ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ డిసిప్లిన్ & అప్పీల్ రూల్స్, 1969లోని రూల్ 3(3) నిబంధనల ప్రకారం, ఆయనపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవి కావడంతో సర్వీసులో కొనసాగించడం సముచితం కాదని ప్రభుత్వం భావించింది.
ప్రస్తుతం గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సునీల్ కుమార్‌పై నమోదైన క్రైమ్ నంబర్ 187/2024 కేసు దర్యాప్తు దశలో ఉంది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు లేదా ఆయన పదవీ విరమణ తేదీ అయిన 2026, జూన్ 30 వరకు ఏది ముందుగా వస్తే ఆ తేదీ వరకూ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన హోదాను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణల వల్ల ఆయన సర్వీసు నుంచి తప్పుకునే వరకు విధులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
వరుస సస్పెన్షన్లతో ఇరకాటంలో పడ్డ సునీల్ కుమార్, తన పదవీ విరమణ వరకు ఇక విధుల్లో చేరే అవకాశం లేదని స్పష్టమవుతోంది. అయితే, రిటైర్మెంట్ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలోనే ఆయన ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియా వేదికగా పరోక్ష విమర్శలు చేయగా, ఇప్పుడు తాజా ఉత్తర్వులతో ఆయన కెరీర్ ముగింపు దశలో తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రిటైర్మెంట్ తర్వాత అధికారికంగా వైసీపీలో చేరి తన రాజకీయాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
