ప్రొ.నాగేశ్వర్ : సీబీఐపై చంద్రబాబు నిర్ణయం కరెక్ట్ కాదా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… సీబీఐని ఏపీలోకి రాకుండా… ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి చట్టబద్ధత ఉందో లేదో తెలియాలంటే.. సీబీఐ చట్టం గురించి తెలుసుకోవాలి. దిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం-1946 ప్రకారం కేంద్రం సీబీఐని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దఖలు పడిన అధికారాలను సీబీఐ దిల్లీ భూభాగం పరిధిలోనే అమలు చేయడానికి అవకాశముంది. మొదటగా ఇది… రైల్వే పరిధిలో..యుద్ధ సంబంధిత అవినీతి కేసులు విచారించడానికి ఏర్పాటు చేశారు. కేంద్ర పరిధిలో ఏర్పడింది కాబట్టి.. రాష్ట్రాల్లో కేసులు విచారించవచ్చా లేదా.. అన్నది అసలు సందేరం.

సీబీఐకి అనుమతి రద్దు చేసే అధికారం చంద్రబాబుకు ఉందా..?

రాజ్యాంగంలో రాష్ట్ర, కేంద్ర, ఉమ్మడి జాబితాలుంటాయి. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్.. రాష్ట్రాల జాబితాలో ఉంది. సీబీఐ.. కేంద్రానికి చెందినది. మరి రాష్ట్రాల్లో సీబీఐ ఎలా విచారణ చేస్తుంది..! అందుకే.. దీనికి పరిష్కారంగా… ఏదైనా కేసును… రాష్ట్ర ప్రభుత్వం రిజిస్టర్ చేసిన తర్వాత… ఆ రాష్ట్రం విచారణ చేయమని అడిగితే.. సీబీఐ దర్యాప్తు చేయవచ్చు. కోర్టులు ఆదేశించినా చేయవచ్చు. ఇక మూడో అవకాశం.. రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇస్తేనే విచారణ చేయాల్సి ఉటుంది. ఢిల్లీ బయట దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా తమ అధికారాలను అమలు చేసి దాడులు, దర్యాప్తు చేపట్టాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకు తమ భూభాగంలో పరిధిని కల్పిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేయాలి. అవినీతి నిరోధక చట్టం-1988, ఐపీసీలోని కొన్ని సెక్షన్లు, 63కు పైగా కేంద్ర చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం సీబీఐ ఆయా రాష్ట్రాల భూభాగంలో నేరాల దర్యాప్తు చేసేందుకు జనరల్‌ కన్సెంట్‌ను ఇవ్వాలి. సాధారణ సమ్మతిని రాష్ట్రాలు వెనక్కి తీసుకునే అధికారం కూడా చట్టంలో నిర్దేశించారు. అయితే ఒకటి, రెండు రాష్ట్రాలు వేర్వేరు కారణాలతో ఈ సమ్మతిని ఇవ్వడం లేదు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు ఈ సమ్మతిని ఇస్తూ వస్తోంది. దీనికి సంబంధించి చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టు మూడో తేదీన సాధారణ సమ్మతి నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక నుంచి సీబీఐ అధికారులు ఏపీలో అడుగు పెట్టలేరా..?

అంటే చట్టం ప్రకారమే… రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం మేరకే…సీబీఐ విచారణ చేయాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం.. ఆగస్టులోనే… జనరల్ కన్సెంట్ ను ఇచ్చింది. కేంద్ర ఉద్యోగుల్ని కానీ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్ని కానీ.. ఏమైనా నేరాలు చేస్తే విచారణ చేయించుకోవచ్చు.. అని ఆదేశాలు జారీ చేసింది. ఇది ఓ పద్దతి.. రెండో పద్దతి కేస్ బై కేసు. ప్రతి కేసుకు.. విచారణ చేయడానికి ప్రభుత్వం నుంచి కన్సెంట్ తీసుకోవాలి. అంటే.. కేసు విచారణకు.. అనుమతి ఇవ్వాలో వద్దో ప్రభుత్వం నిర్ణయించుకుంది. చివరిగా ఆగస్టులోనే ఏపీ ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ను ఇచ్చింది. ఇప్పుడు తాను… ఇచ్చిన కన్సెంట్ ను.. ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇది చట్ట విరుద్ధం కాదు. ఏపీకి చట్టపరమైన అధికారం ఉంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు 1994లో స్పష్టం చేసింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ జనరల్ కన్సెంట్ ను విత్ డ్రా చేసుకోవడం..చట్టబద్ధమే. తెలిసి తెలియని వ్యాఖ్యలతో కొంత మంది ఈ విషయంలో గందరగోళం సృష్టించుకంటున్నారు. సీబీఐకి ఏపీ అనుమతి నిరాకరించిందని కొంత మంది చెబుతున్నారు. కానీ.. ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సీబీఐని రాకుండా నిరాకరించలేదు. ఇప్పటికైనా ఏపీలో సీబీఐ ప్రవేశించవచ్చు. అప్పుడు జనరల్ కన్సెంట్ ఉంది. ఇప్పుడు కేసుల వారీగా పర్మిషన్ తీసుకోవాలి అదే తేడా. ఇప్పుడు ఏదైనా విచారణ చేయాలంటే.. ఏపీ ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి అంతే. అంతే కానీ.. అసలు సీబీఐ ఏపీలోకి రాలేదన్నట్లుగా చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు.

సీబీఐపై సీఎం నిర్ణయం ఎందుకు కరెక్ట్ కాదు..?

ఇలా సీబీఐకి ఉన్న జనరల్ కన్సెంట్ ను.. రద్దు చేసే అధికారం.. ప్రభుత్వానికి ఉంది. అయినప్పటికీ… ఇలాంటి ఆదేశాలు ఇవ్వకుండా ఉండాల్సింది. ఎందుకంటే.. ఏదైనా… భారీ స్కామ్ వివిధ రాష్ట్రాల్లో జరిగినది అయితే సీబీఐ.. విచారణ చేయాలంటే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పర్మిషన్ తీసుకుని మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ లోపు.. ఆ నిందితులు పరారవుతారు. సాధారణంగా అయితే… ఏపీకి .. చంద్రబాబుకు అధికారం ఉంది. కానీ.. అది అవినీతి పరులకు ఉపయోగపడే అవకాశం ఉంది. కొన్ని కేసుల విచారణ లేటవుతుంది. అనుమతులు లేటవుతుంది. దాని వల్ల ఇబ్బందికరం అవుతుంది. అందు వల్ల అధికారం ఉన్నప్పుడు కూడా… ఈ ఆదేశాలు జారీ చేయకుండా ఉండాల్సింది.

కోడికత్తి కేసును సీబీఐ ఇక విచారణ చేయలేదా..?

కోడికత్తి దాడి ఘటనపై… సీబీఐ విచారణ జరగకుండానే… ఈ ఆదేశాలు జారీ చేశారంటూ.. జగన్ తో పాటు.. బీజేపీ నేత కన్నా కూడా ఆరోపిస్తున్నారు. జనరల్ కన్సెంట్ ఉన్నా కూడా… చట్టం ప్రకారం… జగన్మోహన్ రెడ్డి కేసును.. సుమోటోగా.. సీబీఐ తీసుకోకూడదు. ఆ అధికారం సీబీఐకి లేదు. అవగాహన లేకుండా మాట్లాడకూడదు. సీబీఐ నేరుగా వెళ్లి విచారణ చేయడానికి అవకాశం లేదు. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తేనే చేస్తుంది. ఏపీకి… రాజ్యాంగబద్ధమైన అధికారులు ఉన్నాయని కోర్టులు కూడా చెప్పాయి. రాష్ట్రాలకు ఉన్న అధికారాలను తీసుకునే అధికారం పార్లమెంట్ కు కూడా లేదు. అంటే.. కేసును ఏపీ ప్రభుత్వం రిఫర్ చేస్తేనే..సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం ఈ కేసు…హైకోర్టులో ఉంది. జనరల్ కన్సెంట్ వితక్ డ్రా చేసుకున్నా కూడా… హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేదు. సీబీఐకి పూర్తి అధికారాలు ఉంటాయి. ఇదంతా ఇంతా స్పష్టంగా ఉంటే.. జగన్మోహన్ రెడ్డి కేసు గురించే.. జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారని.. చెప్పడం అవగాహన లేని వ్యక్తులు మాట్లాడే విషయమే. కన్సెంట్ అనేది… సంబంధం లేని విషయం. కన్సెంట్ ఉన్నా లేకపోయినా.. సుమోటోగా… సీబీఐ కేసులు విచారణ చేయలేదు.

అసలు సీబీఐకి చట్టబద్ధత ఉందో లేదో క్లారిటీ లేదా..?

నిజానికి సీబీఐ అధికారాలపైనే చాలా రోజులుగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ సీఎంపై … జరిగిన విచారణకు సంబంధించి.. అప్పటి సీఎం వీరభద్ర సింగ్ కోర్టుకు వెళ్లారు. సీబీఐ అధికారులపై ప్రశ్నించారు. దాంతో హిమాచల్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వతా 2013లో గౌహతి హైకోర్టు ఇంకా సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. అసలు సీబీఐకి చట్టబద్ధత లేదని తేల్చి చెప్పింది. అది కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడలేదు కాబట్టి.. ఎలాంటి అధికారులు లేవని… ఎవర్నీ కస్టడీలోకి తీసుకోకూడదని.. ఎవరిపైనా చార్జిషీట్లు వేయకూడదని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అసలు సీబీఐకి… రాజ్యాంగబద్ధత.. చట్టబద్ధత ఉందా.. అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే కాదు.. ఏ స్థాయి అధికారులపై దాడులు చేయాలన్నది కూడా.. సందేహమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com