పూరీ జగన్నాథ్ ఇచ్చినన్ని డిజాస్టర్స్‌ని వేరే ఏ డైరెక్టర్ ఇచ్చి ఉన్నా… ఈ పాటికి ఎప్పుడో బలవంతంగా రిటైర్మెంట్ తీసుకునేలా చేసి ఉండేవాళ్ళు మన తెలుగు హీరోలు. నిర్మాత చేత పెట్టించిన పెట్టుబడిలో పట్టుమని పది శాతం కలెక్షన్స్ కూడా రాని స్థాయి డిజాస్టర్స్ ఇచ్చిన ఘనత పూరీ జగన్నాథ్ సొంతం. అయినప్పటికీ… ఇప్పటికీ కూడా పూరీతో సినిమా చేయడానికి మన హీరోలలో ఎవరో ఒకరు రెడీగానే ఉంటున్నారు. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అన్నదే ఇండస్ట్రీ టాక్. అలాగే స్టార్ హీరోగా రవితేజ నిలదొక్కుకోవడానికి కూడా పవనే కారణం అని క్రిటిక్స్ చెప్తూ ఉంటారు.
అన్నీ తానై, తన అభిరుచికి తగ్గట్టుగా సినిమా ఉండేలా, తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి సెట్ చేయించిన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ సినిమా విషయం పక్కన పెడితే రెండో సినిమా ‘గోకులంలో సీత’ నుంచే తనకంటూ ఓ ప్రత్యేకమైన యాక్టింగ్ శైలిని, క్యారెక్టరైజేషన్‌ని క్రియేట్ చేసుకున్నాడు పవన్. తొలిప్రేమ, తమ్ముడు, బద్రిలాంటి సినిమాలతో ఆ యాక్టింగ్ శైలికి సూపర్ హీరోయిజం వచ్చేలా చేశాడు. హీరో చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు, భయంకరమైన బలుపు ఉంటుంది, అమ్మా, నాన్నలను కూడా పేరు పెట్టే పిలుస్తూ ఉంటాడు, ఎవ్వరినీ లెక్క చేయడు, బేవార్స్‌గా తిరుగుతూ ఉంటాడు, మాటతీరు కూడా అలాగే ఉంటుంది, ఎవ్వరితోనైనా ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉంటాడు, సినిమాలో చాలా భాగం వరకూ కూడా చుట్టూ ఉన్న చాలా మంది హీరోని తిడుతూ ఉంటారు, కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి హీరో పే…ద్ద…తోపు అయిపోతాడు. చాలా పే…ద్ద..విజయం సాధించేసి అప్పటి వరకూ ప్రతి రోజూ కష్టపడుతూ, కరెక్ట్‌గా ఉన్నవాళ్ళందరికంటే కూడా పరమ బేవార్స్ అయిన ఈ హీరోగారు చాలా పే…ద్ద హీరో అయిపోతారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉండే హీరోయిజం శైలి.
ఈ హీరోయిజానికి పూరీ జగన్నాథ్‌గారు అదనంగా యాడ్ చేసిన మసాలాలు ఏంటంటే హీరోయిన్ని హింసించడం, ఏడిపించడం లాంటివి. పూరీ హీరోలు హీరోయిన్స్‌ని ఏడిపించే సీన్స్ వరకూ చూస్తే…వీడు హీరోనా? విలనా? అన్న డౌట్ కూడా చాలా సార్లు వస్తూ ఉంటుంది. దానికి తోడు కొన్ని సినిమాల్లో మొదటి నుంచీ చివరిదాకా కూడా హీరో విలన్‌గానే ఉండడం, ఆ విలనిజానికే హీరో వర్షిప్ వచ్చే రేంజ్లో అందరూ ఎదవలే అనేలా మాంచి కిక్ ఇచ్చే డైలాగ్స్ రాసే పూరీ, ఆ ఎదవల్లో నా హీరో కాస్త మంచి ఎదవ కాబట్టి ఈడే హీరో అన్న ముగింపుతో శుభం కార్డ్ ఏసేయడం.
ఇలాంటి హీరోయిజంపైన ఎక్కువ శాతం ప్రేక్షకులకు ఎప్పుడో మొహం మొత్తింది కానీ పూరీ జగన్నాథ్‌కి, మన హీరోలకు మాత్రం ఇంకా మోజు తీరినట్టు లేదు. మరీ ముఖ్యంగా ఇలాంటి హీరోయిజాన్ని ఇప్పటి వరకూ ప్రదర్శించలేకపోయిన హీరోలు ఇంకాస్త ఎక్కువ ఆత్రపడుతున్నారు. ఇప్పుడు పూరీ కూడా అలాంటి వాళ్ళకే గాలం వేస్తున్నాడు. వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్‌లతో సినిమాలను అలానే సెట్ చేసుకున్నాడు. ఇప్పుడిక రామ్ చుట్టూ తిరుగుతున్నాడని తెలుస్తోంది. మ..మ…మాస్ హీరో అయిపోవాలన్న ఆత్రం రామ్‌కి చాలా ఎక్కువ. అలాగే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ శైలి అన్నాకూడా మనవాడికి భలే భలే ఇష్టం. ఇంకేముంది….పూరీ చెప్పిన కథ కూడా పూర్తిగా విని ఉండడు. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉంటాడు. కాకపోతే సీనియర్ ప్రొడ్యూసర్ మరియు రామ్‌కి బంధువు అయిన స్రవంతి రవికిషోర్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. దర్శకత్వం, రచనా సామర్ధ్యం విషయంలో చాలా మందికంటే కూడా సూపర్ టాలెంటెడ్ అయిన పూరీ జగన్నాథ్‌గారు… ఈ ట్రేడ్ మార్క్ హీరోయిజానికి ఎప్పుడు ముగింపు పలుకుతాడో, ఇంకా ఎన్ని డిజాస్టర్స్ పడితే హీరో క్యారెక్టరైజేషన్‌ని కాస్త కొత్తగా డిజైన్ చేయాలన్న విషయాన్ని రియలైజ్ అవుతాడో చూడాలి మరి.