దౌర్జన్యాలు,దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవు.. అని బెయిల్ వచ్చినట్లుగా బ్రేకింగ్ న్యూస్ రాగానే అంబటి రాంబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్టు పడింది. ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి ట్విట్టర్ వాడలేరు. ఆయన పేరుతో అకౌంట్ మ్యానేజ్ చేసేవారు వేసి ఉంటారు. ఇప్పుడు ఆయన నాలిక్కరుచుకుని ఉంటారు. ఎందుకంటే ఆయన ఇప్పుడే విడుదల కావడం లేదు. మరో కేసులో ఆయనకు పీటీ వారెంట్ పడింది. మున్సిపల్ సివిల్ కోర్టు పీటీ వారెంట్ ఇవ్వడంతో ఆయనను గురువారం కోర్టులో హారజరు పర్చనున్నారు. దానర్థం ఆ కేసులో కూడా మళ్లీ బెయిల్ తెచ్చుకోవాలన్నమాట.
ప్రస్తుత కేసు ఏమిటంటే.. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వెలగబెట్టిన ఘనకార్యాలల్లో ఒకదానిపై కేసు నమోదు అయింది. ఆయన సంక్రాంతి సంబరాలను నిర్వహించేవారు. అలాగే తన సంబరాలకు టిక్కెట్లు పెట్టేవారు. వాలంటీర్లను పెట్టి ప్రభుత్వ లబ్దిదారుల నుంచి రూ.200 వసూలు చేసి టిక్కెట్లు అంటగట్టేవారు. ఈ అంశంపై అప్పట్లో ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలోనే కేసు నమోదు అయింది. ఇప్పుడు అది పీటీ వారెంట్ కు పనికి వచ్చింది. పోలీసులు ఆయను జైల్లోనే ఉంచుతున్నారు.
ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. విచారణలు జరగాలి. మళ్లీ బెయిల్ రావాలి. కానీ ఎన్ని కేసులు ఇంకా పీటీ వారెంట్ల కోసం పోలీసులు దాచి ఉంచారో తెలియదు. గతంలో ఆయనపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. కేసులూ నమోదయ్యాయి. ఎన్నికల సమయంలోనూ.. ఆతర్వాత కూడా ఆయన చాలా వరకూ అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నెన్ని కేసులు గుప్తంగా ఉన్నాయో కానీ.. అంబటి రాంబాబు తొందరపడి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ కామెడీగా మారుతోంది.
