నియోజకవర్గానికి ఒకటి, రెండు స్కూళ్లలో నాడు, నేడు అని రంగులు, బల్లలు కొని కమిషన్లు కొట్టేసి అదే విద్యావ్యవస్థకు జగన్ రెడ్డి చేసిన గొప్ప సేవ అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. కానీ వాస్తవాలు మాత్రం ఎన్నికల సమయంలోనే బయటపడుతూంటాయి. ఎందుకంటే పోలింగ్ కేంద్రాలుగా స్కూళ్లే ఉంటాయి. ప్రస్తుతం పులివెందుల మండలంలో జరుగుతున్న జడ్పీటీసీ ఉపఎన్నికలు ఒంటి మిట్టలో జరుగుతున్న ఉపఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం బారులు తీరిన స్కూళ్లను చూస్తే.. జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి మనకు స్పష్టంగా కనిపిస్తోంది.
దశాబ్దాల కిందట గ్రామాల్లో స్కూళ్లను నిర్మించారు. వాటిని కనీసం బాగు చేసిన వారు కూడా లేరు. పులివెందులలో అయితే అసలు బాగు చేయాల్సిన అవసరం కూడా అక్కడి పాలకులకు లేదు. ఒక్కటంటే ఒక్క గ్రామంలో స్కూల్ కూడా కొత్త భవనంలో లేదు. అన్నీ దాదాపుగా శిథిలావస్థలోనే ఉన్నాయి. కనీసం రంగులు కూడా వేయించలేదు. జరుగుతోంది రెండు మండలాల్లోని ఎన్నికలు.. నలభైలోపే పోలింగ్ కేంద్రాలు కావడంతో మీడియా దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాలను కవర్ చేస్తోంది. ప్రతి పోలింగ్ కేంద్రం కూడా పురాతన కట్టడాల్లాంటి స్కూళ్లలోనే ఉంది.
వైఎస్ ఫ్యామిలీ దశాబ్దాలుగా పులివెందులను గుప్పిట్లో పెట్టుకుంది. ఏ ఎన్నిక జరిగినా గుట్టుగా జరిగిపోతుంది. ప్రజలు ఓట్లు వేస్తారో లేదో వారికే తెలియాలి. కానీ ఎక్కడా ఫలితం మాత్రం తేడా రాదు. ప్రజలే తమను పులుల్ని చేశారని ఆ కుటుంబ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారి కోసం కనీస విద్యా సౌకర్యాలు కూడా కల్పించాడనికి వారు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దానికి ప్రస్తుతం కనిపిస్తున్న స్కూళ్లే సాక్ష్యం.