ప్రొ.నాగేశ్వర్ : మూడు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోడీ ఎందుకు వెనుకబడ్డారు..?

ఐదు రాష్ట్రాల ఎన్నికల కీలక దశకు చేరుకున్నాయి. చత్తీస్ గఢ్‌లో రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి సమయంలో… భారతీయ జనతా పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న.. నరేంద్రమోడీ, అమిత్ షాల హడావుడి పెద్దగా కనిపించడం లేదు. గతంలో.. గుజరాత్ , ఉత్తరప్రదేశ్ లాంటి ఎన్నికల్లో మొత్తం తామై నడిపించేవారు. కానీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు.

మూడు రాష్ట్రాల్లో పట్టు కోల్పోతే బీజేపీకి ఢిల్లీలోనూ అధికారం దూరమేనా..?

ఐదు రాష్ట్రాల ఎన్నికలను.. ఇప్పుడు సెమీ ఫైనల్స్‌గా చెప్పుకుంటున్నాం. ఈ ఎన్నికలకు ఉన్న ప్రాథాన్యత రీత్యా ఇవి కచ్చితంగా సెమీఫైనల్స్ లాంటివే. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్‌లలో ఎన్నికలు కీలకంగా మారాయి. ఎందుకంటే ఈ మూడు హిందీ రాష్ట్రాలు. భారతీయ జనతా పార్టీ హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మాత్రమే బలంగా ఉంది. దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రమే అంతంతమాత్రంగా బలం ఉంది. ఇప్పుడు హిందీ హార్ట్ లాండ్‌లో జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ మూడు రాష్ట్రాలకు కలిపి లోక్‌సభలో 65 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ.. ఈ అరవై ఐదు సీట్లలో అరవై రెండు సీట్లను గెల్చుకుంది.అంటే.. మ్యాగ్జిమం. ఇంత కన్నా ఎక్కువ సాధించడం సాధ్యం కాదు. బీజేపీ అధికారంలో ఉంది అంటే… ఈ మూడు రాష్ట్రాల్లో గెలిచిన 62 సీట్లే కీలకం. ఈ మూడు రాష్ట్రాల్లో 2014 తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ.. ఉపఎన్నికల్లో కానీ బీజేపీ పరాజయం పాలైంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోతే.. బీజేపీకి చాలా ఇబ్బందికరం. యాభై సీట్లు ఈ మూడు రాష్ట్రాల్లోనే తగ్గిపోతే.. అధికారం దూరమైనట్లే. ..!

అయినా ఎందుకు మోడీ చురుగ్గా ప్రచారం చేయడం లేదు..?

కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ గెలిస్తే.. సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితమవుతుంది. యూపీలో ఎస్పీ – బీఎస్పీ కలిస్తే.. పది, పదిహేను సీట్లు కూడా వస్తాయో రావో చెప్పలేని పరిస్థితి. అందుకే.. ఈ మూడు రాష్ట్రాల్లో… కాంగ్రెస్ తో హోరాహోరీగా తలపడుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో గెలుచుకునే సీట్లే అత్యంత ముఖ్యం. ఈ మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికార పార్టీ, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్‌లలో పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నారు. అంటే… అత్యధిక సీట్లు ఈ మూడు రాష్ట్రాల్లో ఉండటం, అధికార పార్టీ కావడం, కాంగ్రెస్ తో పోరాడటం వల్లనే దీన్ని సెమీ ఫైనల్స్ గా పేర్కొంటున్నారు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఎన్నికలు.. వచ్చే ఎన్నికలపై.. ఇంత తీవ్రమైన ప్రభావం చూపిస్తున్న ఎన్నికల్లో మోడీ.. ఎందుకు తీవ్రంగా ప్రచారం చేయడం లేదు.?

మోడీని వెనక్కి నెట్టి ముఖ్యమంత్రులకే ఎందుకు ప్రయార్టీ ఇచ్చారు..?

గుజరాత్ ఎన్నికల్లో నరేంద్రమోడీ.. 34 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఒక రకంగా గుజరాత్ లో చీఫ్ మినిస్టర్ ఎవరో తెలియదు. అయినప్పటికీ.. 34 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. కర్ణాటకలో 21 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. కర్ణాటక కన్నా కూడా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ కీలకం. అయినప్పటికీ.. చత్తీస్ ఘడ్‌లో మాత్రం మోడీ.. ఐదు ఎన్నికల ర్యాలీల్లో మాత్రమే పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో మాత్రం 11 మాత్రమే ఏర్పాటు చేశారు. రాజస్థాన్ లో అయితే.. ఇప్పటి వరకూ ఒకటే ర్యాలీ నిర్వహించారు. ఇంకా ప్రచార గడువు ఉంది.. నాలుగైదు ర్యాలీల్లో పాల్గొనే అవకాశం ఉంది. దీనికి కాంట్రాస్ట్ గా…అమిత్ షా చత్తీస్ ఘడ్‌లో 10, మధ్యప్రదేశ్ లో 14 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక రాహుల్ గాంధీ.. చత్తీస్ ఘడ్‌లో 18, మధ్యప్రదేశ్‌లో 19 ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. అంటే.. మోడీ ప్రచారం.. చాలా పరిమితంగా జరిగిది. చత్తీస్ ఘఢ్‌ తీసుకుంటే.. నరేంద్రమోడీ ఫోటోను పోస్టర్లలో కూడా ఎక్కువగా ఎక్కడా ఉపయోగించలేదు. అక్కడ రమణ్ సింగ్ ఫోటోలే కనిపిస్తాయి. అలాగే వాజ్‌పేయి బొమ్మలు ఉంటాయి. కానీ మోడీ బొమ్మలు మాత్రం చాలా చిన్నవి ఉంటాయి. అంటే.. వాజ్‌ పేయిని చూపించి ఓట్లు అడుగుతున్నారు… రమణ్ సింగ్‌ని చూపించి ఓట్లు అడుగుతున్నారు. కానీ.. మోడీని చూపించి మాత్రం అడగడం లేదు. చత్తీస్ ఘడ్‌లో వాజ్‌ పేయి పేరు మీద పలు పథకాలు పెట్టారు. వాజ్‌పేయి ఇమేజ్ ను ఉపయోగించుకుని గెలవాలి.. మోడీ ఇమేజ్ ను కాదని.. చత్తీస్ గఢ్‌లో బీజేపీ ఫాలో అయింది.

ఓటములకు ..మోడీకి ఏమి సంబంధం లేదని ఇప్పటి నుంచే చెప్పుకుంటున్నారా..?

మధ్యప్రదేశ్ లో కూడా… శివరాజ్ సింగ్ చౌహానే హైలెట్ చేశారు కానీ… మోడీని ఎక్కడా పట్టించుకోలేదు. ఎన్నికల ర్యాలీలు ఉన్నా.. మోడీని సెంటరాఫ్ ఎట్రాక్షన్ చేయడం లేదు. పోస్టర్లలో కూడా.. ముఖ్యమంత్రుల్ని హైలెట్ చేస్తున్నారు… రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్ని హైలెట్ చేసుకుంటున్నారు కానీ.. ఎక్కడా మోడీ ఫోటో పెట్టుకోవడం లేదు. పైగా బీజేపీ నేతలు.. ఈ అసెంబ్లీ ఎన్నికలు మోడీ పాలనపై రిఫరెండం కాదు అన్న ప్రచారం ప్రారంభించారు. కర్ణాటకలో మోడీపై రిఫరెండం… గుజరాత్‌లో మోడీపై రెఫరెండం.. కానీ ఇక్కడ మాత్రం.. మోడీపై రిఫరెండం కాదు. ఎంత తెలివిగా… ఎన్నికలకు ముందు.. ఓటమిని అంగీకరిస్తున్నారన్నమాట. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ గల్లంతయ్యే అవకాశం ఉంది. కథ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది. అందుకనే ముందుగానే… తప్పించుకుంటున్నారు. రేపు ఓడిపోతే.. శివారాజ్ సింగ్ చౌహాన్ తప్పు.. రమణ్ సింగ్ తప్పు.. వసుంధర రాజే తప్పు.. కానీ మోడీ తప్పు కాదు అర్గ్యుమెంట్ రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రుల్ని బలి పశువుల్ని చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. గుజరాత్ , కర్ణాటక ఎన్నికల్లో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్లుగా చేసుకున్నారు. కానీ ఈ మూడు రాష్ట్రాల్లో .. మాత్రం వేరేగా వ్యవహరిస్తున్నారు. గెలిస్తే.. ఎలాగూ క్రెడిట్ ఇస్తారు. గెవలకపోతే.. ముఖ్యమంత్రుల మీద నెట్టేస్తారు. అందుకే ఎన్నికల ప్రచారసభలను మోడీ తగ్గించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.