ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్‌తో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. నిజానికి, ఇది ఆయన లేటెస్ట్ లీగ్ రేంజ్ ప్రాజెక్ట్ కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రయాణం లార్జర్ దెన్ లైఫ్ పాన్ ఇండియా సినిమాల దిశగా సాగుతోంది. ఆ దృష్టిలో చూస్తే ‘రాజాసాబ్’ ఆ స్థాయిలో హైప్ ను కలిగించేది కాదు. కానీ ఈ సినిమా టాలీవుడ్ కి మాత్రం చాలా కీలకం.
ఇండస్ట్రీని పాన్ ఇండియా దిశగా మలిచిన హీరో ప్రభాస్. ఇండస్ట్రీ బాహుబలికి ముందు, తర్వాత అన్నట్టుగామారిపోయింది. అయితే ఆ మార్పు కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా వచ్చాయి. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు.. అందరూ పాన్ ఇండియా కాంబినేషన్లకు మాత్రమే పరిమితం కావడం మొదలైంది. దీంతో పెద్ద హీరో సినిమాల ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఆరు నెలల్లో షూటింగ్ పూర్తవ్వాల్సిన సినిమాలు ఇప్పుడు సంవత్సరాలు పడుతున్నాయి. థియేటర్లలో స్టార్ సినిమాలు లేక పోవడం వల్ల బిజినెస్‌కి గట్టి దెబ్బ తగిలింది.
ఈ పరిస్థితుల్లో ప్రభాస్ లాంటి హీరో ఒక స్కేల్డౌన్ చేసిన రాజాసాబ్ ప్రాజెక్ట్ చేయడం ఓ మంచి పరిణామం. అంచనాలు తక్కువగా ఉండటంతో ‘రాజాసాబ్’ టీజర్ ప్రేక్షకులకి వెంటనే కనెక్ట్ అయింది. మారుతికి ఇది ఓ ఛాలెంజ్ అయినా, ప్రభాస్ చరిష్మా పైన ఆయనకి నమ్మకం ఉంది.
ఇప్పుడు ఇండస్ట్రీలో మార్పు రావాలి. విజన్ గొప్పగా ఉండాలి కానీ, ఎప్పుడో వచ్చే భారీ పాన్ ఇండియా సినిమాల కోసం సంవత్సరాల పాటు ఎదురుచూడడం కన్నా మంచి కథ దొరికిన వెంటనే సెట్స్ పైకి వెళ్లే తత్వం అలవరుచుకోవాలి. ఆ దిశగా ‘రాజాసాబ్’ ఒక మంచి ప్రారంభం కావాలి. ఈ సినిమా సక్సెస్ అయితే.. టాలీవుడ్ మళ్ళీ ఊపందుకుంటుంది. థియేటర్లకి కొత్త ఊపు వస్తుంది. ఓ బిగ్ స్టార్ హారర్ కామెడీ కథతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోగలడనే నమ్మకాన్ని కలిగిస్తే రాజాసాబ్ లక్ష్యం నెరవేరినట్లే.