రాజకీయాల్లో అత్యంత ప్రాథమికమైన సూత్రం ఒకటి ఉంది.. “శత్రువును ఎంతగా పర్సనల్ టార్గెట్ చేస్తే.. అతడు అంతగా బలపడతాడు.” దురదృష్టవశాత్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సింపుల్ లాజిక్‌ను వివరించి చెప్పే సరైన పొలిటికల్ స్ట్రాటజిస్టులు కరువయ్యారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలోనూ జగన్ ఇదే వ్యూహాత్మక పొరపాటు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అదే పంథాను కొనసాగిస్తూ.. తనకు ప్రధాన ముప్పుగా భావిస్తున్న డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇరుకున పెట్టాలనే ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతున్నారు.
కాపుల్లో చీలిక తేవాలనుకుంటున్న జగన్
పవన్ కళ్యాణ్‌కు లభిస్తున్న తిరుగులేని ప్రజాదరణను, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఆయన వెనుక పటిష్టంగా నిలబడటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్‌ను రాజకీయంగా దెబ్బతీయాలంటే ఆయనకు ప్రధాన బలమైన కాపులను విడదీయాలనే కుట్రతోనే.. ఇటీవల విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసును పట్టుకుని వైసీపీ విస్తృత రాజకీయం చేస్తోంది. సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, ఆ కులాన్ని రెచ్చగొట్టి పవన్‌పైకి ఉసిగొల్పాలని వైసీపీ నేతలు వేసిన స్కెచ్ క్షేత్రస్థాయిలో పూర్తిగా రివర్స్ అయింది.
కాపుల రాజకీయ చైతన్యాన్ని తక్కువ అంచనా వేయగలరా?
కాపు సామాజిక వర్గాన్ని విడదీసేందుకు జగన్ ఎంతగా ప్రయత్నిస్తే, ఆ వర్గం అంతకంటే వేగంగా పవన్ కళ్యాణ్ వెనుక సంఘటితం అవుతోంది. ఎందుకంటే, సుదీర్ఘ కాలం తర్వాత జనసేన పార్టీ ద్వారా, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉండటం వల్లే తమ సామాజిక వర్గానికి అధికారంలో సముచితమైన ప్రాధాన్యత, గౌరవం లభిస్తున్నాయనే స్పష్టమైన నమ్మకం ఆ వర్గంలో ఏర్పడింది. ఇటువంటి తరుణంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలను కాపులు తమ ప్రాధాన్యతను దెబ్బతీసే కుట్రగానే చూస్తున్నారు తప్ప, జగన్ మాటలను నమ్మే పరిస్థితిలో లేరు.
పవన్ కోసమే పని చేస్తున్న వైసీపీ
జగన్ ఇప్పటికైనా ఈ టార్గెటెడ్ రాజకీయాలు ఆపకపోతే భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బతినడం ఖాయమని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. గతంలో పవన్‌ను ప్యాకేజీ స్టార్ అని, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ జగన్ చేసిన విమర్శలే 2024 లో జనసేనకు 100 శాతం స్ట్రైక్ రేట్ వచ్చేలా చేశాయి. ఇప్పుడు కూడా పవన్‌ను ఎంతగా విమర్శిస్తే, ఆయనకు అంతగా సానుభూతి, రాజకీయ బలం పెరుగుతాయనే కనీస లాజిక్‌ను గమనించకుండా వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రయోగాలు.. పరోక్షంగా పవన్ కళ్యాణ్‌ను మరింత తిరుగులేని శక్తిగా మారుస్తున్నాయని చెప్పక తప్పదు.
పవన్ కల్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఆయనను బలహీనం చేయాలనుకుంటే.. ప్రజా సమస్యల కోణంలోనే చేయాలి. కులం పరంగా చేయాలనుకుంటే అతి పెద్ద పొరపాటు అవుతుంది. ప్రస్తుతం జగన్ అదే చేస్తున్నారు.
