ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టడీ మరణం ఆరోపణల ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది. చట్టం ప్రకారం పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు నిబంధనలు పాటించాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ వ్యవహారంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నిందితుడి ఆచూకీ గల్లంతవడానికి కారణమైన కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజు చర్యలపై సాధారణ ప్రజల నుండి, ముఖ్యంగా నెటిజన్ల నుండి ఒక రకమైన అప్రకటిత మద్దతు లభిస్తోంది.
లాకప్ డెత్‌లపై సమాజంలో తీవ్ర వ్యతిరేకత
సాధారణంగా పోలీస్ కస్టడీలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ, ఈ కేసులో పబ్లిక్ సెంటిమెంట్ భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణం.. సాయికృష్ణ నేరాల నేపథ్యమే. పాతికేళ్ల వయసున్న సాయికృష్ణ మైనర్‌గా ఉన్నప్పటి నుండే పెడదారి పట్టి సమాజానికి ఒక పెద్ద ముప్పుగా తయారయ్యాడు. బర్త్ డే పార్టీ నెపంతో మద్యం తాగి గొడవ పెట్టుకుని నవీన్ రెడ్డి అనే మరో రౌడీషీటర్‌ను అత్యంత కిరాతకంగా చంపడమే కాకుండా, ఆ రక్తసిక్తమైన దృశ్యాలను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి పైశాచిక ఆనందం పొందిన హిస్టరీ ఇతనిది. అంతేకాకుండా, ఒక మైనర్ బాలికపై అత్యాచారం లాంటి అత్యంత జుగుప్సాకరమైన నేరారోపణలు కూడా ఇతనిపై ఉన్నాయి. ఇటువంటి క్రూరమైన మైండ్‌సెట్ ఉన్న వ్యక్తి సమాజంలో స్వేచ్ఛగా తిరిగితే ఇంకా ఎంతమంది ప్రాణాలకు, ఆడబిడ్డల మానాలకు ముప్పు వాటిల్లేదోనన్న ఆందోళన సామాన్యుల్లో ఉంది.
కులం పేరుతో మద్దతు ప్రకటించడంతో పోలీసులకు సానుభూతి
ఈ సున్నితమైన క్రిమినల్ వ్యవహారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , వారి అనుకూల మీడియా ఓట్ల రాజకీయం కోసం కులాల రంగు పులిమి విస్తృతంగా చర్చకు తీసుకురావడమే ఇప్పుడు వారి వ్యూహానికి బూమరాంగ్ అయింది. సాయికృష్ణను పోలీసులు కొట్టి చంపేశారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెట్టి, దీనికి ఒక సామాజిక వర్గం సెంటిమెంట్‌ను అంటగట్టడానికి ప్రయత్నించారు. అయితే, ఎప్పుడైతే ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుందో.. సామాన్య ప్రజలు అసలు ఈ సాయికృష్ణ ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇన్ స్టాగ్రామ్‌లో నవీన్ రెడ్డిని చంపిన పాత రీల్స్, అతని పాత నేరాల చిట్టా అంతా బయటకు రావడంతో పబ్లిక్ మైండ్ సెట్ ఒక్కసారిగా మారిపోయింది.
పోలీసులు చేసింది తప్పే ..కానీ !
ప్రజల నుండి వస్తున్న ఈ స్పందన చట్టపరంగా సమర్థనీయం కాకపోయినా.. సమాజంలోని నైతిక ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తోంది. చట్టం తన పని తాను చేయాలని, పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షించాల్సిందేనని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీఐ నాగరాజును సస్పెండ్ చేసి ఐపీఎస్ అధికారితో దర్యాప్తుకు ఆదేశించారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి సైకోలు, క్రూరమైన నేరగాళ్లకు ఇలా జరగడమే కరెక్ట్.. లేదంటే కోర్టుల చుట్టూ తిరుగుతూ బెయిల్‌పై వచ్చి మరిన్ని ఘోరాలు చేస్తారు అనే అభిప్రాయం సామాన్యుల్లో బలంగా వ్యక్తమవుతోంది. తరవాత ఎప్పుడో మోర ఘోరం జరిగిన తరవాత వీళ్లే ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్లతో వస్తారు. ఒక రౌడీషీటర్ కోసం పొలిటికల్ మైలేజ్ ఆశించి వైసీపీ చేసిన క్షుద్ర రాజకీయం కాస్తా.. చివరికి సదరు నేరగాడి క్రూరత్వాన్ని సమాజానికి గుర్తుచేసి, పరోక్షంగా పోలీసుల చర్యకే ప్రజల మద్దతు లభించేలా చేసిందని అనుకోవచ్చు.
