ఇరాన్ సుప్రీంలీడర్ ఖొమైనీని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చంపేశాయి. ఇక్కడ మన దేశంలో అక్కడ కశ్మీర్ నుంచి ఇక్కడ మిచిలీపట్నం వరకూ షియా ముస్లింలు ఆందోళనలు చేశారు. అసలు ఇరాన్ కు.. మన దేశానికి ఏమైనా సంబంధం ఉందా?. కానీ అక్కడి లీడర్ కోసం ఇక్కడ ఆవేశపడుతున్నారు. దేశాల మధ్య ఉండాల్సిన స్నేహత్వమో శత్రుత్వమో వ్యక్తిగత స్థాయికి తీసుకున్నారు. ఇది ఒక్కటేనా.. పాకిస్తాన్ లో ఏం జరిగినా.. బంగ్లాదేశ్ లో ఏం జరిగినా సరే.. ఇక్కడ ఏదో ఓ బీరకాయ పీచు సంబంధం వెదుక్కుని ఆందోళనలు చేస్తున్నారు. అసలు ఇవన్నీ మన జీవితాలతో ఎలా ముడిపడి ఉంటాయో ఒక్కరూ ఆలోచించరు.
ముందుగా దేశపౌరులు
దేశంలో ఖొమైనీ మరణంపై జరుగుతున్న ఆందోళనలు కేవలం ఆ దేశంపై ఉన్న ప్రేమ కంటే కూడా, ఒకే మత విశ్వాసానికి చెందిన వ్యక్తుల వల్ల పుడుతున్నాయి. ఈ రకమైన అనుబంధం దేశ సరిహద్దులను దాటుతోంది. షియా ముస్లింలు ప్రపంచం అంతా ఉన్నారు. వారికి ఖొమైనీ నాయకుడు కాదు. ఏ దేశంలో నివసిస్తున్నారో వారు ఆ దేశానికి బద్దులై ఉండాలి. ముందుగా దేశ పౌరులు.. తరవాత మతం అనే సంగతి రాను రాను మరచిపోతున్నారు.
భారత్లో సమస్యల్లేవా?
భారతదేశం వంటి వైవిధ్యభరితమైన ప్రజాస్వామ్య దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం, పేదరికం, మౌలిక వసతుల లేమి వంటి మన బతుకులను ప్రభావితం చేసే అంశాల కంటే, ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న దేశాల నాయకుల కోసం వీధుల్లోకి రావడం వెనుక ఉన్న బీరకాయ పీచు సంబంధాన్ని వెదుక్కుంటున్నారు. పాకిస్తాన్ , బంగ్లాదేశ్లో ఏదైనా జరిగితే ఇక్కడ అలజడి రేగడం అనేది భారతీయులం అనే జాతీయ భావన కంటే మతపరమైన గుర్తింపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదనకు బలాన్నిస్తోంది. సొంత దేశ ప్రజల కష్టాలను గుర్తించకుండా, విదేశీ శక్తుల పట్ల అమితమైన ప్రేమను చూపడం వల్ల దేశాభివృద్ధికి వచ్చే లాభం శూన్యం.
వ్యక్తిగత విశ్వాసాలు దేశానికి వ్యతిరేకం కాకూడదు !
కులమతాలు అనేవి వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినవి. కానీ, ఒకే మతం లేదా కులం అనే కారణంతో ఇతర దేశాల రాజకీయ ప్రయోజనాలకు మన గడ్డపై మద్దతు తెలపడం ప్రమాదకరమైన ధోరణి. పొరుగువాడిని ప్రేమించడం చేతగాని వారు, విదేశీ నాయకుల కోసం నినదించడం విడ్డూరంగా అనిపిస్తుంది. మన దేశంలోని వ్యక్తులపై ద్వేషం పెంచుకుంటూ, విదేశీయుల పట్ల మమకారం పెంచుకోవడం వల్ల సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. మన దేశ ప్రయోజనాలే మనకు పరమావధి కావాలి. ఇతర దేశాల అంతర్గత విషయాలను మన వీధుల్లోకి తీసుకురావడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తడమే తప్ప, సామాన్యుడి జీవితంలో ఎలాంటి వెలుగులు నిండవు. మతపరమైన సరిహద్దుల కంటే దేశ సరిహద్దులు, ప్రజల సంక్షేమమే ముఖ్యం అనే ఆలోచన ప్రతి పౌరుడిలో కలగాలి. అప్పుడే మనం ప్రపంచ వేదికపై ఒక బలమైన శక్తిగా ఎదగగలమనేది అందరికీ తెలిసిన విషయం.కానీ ఎవరు గుర్తిస్తారు?
