మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో అనుసరించిన వ్యూహం ఇప్పుడు బీజేపీలో అగ్గి రాజేసింది. పార్టీ లైన్‌కు విరుద్ధంగా, కనీసం ముందస్తు సమాచారం లేకుండా ఆయన బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీ అధిష్ఠానం ఒక స్పష్టమైన విధానంతో ఉన్నప్పుడు, ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా కారు పార్టీకి ఓటు వేయడం బీజేపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన ఒకే వాహనంలో వెళ్లి మరీ మద్దతు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీ పరంగా స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, రఘునందన్ రావు వాటిని పక్కన పెట్టి బీఆర్ఎస్ పక్షాన నిలబడటంపై రాష్ట్ర నాయకత్వం గుర్రుగా ఉంది. పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యం కాదు అని నమ్మే బీజేపీలో, ఒక బాధ్యతాయుతమైన ఎంపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్రమశిక్షణారాహిత్యమేనని ఆయన వ్యతిరేకులు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. స్థానిక రాజకీయ అవసరాల కోసమే రఘునందన్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో చేతులు కలిపారని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం దీని వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉందని అనుమానిస్తున్నారు.
లోకల్ అడ్జస్ట్మెంట్ పేరుతో ప్రత్యర్థి పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో బీజేపీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన ఎంపీయే ఇలా చేయడం చర్చనీయాంశమైంది. రఘునందన్ రావు తీరుపై బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సీరియస్‌గా ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. వ్యక్తిగత నిర్ణయాలతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించేది లేదని సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే దీనిపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
