భీమవరం డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఫిర్యాదుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ జయసూర్య మంచి అధికారి అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 13 ముక్కలాట నేరం కాదని అయినా ఇలాంటి వాటిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసిందన్నారు. భీమవరం చుట్టుపక్కల ఎలాంటి పేకాట స్థావరాలు లేవని రఘురామ చెబుతున్నారు.
రఘురామ సపోర్టుతో డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమిలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. స్వయంగా పవన్ కల్యాణ్ ఆ అధికారి తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డీజీపీకి, హోంమంత్రికి కూడా చెప్పారు. ఏపీలో జరుగుతున్న పేకాట, ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాలని డీజీపీని కూడా ఆదేశించినట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో రఘురామ కృష్ణరాజు..స్వయంగా పవన్ కల్యాణ్ వ్యతిరేకించిన, ఆరోపణలు చేసిన డీఎస్పీకి మద్దతుగా నిలవడం హాట్ టాపిక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అసలు జయసూర్యపై వచ్చిన నిర్దిష్టమైన ఆరోపణలేంటో స్పష్టతలేదు. పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఆ డీఎస్పీని బదిలీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఆయన చేసిన తప్పులేమిటన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఆయనపై నివేదిక తమ వద్ద ఉందని.. హోంమంత్రి అనిత చెబుతున్నారు. కానీ అసలు ఆరోపణలేంటో బయటకు రాలేదు. మొత్తంగా డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమిలో కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
