సంక్రాంతి సీజన్‌కు ఈవారంతోనే కొబ్బరికాయ కొట్టబోతోంది టాలీవుడ్. జనవరి 9న ‘రాజాసాబ్’ ఆగమనాన్ని చూడబోతున్నారు. 8 నుంచే ప్రీమియర్ల హడావుడి మొదలైపోతుంది. 8న రాత్రి 9 గంటలకు షోలతో ‘రాసాజాబ్’ హంగామా షురూ అవ్వబోతోంది. ప్రభాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ఇది. మారుతి దర్శకుడు. దాదాపు రూ.500 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకొంది. ఇప్పటికే రెండు ట్రైలర్లు వచ్చాయి. రెండో ట్రైలర్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది. ఈ సినిమా స్కేల్ ఏమిటన్నది ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఉన్న కాస్త నెగిటివిటీ కూడా ఈ ట్రైలర్ ఎగరేసుకొని పోయింది. పాన్ ఇండియా సినిమా ఇది. కాకపోతే ఆ స్థాయిలో ప్రమోషన్లు జరగడం లేదన్నది అభిమానుల ఆవేదన. కంటెంట్ బాగుంటే… ప్రమోషన్లు లేకుండానే భారీ వసూళ్లు రాబట్టుకోవొచ్చని దర్శక నిర్మాతలు ధైర్యంగా ఉన్నారు.
ఈ సినిమా నుంచి మూడు పాటలు బయటకు వచ్చాయి. అయితే.. అవి అనుకొన్నంత ప్రభావాన్ని చూపించలేదు. నాలుగో పాట ‘నాచ్.. నాచ్’ ఈ రోజు ముంబైలో విడుదల చేస్తున్నారు. ఈపాట ఆల్బమ్ మొత్తానికి చాట్ బస్టర్ అవుతుందని చిత్రబృందం నమ్ముతోంది. సంక్రాంతి సీజన్లో మొదటిగా విడుదల అవుతున్న సినిమా ఇది. కాబట్టి.. అడ్వాంటేజ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా, పండగ రోజుల్లో, ఆ తరవాత కూడా గట్టిగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఇదే రోజున తమిళం నుంచి ‘జన నాయకుడు’ వస్తున్నాడు. విజయ్ నటించిన సినిమా ఇది. తెలుగులో ఘన విజయం సాధించిన `భగవంత్ కేసరి`కి ఇది రీమేక్. విజయ్‌కు తెలుగులో కాస్తో.. కూస్తో.. మార్కెట్ ఉంది. పైగా సంక్రాంతి సీజన్లో వస్తోంది. ఆ అడ్వాంటేజ్ ఈ సినిమాకు ఉన్నప్పటికీ, ప్రభాస్ లాంటి స్టార్ తో ఈ డబ్బింగ్ బొమ్మ ఎంత పోటీ పడగలదు? అనేది ప్రశ్నార్థకం. కాకపోతే ఒకే రోజు రెండు సినిమాలు రావడంతో సందడి రెట్టింపు అవ్వబోతోంది.
మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ జనవరి 12న వస్తోంది. అంటే.. సోమవారం. అయితే ఆదివారం నుంచే (11న) ప్రీమియర్లు ఉండబోతున్నాయి. అంటే టెక్నికల్ గా ఈ సినిమా కూడా ఈవారమే విడుదల అవుతున్నట్టు. ఈ వారం అంతా సంక్రాంతి సినిమాల ప్రమోషన్లు, కబుర్లతో టాలీవుడ్ అంతా కళకళలాడడం ఖాయం. ‘రాజాసాబ్’తో హిట్టు పడితే, ఈ సీజన్‌కు కిక్ స్టార్ట్ వచ్చినట్టే.
