ప్రొ.నాగేశ్వర్: మతంపై కాదు..మతోన్మాదంపై పోరాడాలి..!

రాముడిపై.. కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై టీవీ చానళ్లు గంటల తరబడి చర్చలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంపై నేను చర్చను పొడిగించదల్చుకోలేదు కాబట్టి కామెంట్ చేయలేదు. కానీ కొంత మంది ఎందుకు కామెంట్ చేయడం లేదు అని అడుగుతున్నారు. నా అభిప్రాయం ఏమిటంటే…ఇప్పుడు జరుగుతున్నది రాముడు, రామాయణంపై పోరాటమా.. లేక.. రాముడ్ని, రామాయణాన్ని రాజకీయం కోసం వాడుతున్నవారిపై పోరాటమా..? అన్న స్పష్టత మనకు ఉండాలి.

రాముడ్ని రామాయణ కాలంలోనే విశ్లేషించాలి..!

రాముడు, రామాయణంపై పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది విశ్వాసాల్ని మనం గౌరవించాలి. కానీ విశ్వాసాల పేరిట దుర్మార్గాలు చేస్తే.. ప్రశ్నించాలి..! విశ్వాసాన్ని కాదు.. విశ్వాసాల పేరిట జరిగే దుర్మార్గాల్ని మాత్రమే ప్రశ్నించాలి. రామాయణంలో రాముడిది ఓ పాత్ర అన్న కోణంలో.. రాముడి గుణగుణాల్ని విశ్లేషించాను అని కత్తి మహేష్ అన్నట్లు చూశాను. పాత్ర గురించి విశ్లేషించాలన్నా.. ఆ పాత్ర ఏ సమయంలో సృష్టించబడింది.. అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రాముని పాత్ర 20వ శతాబ్దంలో సృష్టించబడలేదు. రాముడు దేవుడు కాదు.. రాముడు ఓ పాత్రే అనే కత్తి మహేష్ వాదనే అంగీకరిస్తే.. మరి రాముని పాత్రను ఎప్పుడు సృష్టించారు..?. రాముని పాత్ర సృష్టించిన కాలంలో ఉన్న విలువలు ఏమిటి..? ఆనాడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితులను విశ్లేషించాలి తప్ప.. ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్లేషించకూడదు.

ఆదిమకాలంలో మనుషులు తప్పు చేశారని చెబుతామా..?

ఆదిమకాలంలో… ఉన్న పరిస్థితులను బట్టి రాసిన ఓ కథను తీసుకుందాం. అప్పట్లో కుటుంబ వ్యవస్థ లేదు. అంతా.. విచ్చల విడిగా బతికేవారు. అప్పటి పరిస్థితులను బట్టి అలా ఉండేవారు. కానీ ఆ కథను తీసుకొచ్చి.. ఇప్పటి విలువలతో పోల్చి ప్రశ్నించకూడదు. ఒక్కో కాలంలో.. ఒక్కో రకమైన విలువలు ఉంటాయి. అప్పటి పరిస్థితులను చూసి.. ఇప్పుడు అనైతికంగా వ్యవహరించారు అని విశ్లేషించడం తప్పు. అప్పట్లో అది అమోదయోగ్యం. కానీ ఇప్పుడు అప్పటి పాత్రలను విశ్లేషించి కించపరిచేలా మాట్లాడటంలో అర్థం లేదు. అంటే టైం అండ్ ప్లేస్ దృష్టితో విశ్లేషణ జరగాలి. పాశ్చాత్య దేశాల్లో వివాహ సంస్కృతి బలంగా లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టం లేకపోతే.. వెంటనే విడిపోతారు. రెండు, మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. అక్కడి ప్రజలకు అది కామన్. భారతదేశంలో అది అనైతికతలా భావించి ఆ దేశాల ప్రజలను తప్పు పట్టడం సమంజసమా..?

వివాదం కోసమే రాముడిపై విమర్శలు..!

ఇక రాముడు దేవుడనే భావించేవారికి అనేక సందేహాలు వస్తాయి. ఒక్క హిందూమతం మీదనే మాట్లాడతారు. ఖురాన్ మీద మాట్లాడరు, బైబిల్ మీద మాట్లాడరు అన్న ప్రశ్నలు కూడా వస్తాయి. అలాగే అనాటి కావ్యాల్ని, రచనల్ని విమర్శనాత్మకంగా చూడకూడదా.. అంటే చూడొచ్చు. లవకుశ సినిమాలో లక్ష్మణునికి లవకుశలకు మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడే వాదన జరుగుతుంది. లక్ష్మణుడు శ్రీరాముని గొప్పదనాన్ని చెబుతూంటారు. శ్రీరాముని లోపాలను..లవకుశలు వివరిస్తూంటారు. ఈ సినిమా విడుదలయినప్పుడు ఏ వివాదం రాలేదు. ఇప్పటికీ.. ఆ దాన్ని మంచిగానే చూస్తాం. వివాదంగా పరిగణించం. ఎందుకంటే..దానికి సందర్బశుద్ధి ఉంది. కానీ ఇప్పుడు… అలా జరగడం లేదు. కావాలని వివాదాన్ని సృష్టించడం కోసం.. రాముడిపై విమర్శలు చేస్తున్నట్లుగా ఉంది.

రాముడ్ని కాదు.. రాముడ్ని రాజకీయం చేస్తున్న వారిని ప్రశ్నించాలి..!

ఇప్పుడు రాముడిపై వివాదాన్ని రేకెత్తించడం వల్ల ఎవరికి లాభం..?. కత్తి మహేష్ వ్యాఖ్యల వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది. కత్తి మషేష్ వ్యాఖ్యల వల్ల.. ప్రజల నుంచి మతం దూరం కాదు. మతాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మతోన్మాదానికి కూడా ప్రేరేపిస్తుంది. రాముని పేరుతో రాజకీయాన్ని విడమర్చి చెప్పేందుకు.. రామాయణం చాలు. ఎందుకంటే.. తండ్రికుమారుల అనుబంధాన్ని, పాలకులు ఎలా ఉండాలో విశ్లేషించడానికి.. అలా అనేక అనేక మంచి లక్షణాలు రామాయణంలో ఉన్నాయి. తండ్రికి ఇచ్చిన మాట కోసం.. సింహాసనం వదులుకున్న రాముడిపై ఎలాంటి పోరాటం అవసరం లేదు. రాముడ్ని రాజకీయం కోసం వాడుకుంటున్న వారిని క్వశ్చన్ చేయాలి. కానీ.. రాముడ్ని కాదు. అలా కాకుండా.. రాముడ్ని ప్రశ్నిస్తే.. రాముడి పేరుతో రాజకీయం చేసే వారు బలపడతారు.

మతాన్ని కాదు వ్యతిరేకించాల్సింది..!

మతాన్ని కాదు వ్యతిరేకించాల్సింది. మతం ఒక్కొక్కరి విశ్వాసం. మతంలో అనేక ఉదాత్త వ్యాఖ్యలున్నాయి. మంచి ఆలోచనలను అన్ని వైపుల నుంచి రానివ్వండి అని ఉపనిషత్తుల్లో చెప్పారు. భగవద్గీతలో కృష్ణుడు .. నిష్కల్మషమైన మనసుతో.. నిష్కళకంగా.. ఎవరైతే నన్ను సేవిస్తారో.. వారే నాకు ప్రీతిపాత్రులు అని అర్జునునితో చెబుతాడు. ఈ రోజు మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేవారికి… భగవద్గీతలో ఈ మాటలన్నారని.. ఎవరైనా చెబితే.. వారికి సర్దిచెప్పడం సులువవుతుంది. కానీ భగవద్గీతనే కించపరిస్తే..వారు బలపడతారు. భగవద్గీత గొప్పదనాన్ని చెప్పడం ద్వారానే వారిని ఎదుర్కోగలం. ఎవరు ఏ రూపంలో అయినా.. నన్ను పూజింపనివ్వండి..వారు వారు కోరుకున్న రూపాల్లో ఆ విశ్వాసాన్ని బలపడేలా చేస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఆవు రంగు ఏదైనా కానీ.. అదిచ్చే పాల రంగు తెల్లగానే ఉంటుందని భగవద్గీతలో చెప్పారు. నదులు అనేక రూపాల్లో…అనేక మార్గాల్లో ప్రవహిస్తాయి. కానీ అన్నీ సముద్రంలో కలుస్తాయని ఆది శంకరాచార్యుడు చెప్పారు. అలాగే మతాలు, విశ్వాసాలు అనేక రూపాల్లో ఉండవచ్చు.. మార్గాల్లో ఉండవచ్చు. కానీ అన్నీ చివరికి భగవంతుడినే చేరుకుంటాయి. దీన్ని అర్థం చేసుకోవాలి కానీ… ఈ భారదేశంలో ఒక్క మతమే ఉండాలి.. అని ఉన్మాదంతో ఊగిపోయేవారికి..సమాధానం చెప్పడానికి విష్ణుపురాణం సరిపోతుంది. ఇది అద్భుతమైన ఆయుధం లాంటిది.

మతోన్మాదంపై పోరాటం చేయాలి..!

కానీ ఇవన్నీ వదిలేసి.. మతంపైన.. మత గ్రంధాలపై పంచాయతీ ఎందుకు..? కోట్లాది మంది ప్రజలు..మతాన్ని నమ్ముతారు. దేవుడ్ని ఆరాధిస్తారు. ఎందుకంటే.. తమ నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలకు.. నిజజీవితంలో పరిష్కారం దొరకనప్పుడు.. మతంలో ఆ పరిష్కారం వెదుక్కుంటారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మనిషికి దేవుడే దిక్కవుతాడు. సమస్యల్లో ఉన్న మనిషికి మతమే మార్గంగా కనిపిస్తుంది. అంటే.. ఇప్పుడు పోరాటం చేయాల్సింది మతంపై కాదు. సామాజిక,ఆర్థిక, స్థితిగతులపై పోరాడాలి. మత ఉన్మాదాన్ని, మత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. నేడు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను మతం అనే భావన జస్టిఫై చేస్తున్నప్పుడు ప్రశ్నించాలి. అంటే.. యుద్ధం చేయాల్సింది.. మతంపైన కాదు.. మతం పేరుతో రాజకీయం చేస్తున్నవారిపైన..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.