ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ చీఫ్ సజ్జనార్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఇప్పుడు స్వయంగా చిక్కుల్లో పడ్డారు. సజ్జనార్‌పై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన, పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా స్వరం మార్చారు. ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్లతో సహా పూర్తి వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంతో ప్రవీణ్ కుమార్ ఆత్మరక్షణలో పడ్డారు.
తాను సజ్జనార్‌పై కేసులు ఉన్నాయని అనలేదని, కేవలం నైతికత గురించే మాట్లాడానని ప్రవీణ్ కుమార్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన సజ్జనార్, ఫోన్ ట్యాపింగ్ విచారణకు నేతృత్వం వహించడం సమంజసం కాదని మాత్రమే తన అభిప్రాయాన్ని చెప్పానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయితే, ప్రెస్ మీట్ పెట్టి మరీ క్రిమినల్ కేసులు ఉన్నాయని నొక్కి చెప్పిన ఆయన, ఇప్పుడు కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగానే మాట్లాడానని చెప్పడం గమనార్హం. మాజీ పోలీస్ అధికారిగా ఉండి, నిరాధారమైన ఆరోపణలతో తోటి అధికారిపై బురద చల్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతరులను ఇరకాటంలో పెట్టే క్రమంలో సజ్జనార్‌ను టార్గెట్ చేయబోయి ప్రవీణ్ కుమార్ నిండా ఇరుక్కుపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అని తెలిసినా, ఆధారాలు లేకుండా క్రిమినల్ ఆరోపణలు చేసి ఇప్పుడు నేను అలా అనలేదు అనడం చెల్లుబాటు కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ వివాదంలో సజ్జనార్ చేతికి ప్రవీణ్ కుమార్ దొరికిపోయినట్లయిందని, నోటీసులకు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఆయన మరిన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.