ఈరోజు ప్రేక్షకులకు ఓపిక చాలా తక్కువ. ఏ సినిమా పడితే ఆ సినిమాకు వెళ్లడం లేదు. మౌత్ టాక్, రివ్యూలూ చూసి డిసైడ్ అవుతున్నారు. టీజర్, ట్రైలర్ తోనే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. సినిమా చూడాలా, వద్దా అనేది డిసైడ్ అయిపోతున్నారు. చిన్న సినిమా అంటే ట్రైలర్ తో కట్టిపడేయాల్సిందే. లేదంటే ఓపెనింగ్స్ ఉండడం లేదు. అందుకే ట్రైలర్ కట్ విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. సినిమాలో ఏముందో అది ట్రైలర్లో చెప్పేయాలి. ముందే ప్రిపేర్ చేసేయాలి. బోల్డ్ కంటెంట్ ఉంటే.. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ కట్ చేయాలి. ఈమధ్య కాలంలో వచ్చిన ట్రైలర్లలో ‘సైక్ సిద్దార్థ్’ లో అలాంటి కంటెంట్ గట్టిగానే కనిపిస్తోంది.
కొన్ని సినిమాల్లో హీరోగా నటించి, క్రికెట్ వ్యాఖ్యాతగా మారి, రియాలిటీ షోలను నడిపించిన నందు ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. తనే హీరో. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. యామినీ భాస్కర్ హీరోయిన్. గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా ఈనెల 12న విడుదల అవుతోంది. ప్రమోషన్లు మాత్రం కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు అనిపించింది. రానా దగ్గుబాటి ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకోవడం, సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేస్తుండడంతో కాస్త హైప్ వచ్చింది. దానికి తోడు టీజర్ కట్ చేసిన విధానం, ట్రైలర్ లో చూపించిన కంటెంట్ ఆసక్తిగా అనిపించింది.
సిద్దార్థ్ రెడ్డి అనే కుర్రాడి కథ ఇది. జీవితంలో, కెరీర్లో, ప్రేమలో అన్ని రకాలుగా నష్టపోయిన అతగాడి ఫస్ట్రేషన్.. ట్రైలర్లోని ప్రతీ ఫ్రేములోనూ కనిపించింది. కొన్ని డైలాగులు బూతుల్లా అనిపించినా, వాటిలోనూ ఫస్ట్రేషనే దాగుంది. బోల్డ్ కంటెంట్ చాలానే ఉంది ఈ ట్రైలర్ లో. అదే సినిమాలోనూ చూపిస్తే యూత్ ని ఆకర్షించినట్టే. కంటెంట్ పక్కన పెడితే ట్రైలర్ కట్ చేసిన పేట్రన్ కూడా బాగుంది. అర్జున్ రెడ్డి ఛాయలు అక్కడక్కడ కనిపించాయి. సిద్దార్థ్ రెడ్డి అనే పేరు కూడా అర్జున్ రెడ్డిని పోలి ఉంది. నందు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తన కెరీర్లో సంపాదించిందంతా ఈ సినిమాపై పెట్టుబడి పెట్టాడు. మరి తన అదృష్టం ఎలా ఉందో?
