ప్రొ.నాగేశ్వర్ : పీడీ అకౌంట్లు కుంభకోణాలు అవుతాయా..?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పర్సనల్ డిపాజిట్ ఎకౌంట్లపై పెద్ద రాజకీయం జరుగుతోంది. పీడీ అకౌంట్స్ అంటే.. పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్. పర్సనల్ డిపాజిట్ బ్యాంక్ అకౌంట్లు వివిధ శాఖలు నిర్వహిస్తాయి. ఈ పీడీ అకౌంట్ లో ప్రభుత్వ నిధులు ఉంటాయి. ప్రభుత్వ ఖర్చుల కోసం డ్రా చేస్తారు. ఓ వ్యక్తికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. వచ్చే ఆదాయం ఆ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. కావాల్సినప్పుడల్లా … కొంచెం.. కొంచెం డ్రా చేసుకుంటూ ఉంటారు. ఓ కంపెనీకి కరెంట్ అకౌంట్ ఉంటుంది. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహిస్తారు కాబట్టి కరెంట్ అకౌంట్ అంటారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్వహించే ఖాతా ఎలా ఉంటుంది..?. ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం ఎక్కడ ఉంటుంది…? ఖర్చుల కోసం ఏ అకౌంట్ నుంచి తీసుకుంటుంది..? అనేది మనకు మందుగా అర్థం కావాలి.

బిల్లులన్నీ ట్రెజరీ నుంచి మంజూరు కావాల్సిందే..!

ప్రభుత్వం డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. అలాగే ఎమర్జెన్సీ అయితే ఉపయోగించుకోవడానికి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో కూడా డబ్బులు పెడతారు. ఆ కంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి అధీనంలో ఉంటుంది. రాష్ట్రపతి దాన్ని నిర్వహిస్తారు. కానీ అది అత్యవసరాలకు మాత్రమే ఉపయోగించుకునేటటువంటి ఓ చిన్న ఫండ్. కానీ మేజర్ ఫండ్ అంతా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. కేంద్రం కేంద్ర పరిధిలో, రాష్ట్రం రాష్ట్ర పరిధిలో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాను కలిగి ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలు ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ లో చేరుస్తారు. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, రుణాలు తీసుకున్న నిధులు కూడా ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ లోకే వస్తాయి. ఇవే కాకుండా ప్రభుత్వానికి వచ్చే ఎలాంటి ఆదాయాలైనా ఈ ఫండ్ లోకే చేరుతాయి. ప్రభుత్వ ఎప్పటికప్పుడు తన ఖర్చుల కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే డ్రా చేసుకుంటూ ఉండాలి, ఏ శాఖ అయినా… తమకు నిధులు కావాలంటే బిల్లు ట్రెజరీకి సబ్మిట్ చేస్తారు. ఆ ట్రెజరీ నిధులు మంజూరు చేస్తూ ఉంటుంది.ఇది సహజంగా జరుగుతుంది.

పీడీ అంటే వ్యక్తిగత ఖాతాలు కావు..విభాగాధిపతుల ఖాతాలు..!

ఇక పీడీ అకౌంట్ అంటే ఏమిటంటే.. ఉదాహరణకు ఓ మంత్రిత్వ శాఖ ఉంది. ఆ మంత్రిత్వ శాఖకు కొంత బడ్జెట్ ను అప్రూవ్ చేస్తారు. ఆ మంత్రిత్వ శాఖ తన కింద ఉన్న విభాగాలకు అందులోనుంచి కొన్ని నిధులు కేటాయిస్తుంది. ఉదారణకు.. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కు రూ. 200 కోట్లు కేటాయించారనుకుందాం. ఆ రెండు వందల కోట్లు మాత్రమే…బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాడుకోవాలి. ఈ రెండు వందల కోట్లు వెంటనే తీసుకోరు. అవసరం వచ్చినప్పుడల్లా ట్రెజరీకి బిల్లులు సమర్పించి.. కావాల్సిన నిధులు తీసుకుంటూ ఉంటారు. పీడీ అకౌంట్లు అంటే ఏమిటంటే… తమకు బడ్జెట్లో కేటాయించిన నిధులను ఒకేసారి పెత్త మొత్తంలో విత్ డ్రా చేసుకుంటారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో విత్ డ్రా చేసుకుంటారు. వీటిని ఎస్సెస్సీ బోర్డు డైరక్టర్ పేరు మీద ఓ పీడీ అకౌంట్ ఉంటుంది. అందులో వేస్తారు. వివిధ రకాల ప్రభుత్వ విభాగాల అధిపతుల పేరిట ఈ పీడీ అకౌంట్లు ఉంటాయి. అందుకే దీన్ని పర్సనల్ డిపాజిట్ అకౌంట్ అంటారు. పీజీ అకౌంట్ అంటే.. వ్యక్తి పేరు మీద ఉండదు. డైరక్టర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియర్ ఎడ్యుకేషన్ , డైరక్టర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. ఇలాంటి పేర్ల మీద ఉంటుంది.

అత్యవసర ఖర్చుల కోసం పీడీ అకౌంట్లు..!

ఈ పీడీ అకౌంట్లు ప్రధానంగా.. అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి పెట్టుకుంటారు. ప్రతీసారి ట్రెజరీకి వెళ్లి బిల్లు పాస్ చేయించుకుని తెచ్చుకవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి.. ఈ పీడీ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటారు. ఈ అకౌంట్ పూర్తిగా.. ఆ విభాగాధిపతి అధీనంలో ఉంటుంది. ఆయనను పీడీ ఎడ్మినిస్ట్రేటర్ అంటారు. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పీడీ అకౌంట్ లోకి నిధులు వస్తాయి. ఆ పీడీ అకౌంట్ నుంచి నిధులు విడుదల చేసుకునే వెసులుబాటు ఆ పీడీ ఎకౌంట్ అడ్మిస్ట్రేటర్ కే ఉంటుంది. ఉదాహరణకు ఓ కలెక్టర్ కు .. రూ. 500 కోట్లు బడ్జెట్ కేటాయింపులు ఇచ్చారనుకుందాం కలెక్టర్ లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో ఆ ఐదు వందల కోట్లను… పీడీ అకౌంట్ లోకి తెచ్చుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాల కోసం..అవసరమైనప్పుడు కలెక్టర్ లెటర్ రాస్తే బ్యాంకు వాళ్లు ఇస్తారు. ప్రతీ సారి ట్రెజరీ నుంచి డబ్బులు తెచ్చుకోవాలంటే సమయం పడుతుంది. ఎమర్జెన్సీ అవసరాలకు సంబంధించిన మొత్తమే పీడీ అకౌంట్లలో ఉండాలి. కానీ కేటాయించబడిన మొత్తం నిధులను డ్రా చేసి.. పీడీ అకౌంట్లలో ఉంచుకోవడమే కాదు.

పీడీ అకౌంట్లు కుంభకోణాలు కావు..!

ఈ పీడీ అకౌంట్లో డబ్బులు పెట్టడం పెద్ద స్కామని బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు విమర్శిస్తున్నారు. ఇదో అకౌంటింగ్ ప్రాక్టిస్ అని టీడీపీ వాదిస్తోంది. ఇది స్కామ్ కాదు. కానీ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడిపించే విధానం కాదు. ఎందుకంటే.. ప్రభుత్వానికి ఓ లక్ష కోట్లు ఆదాయం ఉందనుకుందాం. ఆ లక్ష కోట్లకు ప్రభుత్వం బడ్జెటింగ్ చేస్తుంది. కానీ ఆదాయం లక్ష కోట్లు ఉంటే.. ఖర్చు లక్షా పది వేలు లేదా.. లక్షా ఇరవై వేల కోట్లు ఉంటుంది. అంటే ఆదాయానికి మించి ఖర్చు ఉంటుంది. బడ్జెట్ లో కేటాయించిన నిధులన్న… పీడీ అకౌంట్లలో పెట్టుకుంటే… ఎక్కువ ఖర్చు అయిన దాన్ని ఎక్కడ నుంచి తీసుకొస్తారు..? అప్పులు తీసుకు రావాల్సి ఉంటుంది. అప్పులు తీసుకు రావడం వల్ల వడ్డీ భారం పడుతుంది. అంటే ప్రభుత్వం తన దగ్గర డబ్బులు ఉండి కూడా అప్పు తేవాల్సిన పరిస్థితి వస్తుంది. పీడీ అకౌంట్లలో నిధులు ఉంటాయి..కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ లో మాత్రం నిధులు ఉండవు. అంటే అర్థిక నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప కుంభకోణం కాదు.

పీడీ అకౌంట్లలో ఎక్కువ నిధులుంచుకోవడం ఆర్థిక క్రమశిక్షణ కాదు..!

పీడీ అకౌంట్లలో డబ్బు ఉండాలి. అత్యవసరాలకు ఉపయోగించుకోవాలి. మినిమంగా ఉంచుకోవాల్సిన పీడీ అకౌంట్లు మ్యాగ్జిమంగా చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఈ పీడీ అకౌంట్లలోని నిధులపై వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ బడ్జెట్ ఆదాయం కిందకు రాదు. ఈ నిధులను ఎలా ఖర్చు పెట్టాలనేది..మరో విషయం. అధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టే ప్రమాదం కూడా ఉంది. ఈ మొత్తాన్ని చూస్తే పీడీ అకౌంట్లలో నిధులు ఉండటం కుంభకోణం అని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ… ఆర్థిక క్రమశిక్షణ సరిగ్గా లేకపోవడంగా చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com