ప్రత్యేక హోదా కోసం కెవిపి రామచంద్ర రావు పెట్టిన ప్రైవేట్ బిల్లు ద్రవ్యాబిల్లా కాదా అని తేల్చడానికి లోక్ సభకి పంపించేసి దానిపై రాజ్యసభలో నిన్న ఓటింగ్ జరుపకుండా కేంద్రప్రభుత్వం మళ్ళీ తప్పించుకొంది. దానిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తెదేపా, భాజపాలని విమర్శిస్తూ ట్విట్టర్ లో నిన్న ఒక మెసేజ్ పెట్టారు.
”తెదేపా, భాజపాలు ఏపికి చేస్తున్ననమ్మకద్రోహాన్ని 5 కోట్ల మంది ఆంద్రులు గమనిస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014లో పార్లమెంటులో తీసుకొన్న నిర్ణయాన్ని అమలుచేయాలని ప్రధాని మోడీకి గుర్తు చేస్తున్నాను,” అని మెసేజ్ పెట్టారు.
పార్లమెంటు తలుపులు మూసేసి, టీవి ప్రసారాలు నిలిపేసి 2014లో యూపియే ప్రభుత్వం రాష్ట్ర విభజన చేస్తున్నప్పుడు కూడా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఇలాగే చూశారు. అప్పుడు వారేమీ చేయాలో అది చేశారు. కనుక ఒకవేళ తెదేపా, భాజపాలు తమని మోసం చేస్తున్నట్లు భావిస్తే వాటిని ఏమి చేయాలో అదే చేస్తారు. ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తన ఎంపిల చేతే చెప్పిస్తున్నారు. కనుక రాహుల్ గాంధీ వాటి భవిష్యత్ గురించి ఆలోచించనవసరం లేదు. ముందు రాష్ట్రంలో తన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ గురించి ఆలోచిస్తే మంచిది.
రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఘోర తప్పిదం చేసిందని, దానికి బారీ మూల్యం చెల్లించిందని జైరాం రమేష్ అంగీకరించారు. రాష్ట్రం మళ్ళీ ఎప్పటికైనా కోలుకొంటే, అప్పుడైనా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంటే ఆనాడు కాంగ్రెస్ చేసిన తప్పిదం వలనే నేడు రాష్ట్రం ఈ దుస్థితిలో ఉందని ఆయనే ఒప్పుకొన్నారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరూ నేటికీ ఆ విషయం ఒప్పుకోవడం లేదు. తమ పార్టీ చేసిన తప్పు వలన కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి, ప్రజలకి జరిగిన నష్టాన్ని కళ్ళారా చూస్తున్నా ఎవరూ ఏనాడూ అందుకు పశ్చాతాపం కనబరచలేదు. పైగా ప్రత్యేక హోదా రానందున ఏపికి అన్యాయం జరిగిపోతోందంటూ కోటి సంతకాలు, మట్టి సత్యాగ్రహం, ఇప్పుడు కెవిపితో ప్రైవేట్ బిల్లు పెట్టించడం వంటి డ్రామాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలని ప్రసన్నం చేసుకోవాలని చూస్తోంది. అది రాష్ట్రం మీదనో ప్రజల మీదనో ఉన్న ప్రేమతో కాదు..కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన మనుగడ కోసం చేస్తున్న పోరాటమేనని 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు. అందుకే నేటికీ దానిని ప్రజలు ఆదరించడం లేదు. దాని పోరాటాలని నమ్మడం లేదు.
కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు క్షమించాలంటే దానికి రెండే మార్గాలు ఉన్నాయి. 1. ఏదైనా అద్భుతం జరగడం. 2. “ప్రజాభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేయడం తప్పే..మా తప్పుడు నిర్ణయాల వలెనే రాష్ట్రానికి ఈ దుస్థితి కలిగింది. అందుకు మేము చాలా బాధ పడుతున్నాము. మా పార్టీ చేసిన తప్పులని క్షమించి, వాటిని సరిదిద్దుకొనే అవకాశం మాకు ఇవ్వండి,” అని రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు రఘువీర రెడ్డి స్వయంగా రాష్ట్ర ప్రజలకి క్షమాపణలు చెప్పుకోవడం. అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోలుకొనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇటువంటి డ్రామాలు ఎన్ని ఆడిన ప్రయోజనం ఉండదు. కానీ ఆ రెండూ జరిగే పనులు కావు కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఎన్నటికీ మారకపోవచ్చు. ఈ సంగతి రాహుల్ గాంధీకి తెలుసో లేదో?