వైసీపీ హయాంలో తప్పుడు పనులకు పాల్పడిన ఏ అధికారీ ముందు రోజుల్లో ప్రశాంతంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. సీఐడీ అధికారులు కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ అరెస్టు.. ఆ తర్వాత ఆయనను కస్టడీలో ఉంచుకోవడం ఇతర పరిణామాల్లో మొత్తం కాల్ డేటాను సేకరించి భద్రం చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
నిజానికి ఈ కేసును ఇంకా సీబీఐకి ఇవ్వలేదు. టెలికం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని తక్షణం డేటాను జాగ్రత్త చేయాలని రఘురామ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే సీఐడీ తీసుకుంటే చాలని.. సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ హరినాధ్ వాదనలు వినిపించారు. పిటీషనర్ ఆరోపణలే సిఐడీ మీద అయితే… అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ కాల్ డేటాను సేకరించాలని ఆదేశించింది.
కేసును సీబీఐకు ఇవ్వాలా… లేదా అనేది కోర్టు ఇంకా నిర్ణయించలేదు..కానీ కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ ను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది. రెండేళ్ల కిందట రఘురామకృష్ణరాజును ఆయన పుట్టిన రోజున హైదరాబాద్ లోని ఇంట్లో అరెస్ట్ చేశారు. ఏ కేసులు పెట్టారో కూడా చెప్పలేదు. బలవంతంగా హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు. ఆ రాత్రి కస్టడీలో ఉంచుకున్నారు. తర్వాతి రోజు కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా తనను సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. కొట్టినట్లుగా మిలటరీ ఆస్పత్రి నివేదికల్లో వెల్లడయింది. దీంతో ఈ కేసు ముందు ముందు సీఐడీ అధికారులను జైలు పాలు చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.