అస్సాంలో కాంగ్రెస్ పార్టీ మూడో సారి ఓడిపోవడానికి రెడీగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఆ రాష్ట్రం కాంగ్రెస్ కంచుకోట. అలాంటి చోట కాంగ్రెస్కు ఈ దుస్థితి రావడానికి కారణం ఓ కుక్క బిస్కెట్. రాహుల్ గాంధీ చేసిన అహంకారపు కుక్క బిస్కెట్తోనే అస్సాంకు ఈ గతి పట్టింది.
అస్సాం నేతల్ని కుక్క బిస్కెట్లతో అవమానించిన రాహుల్
అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన సంఘటనగా కుక్క బిస్కెట్’ ఉదంతం చరిత్రలో నిలిచిపోతుంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడు, వ్యూహకర్తగా ఉన్న హిమంత బిశ్వ శర్మ, పార్టీ సమస్యల గురించి చర్చించడానికి రాహుల్ గాంధీని కలిసినప్పుడు ఎదురైన పరాభవం ఆ పార్టీ కొంపముంచింది. తన పెంపుడు కుక్కకు వేస్తున్న బిస్కెట్లను నేతలకు ఇస్తున్నట్లుగా రాహుల్ వ్యవహరించిన తీరు, హిమంత వంటి బలమైన నాయకుడిని కాంగ్రెస్ నుంచి దూరం చేసింది. అది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదు, యావత్ అస్సాం అస్తిత్వానికి తగిలిన దెబ్బగా హిమంత దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు.
ఆత్మగౌరవం కోసం బీజేపీలో చేరిన హిమంత
హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడం అస్సాం రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసింది. కాంగ్రెస్ వ్యూహాలన్నీ తెలిసిన నాయకుడు ప్రత్యర్థి పక్షాన చేరడంతో, ఆ రాష్ట్రం కాంగ్రెస్ చేజారిపోయింది. తాజాగా వెలువడుతున్న సర్వేలు సైతం అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించబోతోందని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును, క్యాడర్ను హిమంత తన అభివృద్ధి మంత్రంతో బీజేపీ వైపు తిప్పుకోగలిగారు. రాహుల్ గాంధీ ప్రదర్శించిన ఆ ఒక్క క్షణపు అహంకారం, దశాబ్దాల కాంగ్రెస్ పునాదులను కదిలించివేసింది.
ఇప్పటికీ నాయకుల వలసలు
కేవలం హిమంత మాత్రమే కాదు, ఇటీవల అస్సాం పీసీసీ మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా వంటి సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ను వీడటం ఆ పార్టీకి తీరని లోటు. రాహుల్ ఆయన పార్టీ వీడతారని తెలిసి నాలుగు గంటల పాటు బుజ్జగించినా ఆయన తర్వాత రోజే బీజేపీలో చేరిపోయారు.
కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ క్షేత్రస్థాయి నాయకులను గుర్తించడంలో, వారికి కనీస గౌరవం ఇవ్వడంలో విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ చుట్టూ ఉండే కోటరీ సంస్కృతి వల్ల రాష్ట్రాల్లో పార్టీని కాపాడే అసలైన నాయకులు బయటకు వచ్చేస్తున్నారనేది కాదనలేని వాస్తవం.
గుణపాఠం నేర్వని కాంగ్రెస్
2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాంలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. మిత్రపక్షాలైన రాయ్ జోర్ దళ్ వంటి పార్టీలు కూడా సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ అహంకార పూరిత వైఖరిని ఎండగడుతున్నాయి. ఒక చిన్న బిస్కెట్ ముక్కతో మొదలైన ఈ అవమాన పర్వం నేడు అస్సాం నుంచి కాంగ్రెస్ను శాశ్వతంగా దూరం చేసే స్థాయికి చేరింది. అయినా రాహుల్ తెలుసుకోలేకపోతున్నారు.
