకూలంగా వర్షాలు పడకపోవడం వంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపై రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చాలా కాలంగా…నిపుణులు చెబుతూ వస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. సమగ్ర పంటల ప్రణాళిక, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక లేక.. ఇవాళ గ్రామాల్లో 144 సెక్షన్ విధించాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com