ప్రొ.నాగేశ్వర్ : వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను దిగజార్చారా..?

ప్రధానమంత్రి గుంటూరు పర్యటన రాజకీయాల్లో.. రాజకీయ విమర్శల్లో ఓ మార్పు తీసుకొచ్చింది. ప్రధానమంత్రి గుంటూరుకు వచ్చి చంద్రబాబును.. ఆయన కుటుంబాన్ని కలిపేసి.. వ్యక్తిగత విమర్శలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా కాకుండా.. లోకేష్ తండ్రిగా.. మోడీ పేర్కొన్నారు.. దానికి కౌంటర్‌గా.. చంద్రబాబు జశోదపతి నరేంద్రమోడీ అని తాను అంటే.. తల ఎక్కడ పెట్టుకుంటారని… మోడీకి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ మోడీ.. తన స్థాయికి తగనట్లుగా మాట్లాడారు.

చంద్రబాబు కుటుంబంపై విమర్శలు మోడీ స్థాయికి తగ్గవేనా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజకీయ సభ కోసం గుంటూరు వచ్చారు. ఆయన… తన రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించవచ్చు. చంద్రబాబును విమర్శించవచ్చు… ఆ మాటకొస్తే లోకేష్‌ను కూడా విమర్శించవచ్చు. ఎందుకంటే.. ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్న ఎవరినైనా.. ప్రశ్నించవచ్చు.. విమర్శించవచ్చు. చంద్రబాబు, లోకేష్‌ల పాలనపైన కానీ.. రాజకీయాల్లో వారి పాత్ర కానీ.. పాలనా తీరులోనూ.. భారతీయ జనతాపార్టీ నేతలుగా విమర్శలు చేయవచ్చు. అందులో తప్పేం లేదు. కానీ.. లోకేష్ స్థాయి ఏమిటి..? మోడీ స్థాయి ఏమిటి..?. ఎవరో సోము వీర్రాజునో.. మరో కన్నా లక్ష్మినారాయణలో విమర్శిస్తే సరిపోతుంది. దానికి మోడీ అవసరం లేదు. నేరుగా మోడీ వచ్చి లోకేష్ విమర్శిస్తే.. లోకేష్ స్థాయి పెరుగుతుంది . రాజకీయంగా విమర్శించాలంటే.. చాలా ఉంటాయి కానీ… లోకేష్‌ కా పితాజీ.. అంటూ విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది..?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. విమర్శించడానికి చాలా ఉంటాయి. లోకేష్‌ను విమర్శించడానికి కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.. చంద్రబాబునాయుడుగా.. తెలుసు. లోకేష్ తండ్రిగా కాదు. ఇలా చేసిన ఓ ప్రయోగం వల్ల.. మోడీ తన స్థాయిని తాను తగ్గించుకున్నారు. ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల రాజకీయ లక్ష్యానికి కూడా దూరమవుతారు.

మోడీ భార్య విషయాన్ని రాజకీయాల్లోకి తేవడం ఎందుకు..?

దీనికి కౌంటర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా.. వ్యక్తిగత విమర్శలు చేశారు. భార్యకు విడాకులు ఇవ్వకుండా..మోడీ వదిలేశారన్నారు. ఇది కూడా తప్పే. లోకేష్ రాజకీయాల్లో ఉన్నారు కానీ.. ఆమె రాజకీయల్లో లేదు. అది పూర్తిగా వ్యక్తిగత విషయం. మోడీ భార్య పేరు.. ఓ సారి అఫిడవిట్ లో రాశారు.. మరోసారి రాయలేదు…లాంటి వివాదాలున్నాయి. అది నైతిక విషయం. రాయాలా వద్దా అన్నది నైతిక అంశం. ఆమెకు విడాకులు ఇచ్చారా లేదా… అన్నది వ్యక్తిగత విషయం. ఆమె కూడా ఇంత వరకూ.. ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ..తన భర్త తనను పట్టించుకోవడం లేదని.. ధర్నా కూడా చేయలేదు. ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఇదంతా రాజకీయానికి సంబంధం లేని అంశం.

ప్రజా సమస్యలపై విమర్శలు చేసుకుంటేనే ప్రజలకు మేలు..!

మోడీ స్థాయి నేత వచ్చి.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న లోకేష్‌ను.. చంద్రబాబు కుటుంబాన్ని ఎగతాళి చేసేలా విమర్శలు చేయడం.. దానికికౌంటర్‌గా.. చంద్రబాబు… మోడీ వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి… వ్యాఖ్యలు చేయడం… రెండూ.. కరెక్ట్ కాదు. ఇది రాజకీయాలకు సంబంధం లేదని అంశాలు. మోడీ.. ఏపీకి వచ్చినప్పుడు… ప్రజల డిమాండ్లయిన.. సమస్యల గురించి స్పందించాలి. అవి చెప్పకుండా.. అన్నీ చెప్పి.. చంద్రబాబుపై వ్యక్తిగత దాడి చేసి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది..? అలాగే చంద్రబాబు కూడా.. వ్యక్తిగత విమర్శల దాడి చేయడం కన్నా.. ప్రజల అంశాలు, విభజన హామీలు చర్చకు వచ్చేలా.. విమర్శలు చేయాల్సింది. అలా చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఎలా చూసినా.. ప్రధానమంత్రి స్థాయిలోని నేత చేయదగిన వ్యాఖ్యలు.. గుంటూరులో మోడీ చేయలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.