కర్ణాటకలో మళ్ళీ ముఖ్యమంత్రి మార్పు అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. తాజాగా మైసూర్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య ,డీకే శివకుమార్ విడివిడిగా జరిపిన భేటీలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నందున ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పీఠాన్ని తమకు అప్పగించాలని డీకే శివకుమార్ వర్గం గట్టిగా కోరుతోంది. ఇటీవల రాహుల్ గాంధీతో మైసూర్ విమానాశ్రయం రన్‌వేపై డీకే శివకుమార్ ఏకాంతంగా చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ భేటీ తర్వాత డీకే ప్రయత్నాలు విఫలమైనా, ప్రార్థనలు విఫలం కావు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఆయన ఆశలు, ప్రయత్నాలను స్పష్టం చేస్తోంది.
మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సందిగ్ధతకు ముగింపు పలకాలని పట్టుబడుతున్నారు. తన నాయకత్వంపై మీడియాలో , పార్టీలోని కొందరు నేతల మధ్య జరుగుతున్న చర్చల వల్ల పాలనపై ప్రభావం పడుతోందని ఆయన రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాహుల్ గాంధీ ఒక స్పష్టత ఇస్తే, ఎటువంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా పని చేసుకుంటాను అని ఆయన కోరుతున్నారు. తాను ఐదేళ్ల పాటు పూర్తి కాలం కొనసాగుతానని గతంలో బల్లగుద్ది చెప్పిన సిద్ధరామయ్య, ఇప్పుడు మాత్రం అధిష్టానం ఏది చెబితే అది చేస్తా అంటూ కాస్త రక్షణాత్మక ధోరణిలో కనిపిస్తున్నారు.
రాహుల్ గాంధీ ప్రస్తుతం నేతలిద్దరినీ కలిసికట్టుగా పనిచేయాలని, మంచి పనితీరు కనబరచాలని మాత్రమే సూచించారు తప్ప, పదవీ మార్పుపై ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. అయితే, సంక్రాంతి పండుగ తర్వాత వీరిద్దరినీ ఢిల్లీకి రావాలని అధిష్టానం పిలిచినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, అక్కడ జరగబోయే భేటీలో రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా ఈ చర్చల్లో ప్రధానాంశంగా ఉండనుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న ఈ పోరాటం ప్రస్తుతం రాహుల్ గాంధీ కోర్టులో ఉంది. ఆయన ఇచ్చే స్పష్టతపైనే సిద్ధరామయ్య కొనసాగింపు లేదా డీకే శివకుమార్ పట్టాభిషేకం ఆధారపడి ఉన్నాయి.
