ఓట్ల చోరీ అంశం ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపించడం లేదని ఫీడ్ బ్యాక్ ఉన్నా రాహుల్ గాంధీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గతంలో రెండు విడుతలుగా ప్రెస్మీట్లు పెట్టి కర్ణాటకలో ఓట్ల చోరీ అని ఆరోపణలు చేసిన ఆయన ఇప్పుడు హర్యానాలో అలాంటివే జరిగాయని.. ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటిఫేక్ అని ప్రకటించారు. హెచ్ ఫైల్స్ పేరుతో ఆయన ఓటర్ల జాబితాలను విడుదల చేశారు.
ఇందులో ఆయన బయట పెట్టిన గ్లామరస్ విషయం ఏమిటంటే.. ఓ బ్రెజిల్ మోడల్ హర్యానాలో పది బూతుల్లో ఇరవై రెండు సార్లు ఓట్లు వేసిందట. ఇండియాలో దొంగ ఓటర్లు దొరకక బీజేపీ బ్రెజిల్ నుంచి మోడల్స్ తెచ్చుకుందన్నట్లుగా రాహుల్ చేసిన ఆరోపణలు కాస్త తేడాగా ఉన్నాయి. బ్రెజిల్ మోడల్ గురించి చెప్పడంతో ఫోకస్ అంతా ఆ మోడల్ పై పడింది. ఈ మోడల్ కథాకమామీషు ఏమిటో మీడియా ఒకటి , రెండు రోజుల్లో బయట పెడుతుంది.
హర్యానా ఓటర్ జాబితాలో 5.21 లక్ష డూప్లికేట్ ఓటర్లు, 93,174 ఇన్వాలిడ్ ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్లు ఉన్నారని రాహుల్ అంటున్నారు. హర్యానాలో తాము గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా బీజేపీ గెలిచిందంటే దానికి కారణం ఓట్ల చోరీ అన్నారు. అయితే ఈ బల్క్ ఓటర్లు ఎవరు.. అన్నది చెప్పలేదు. కొన్ని ఉదాహరణలు చెప్పి.. ఇలా లక్షల ఓట్లు ఉన్నాయని వాదించడం విచిత్రంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. ప్రతి ఎనిమిది ఓటర్లకు ఒకరు ఫేక్ ఓటర్ ఉంటే.. ఎలక్టోరల్ రోల్స్ బయటకు వచ్చినప్పుడు గుర్తించలేనంత దుస్థితిలో కాంగ్రెస్ ఉందా అన్నది అందరికీ వచ్చే డౌట్.
రాహుల్ గాంధీ తమ ఓటములకు ఓట్ల చోరీని కారణంగా చూపించాలని అనుకుంటున్నారు కానీ.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందని మాత్రం అంగీకరించడం లేదు.
