ప్రొ.నాగేశ్వర్ : పాకిస్థాన్‌కు చర్చలపై చిత్తశుద్ధి ఉంటే అభినందన్‌ను విడుదల చేయాలి..!

భారత్ , పాకిస్తాన్ మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితులు యుద్ధం దిశగా వెళ్తున్నాయన్నాయని అనుకోవచ్చు. ముఖ్యంగా భారత్‌కు చెందిన ఫైటర్ పైలట్ అభినందన్‌ను పాకిస్తాన్ తన చెరలో ఉంచుకున్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్.. భిన్నమైన ప్రకటన చేశారు. యుద్ధం అంటూ జరిగితే.. ఎక్కడికి వెళ్తుందో తెలియదని… చర్చలకు సిద్ధమని ప్రకటించారు.

శాంతి కావాలంటే ఇమ్రాన్‌ఖాన్‌కు ఇదే గొప్ప అవకాశం..!

పాకిస్తాన్ అధ్యక్షుడు…ఇమ్రాన్ ఖాన్ నీతులు చెబుతున్నారు. యుద్ధం వస్తే.. రెండు దేశాలూ నష్టపోతాయని.. పరిస్థితి… తన చేతుల్లో కానీ.. మోడీ చేతుల్లో కానీ ఉండవని చెబుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నది నిజమే. యుద్ధం వస్తే… రెండు దేశాలు నష్టపోతాయి. కానీ.. ఇమ్రాన్ ఖాన్ తెలివిగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. ఎందుకంటే.. భారత్‌కు చెందిన ఫైటర్ పైలట్ అభినందన్ వారి వద్ద బందీగా ఉన్నారు. అభినందన్ వారికి ఎలా చిక్కాడు..?. పాకిస్తాన్‌కు చెందిన జెట్ విమానాలు… ఎఫ్ 16 యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి వచ్చి.. భారత సైన్యం క్యాంపులపై బాంబులు వేశాయి. వాటిని తరిమికొట్టేందుకు …మిగ్ విమానంలో ఫైటర్ పైలట్ అభినందన్ వెళ్లారు. ఆ సమయంలో… మిగ్‌ను కూల్చి వేసిన.. సైన్యం.. అభినందన్‌ను అదుపులోకి తీసుకుంది. అభినందన్‌ను పాకిస్తాన్ భూభాగంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పాకిస్థాన్ సైనికులు ఆయనతో వ్యవహరించిన తీరు మీడియాలో వచ్చింది. యుద్ధ ఖైదీల పట్ల ఎలా వ్యవహరించాలన్నదానిపై… ఓ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉంది. జెనీవా ఒప్పందం అంటూ ఉంటారు. ఒప్పందం ప్రకారం… యుద్ధఖైదీని ఆ విధంగా హింసించకూడదు. కానీ.. పాకిస్తాన సైనికులు అభినందన్ ను కొట్టినట్లుగా దృశ్యాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ చర్చల గురించి ప్రస్తావిస్తున్నరు. ఇమ్రాన్ ఖాన్‌కు నిజంగా చర్చలు జరపాలనే చిత్తశుద్ధి ఉంటే.. ఇది గొప్ప అవకాశం.

అభినందన్‌ను బేషరతుగా అప్పగిస్తే చర్చలకు అవకాశం..!

ఇమ్రాన్ ఖాన్ చాలా తెలివిగా.. యుద్దం వల్ల అందరికీ నష్టమేనని.. శాంతిమంత్రం జపిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన నిజంగా… శాంతి కోసం… అంతగా తపిస్తున్నట్లయితే… వింగ్ కమాండర్ అభినందన్‌ను.. తక్షణం గౌరవ లాంఛనాలతో.. భారత్‌కు అప్పగించాలి. అలా అప్పగిస్తేనే సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. పాకిస్థాన్ చర్చల కోసం ఓ అడుగు ముందుకు వేసింది కదా.. మనం రెండు అడుగులు ముందుకు ఎందుకు వేయకూడదన్న ప్రశ్న ప్రజల్లో వస్తుంది. భారత్‌లో కానీ.. పాకిస్థాన్‌లో కానీ ఎవరూ.. ప్రజలు యుద్ధం కోరుకోవడం లేదు. ఆ విషయం సోషల్ మీడియాలో స్పందన ద్వారా తెలియజేస్తోంది. పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి… వింగ్ కమాండర్‌ను బేషరతుగా…భారత్‌కు అప్పగిస్తే.. శాంతి చర్చలకు మార్గం సుగమం అవుతుందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు అక్కడి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. దీన్ని బట్టి అక్కడ ప్రజల స్పందనను కూడా అర్థం చేసుకోవచ్చు. వారు కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు.

భారత భూభాగంలో దాడులు చేయడం పాకిస్థాన్ తప్పు..!

భారతదేశం భూభాగంలోకి వచ్చి మరీ.. పాకిస్థాన్ వైమానిక దళం బాంబులు వేసింది. దీనిపై పాకిస్థాన్ వింత వాదన వినిపిస్తోంది. తమ భూభాగంలోకి వచ్చి.. భారత్ వైమానిక దాడులు చేసిందని.. ఆ పని తాము కూడా చేయగలమని నిరూపించడానికే.. తాము ఎయిర్‌ స్ట్రైక్స్ చేశామని.. పాకిస్తాన్ చెబుతోంది. అంతే.. తప్ప.. ఏ ఒక్కరికీ హాని చేయాలని .. తాము ప్రయత్నం చేయలేదని… వాదిస్తోంది. మాకు కూడా.. దాడులు చేసే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని నిరూపించడానికే ఆ పని చేశామంటున్నారు. నిజంగానే… వారు వేసిన బాంబులు ప్రజలపై పడలేదు. నష్టం జరగలేదు నిజమే కానీ.. మరి వింగ్ కమాండర్… వారి వద్ద ఉన్నారు కదా..! దానికే సమాధానం చెబుతారు..? ఎవరికీ నష్టం కలిగించని దాడులు చేస్తే.. వింగ్ కమాండర్‌ను వెంటనే వదిలేయాలి కదా..!

పాత తరం మిగ్ -21 విమానాలను ఎందుకు ఇంకా వాడుతున్నారు..?

పాకిస్థాన్ విషయంలో ఇప్పుడు భారత్ మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. పాకిస్థాన్ అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్ 16 విమానాలతో భారత్ సరిహద్దులు దాటి బాంబుల వర్షం కురిపించింది. దాన్ని ఎదుర్కొనేందుకు మిగ్ విమానంలో అభినందన్ వెళ్లారు. నిజానికి మిగ్ -21 విమానానికి నడిచే శవపేటిక అనే పేరు ఉంది. వాటిని గతంలోనే ఉపసంహరించారు.. కానీ అప్ డేట్ చేసి వాడుతున్నారు. ఇలాంటి పాత బడిన విమానంతో.. ఎఫ్ 16కి ఎదురెళ్లిన అభినందన్‌కు శిరస్సు వహించి నమస్కరించాలి. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. అలాంటి పాత యుద్ధ విమానంతో ఎందుకు పోరాడాల్సి వచ్చింది. ఎఫ్‌ 16ను ఎదుర్కొనే విషయంలో.. అంతకంటే బలమైన యుద్ధవిమానంతో ఎందుకు ఎదురెళ్లలేకపోయారు..? వీటిపై ఆలోచించాల్సి ఉంది. అందుకే.. ఇమ్రాన్‌ఖాన్‌కు చిత్తశుద్ధి ఉంటే.. అభినందన్‌ను వెంటనే విడుదల చేసి.. చర్చలకు మార్గం సుగమం చేయాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.