దేశ ప్రజల మనసులను గెలవాలంటే ఒక పటిష్టమైన ప్రత్యామ్నాయ ఎజెండా ఉండాలి కానీ, నిరంతరం ప్రతికూలతను నింపే విధానం ఉండకూడదు. రాహుల్ గాంధీకి మాత్రం ఉన్నదంతా రివర్స్ ఆలోచనలే. దానికి తాజా సాక్ష్యం ఆయన భారత్ ను డెడ్ ఎకానమీ అని నిందించడం. ఆయన తీరుతో బీజేపీ పండగ చేసుకుంటోంది. ఆయన దేశానికి నాయకత్వం వహించే మెటీరియల్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రాహుల్ కూడా పదే పదే అదే నిజమని నిరూపిస్తున్నారు.
బీజేపీపై పోరాడతారా..దేశంపైనా ?
రాహుల్ గాంధీ ప్రాథమికంగా తన రాజకీయ పోరాటాన్ని అధికార పార్టీ విధానాలపై కంటే, దేశంలోని రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై ఎక్కువుగా కేంద్రీకరిస్తున్నారనే విమర్శ ఉంది. ఓటు చోరీ పేరుతో ఎన్నికల సంఘంపై ఆయన చేస్తున్న ఆరోపణలు సామాన్య ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటమిని హుందాగా స్వీకరించకుండా, ఏకంగా ఓటింగ్ ప్రక్రియనే తప్పు పట్టడం ద్వారా ఆయన ప్రజల తీర్పును అవమానిస్తున్నారనే సంకేతం వెళ్తోంది. ఆయన ఎంతగా వ్యవస్థలపై బురద జల్లుతారో, బీజేపీ అంతగా ఆ వ్యవస్థలను కాపాడుతున్నట్లుగా ప్రజల్లో తన గ్రాఫ్‌ను పెంచుకోగలుగుతోంది.
ట్రంప్ డెడ్ఎకానమీ మాటలకు వంత పాడతారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన టారిఫ్ విధానాలు , అమెరికా పన్నుల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీగా మారిందని రాహుల్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ట్రంప్ తన దేశ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలను సమర్థించేలా రాహుల్ మాట్లాడటం, భారత్ ఆ దేశానికి తలొగ్గాలని పరోక్షంగా సూచించడం జాతీయవాదానికి విరుద్ధంగా ఉంది. ట్రంప్ ధోరణి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో, భారత ప్రయోజనాల కోసం గొంతు ఎత్తాల్సింది పోయి, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ప్రచారం చేయడం రాహుల్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమం. పైగా టారిఫ్‌ల తర్వాత ఎగుమతులు పెరిగాయి. కొన్నిరంగాలు ఇబ్బంది పడుతున్నమాట నిజమే కానీ.. డెడ్ ఎకానమీ అని నిందించేంత కాదు. దేశం ఆర్థికంగా దూసుకెళ్తున్న సమయంలో, అపనమ్మకాన్ని కలిగించే ఇలాంటి పాలసీలతో రాహుల్ గాంధీ ప్రజల మనసులను గెలుచుకోవడం దాదాపు అసాధ్యం.
విదేశీ వేదికలపై దేశానికి వ్యతిరేకంగా కామెంట్స్
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు భారత అంతర్గత విషయాలను, ప్రజాస్వామ్య స్థితిగతులను ప్రతికూల కోణంలో ప్రదర్శించడం తరచుగా వివాదాస్పదమవుతోంది. దేశం గురించి తప్పుగా ప్రచారం చేస్తూ, ఏదో విపత్తు జరగబోతోందన్నట్లుగా భయాందోళనలు సృష్టించడం వల్ల ఆయనపై దేశ వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి బీజేపీకి సులభమవుతోంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉందని అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నా, రాహుల్ మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఆయనపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. రాహుల్ గాంధీ తన పోరాట పంథాను మార్చుకోకపోతే, కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. దేశం గురించి విదేశాల్లో మాట్లాడేటప్పుడు , ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేసేటప్పుడు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. జాతీయ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వంతో విభేదించినా, దేశం ప్రతిష్టను తగ్గించేలా మాట్లాడటం వల్ల కలిగే నష్టం అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే ఎదురవుతుంది. దీన్ని ఆయన గుర్తించలేకపోతున్నారు.
