రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పీవీ సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సిట్ కార్యాలయం ఎదుట ఉదయం హాజరయ్యారు. ఆయనను ఆ కేసును విచారిస్తున్న ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో సునీల్ కుమార్ ఏ 1గా ఉన్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న మరో నిందితుడు, ప్రస్తుతం బీహార్ లో విధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్ అనే ఐపీఎస్ కూ నోటీసులు జారీ చేశారు. ఆయన చాలా కాలంగా విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారు. పీవీ సునీల్ కూడా ఓ సారి డుమ్మాకొట్టారు. రెండో సారి నోటీసులు జారీ చేస్తే తప్పనిసరిగా హాజరయ్యారు.
రఘురామ పుట్టిన రోజునే రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటిపై దాడి చేసి..కేసు ఏమిటో కూడా చెప్పకుండా.. నిబంధనలకు పాటించకుండా గుంటూరు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి సీఐడీ ఆఫీసులో ఆయనపై దాడి చేశారు. ఈ విషయాన్ని ఆయనకోర్టులో చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య నివేదికలు తారుమారు చేశారు. చివరికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో టెస్టులు చేయించడంతో దాడి చేశారని తేలింది. ఆ కేసులో ప్రభుత్వం మారగానే.. రఘురామ ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉండటంతో కేసు నమోదు చేశారు.
వైసీపీ హయాంలో చాలా కాలం సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్.. టీడీపీ నేతల్ని.. వైసీపీని వ్యతిరేకించేవారిపై తప్పుడు కేసులు పెట్టి అర్థరాత్రి పూట అరెస్టు చేసి తీసుకొచ్చి కొట్టడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రఘురామను అలా చిత్రహింసలు పెట్టి వీడియో కాల్ లో ఇతరులకు చూపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయాలన్నీ దర్యాప్తులో వెల్లడి కానున్నాయి. నిందితులంతా పోలీసు అధికారులు కావడంతో విచారణకు సహకరించడం లేదు.
