సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ యూట్యూబర్లకు ఇంటర్యూలు ఇస్తూ చంద్రబాబు, లోకేష్‌పై పొగడ్తలు కురిపిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు డీజీపీని చేస్తారనో.. టిక్కెట్ ఇచ్చి ప్రజాప్రతినిధిని చేస్తారనో ఆశపడిన ఆయనకు ఇప్పుడు పోస్టింగ్ కూడా లేకుండా చాలా సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ పై ప్రశంసలు కురిపించేందుకు యూట్యూబ్ చానళ్లను వాడుకుంటున్నారు.
ఓ యూట్యూబ్ చానల్ ప్రతినిధి ఇంటర్యూ ఇచ్చి చంద్రబాబే తనను ప్రోత్సహించారని.. తన సర్వీసులో పదిహేనేళ్ల పాటు చంద్రబాబు వద్దే పని చేశానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్టును కూడా తాను వ్యతిరేకించానని ఆయన ఇప్పుడు చెబుతున్నారు. లోకేష్ ఫ్యూచర్ సీఎం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే జగన్ పై వ్యతిరేక కామెంట్లు చేయలేదు. కానీ జగన్ అన్నీ వింటారని కానీ ఆయన చుట్టూ ఉండే కనిపించని కోటరీ మనల్ని ఆయన దగ్గరకు పోనివ్వదని సరైన నిర్ణయాలు తీసుకోనివ్వరని చెప్పుకొచ్చారు. అంటే.. అటు జగన్ కూడా తన మీద గుడ్ లుక్స్ ఉండేలా చూసుకున్నారన్నమాట.
పీవీ సునీల్ కుమార్ గతంలో ఎలా పని చేసేవారో కానీ జగన్ హయాంలో చేసిన పనులకు పూర్తిగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. సర్వీసులో ఏదైనా పేరు సంపాదించుకుని ఉంటే అది లేకుండా పోయింది. చివరికి జగన్ ముద్ర ఆయనపై బలంగా పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ లను పొగిడినా ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు కాబట్టి బయటపడాలి కాబట్టి పొగుడుతున్నారని అనుకుంటారు.
నిజానికి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఏబీవీ హైకోర్టు తీర్పు గురించి మీడియాతో మాట్లాడారని జగన్ రెడ్డి హయాంలో మళ్లీ సస్పెన్షన్ వేటు వేశారు. కానీ సునీల్ కుమార్ మాత్రం పదే పదే రాజకీయ కామెంట్లు, యూట్యూబ్ ఇంటర్యూలు ఇస్తూ హడావుడి చేస్తున్నారు. రిటైరయ్యే వరకూ ఆయనకు పోస్టింగ్ రావడం కష్టంగానే కనిపిస్తోంది.


