వృత్తా… ప్ర‌వృత్తా.. సిద్దూ..రోజా…

చ‌ట్ట స‌భ్యులు త‌మ విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్నారా..ఒక‌వేళ దారి త‌ప్పుతున్నారా.. అలా త‌ప్పుతున్న వారికి మ‌నం చెప్పే సుద్దులు ఎలాగూ చెవికెక్క‌వు. అందుకే న్యాయ స్థానాలు రంగంలోకి దిగాల్సి వ‌స్తోంది. రాజ్యాంగం సాక్షిగా ప‌ద‌వీ స్వీకార ప్ర‌మాణాలు చేసే వారు బాధ్య‌త‌ల‌ను మ‌రిచిపోయి, ప్ర‌వ‌ర్తిస్తుండ‌డం ఇటీవ‌లి కాలంలో పెరిగిపోయింది. మాట్లాడ‌కూడ‌ని అంశాలు ప్ర‌స్తావించ‌డం, స‌భ‌ల్లోనే వ్య‌క్తిగ‌త‌ దూష‌ణ‌ల‌కు దిగుతుండ‌డం అంశాలు ఎక్కువైపోతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న స‌భ సాగిన తీరే ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఇక్క‌డ చెప్పే అంశానికీ ఏపీకీ సంబంధం లేక‌పోయినా ఉద‌హ‌రించాల్సి వ‌చ్చింది. ఆఖ‌రు నిముషంలో నిర్ణ‌యం తీసుకుని కాంగ్రెస్‌లో కొన‌సాగ‌డానికే మొగ్గుచూపిన స్టార్ క్రికెట‌ర్ న‌వజ్యోత్ సింగ్ సిద్దూకు ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ క్యాబినెట్లో చోటు ద‌క్కింది. హాస్య‌స్ఫోర‌క‌మైన వ్యాఖ్య‌ల‌తో కామెడీ రియాల్టీ షోల‌ను ర‌క్తి క‌ట్టించిన సిద్దూ మంత్రి అయిన త‌ర‌వాత కూడా త‌న ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రును విడిచిపెట్ట‌లేదు. అంత‌వ‌ర‌కూ ఎవ‌రూ తప్పుపట్ట‌రు.. పట్ట‌లేరు… కానీ వ్యాఖ్య‌లు శృతిమించితే.. ఏ ధ‌ర్మాస‌నం స‌హిస్తుంది.

అలాంటి వ్యాఖ్య‌ల‌ను పంజాబ్‌కు చెందిన ఓ పౌరుడు న్యాయ‌స్థానాల దృష్టికి తెచ్చాడు. అక్క‌డితో ఆగ‌కుండా…. ఇటు మంత్రి గానూ క‌పిల్ శ‌ర్మ షోలోనూ సిద్దూ రెండు చేతులా సంపాదిస్తున్నార‌ని అందులో పేర్కొన్నాడు. 1952 చ‌ట్టాన్ని గుర్తు చేస్తూ పంజాబ్ హ‌ర్యానా ఉమ్మ‌డి హైకోర్టు సిద్ధూను త‌ప్పు ప‌ట్టింది. ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది. మంత్రిగా ప్ర‌భుత్వం నుంచి ఆదాయం పొందుతూనే, క‌పిల్ శ‌ర్మ షోలో పాల్గొంటున్నార‌నీ చెబుతూ, ఇది నైతిక విలువ‌ల‌కు వ్య‌తిరేక‌మ‌ని స్ప‌ష్టంచేసింది. మే 11వ తేదీకి కేసును వాయిదా వేస్తూ ఈలోగా ఏదో ఒక‌టి మాత్ర‌మే కొన‌సాగించాల‌ని సూచించింది. హైకోర్టు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో సిద్దూ ఏం చేస్తాడో అంద‌రం చాలా తేలిక‌గా ఊహించ‌వచ్చు. కోరి మంత్రి ప‌ద‌వి వ‌స్తే కాల‌ద‌న్నుకునే వారుండ‌ర‌నే విష‌యం సిద్దూకు తెలియ‌నిది కాదు. సామాన్యుడైనా దీనికి స‌మాధానాన్ని చాలా తేలిగ్గా చెప్పేస్తారు. కానీ సిద్దూ ఏమంటున్నారో చూడండి. ప్ర‌జ‌ల‌కు లేని ఇబ్బంది ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్‌కు ఎందుకని కొట్టిపారేశారు.
ఒక్క‌సారి ఇటు ఆంధ్ర ప్ర‌దేశ్‌లోకి తొంగిచూస్తే ఇలాంటి పాత్ర‌లోనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా క‌నిపిస్తారు. ప్ర‌భుత్వంలో ఆమె భాగ‌స్వామి కాన‌ప్ప‌టికీ ఆమె ఓ టీవీ షోలో పాల్గొంటున్నారు. అంటే ప్ర‌భుత్వం ఇస్తున్న వేత‌నం స్వీక‌రిస్తున్న‌ట్లే. అదే స‌మ‌యంలో ఈటీవీ నిర్వ‌హిస్తున్న జ‌బ‌ర్ద‌స్త్ షోలో పాల్గొన‌డం ద్వారా ల‌బ్ధిని పొందుతున్నారామె. సిద్దూ చేసింది త‌ప్ప‌ని తేలితే, రోజా కూడా ఏదో ఒక‌టి తేల్చుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రోజాను టార్గెట్ చేయ‌డానికి ఎప్పుడూ సిద్దంగా ఉండే టీడీపీ ఎమ్మెల్యేలు దీనిపై ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ఆమె కూడా వృత్తి వేరు ప్ర‌వృత్తి వేరు అని త‌ప్పించుకుంటారా.

Subrahmanyam vs Kuchimanchi

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.