తక్కువ సమయంలో వంద సినిమాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో మొదలైంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రయాణం. సినిమాని ఒక బిజినెస్ మోడల్ లో ఊహించి – ఈ రంగంలోని అడుగు పెట్టింది. అయితే.. ఆ ప్రయాణం ఒడిదుడుకుల మధ్యే సాగింది. సినిమాలు తీయడం ఈజీనే కానీ, హిట్ వైపు నడిపించడం అంత తేలిక కాదన్న విషయాన్ని గ్రహించింది. పది సినిమాలు తీస్తే, అందులో లాభాల్ని తెచ్చిపెట్టినవి రెండే. వరుసగా తగిలిన దెబ్బలు సంస్థ ఆర్థిక మూలాలమీద ప్రభావం చూపించాయి. దాంతో వేగం కంటే నాణ్యతే ప్రదానమని భావించిన నిర్మాత విశ్వ ప్రసాద్.. మేకింగ్ విషయంలో మరిన్నిజాగ్రత్తలు తీసుకొన్నారు. దాంతో బండి కాస్త కుదుట పడింది. గతేడాది ‘మిరాయ్’తో మంచి విజయాన్ని నమోదు చేసుకొంది. ‘మిరాయ్’ ఫలితంతో తేరుకొన్న పీపుల్ మీడియా… ఇప్పుడు ‘రాజాసాబ్’పై ఆశలు పెంచుకొంది.
‘మా నష్టాలన్నీపూడ్చగల శక్తి.. రాజాసాబ్కి ఉంది’ అని గతంలోనే ప్రకటించారు విశ్వ ప్రసాద్. ఈ సంస్థ ఆర్థికంగా నిలబడాలంటే రాజాసాబ్ తో హిట్టు కొట్టడం అత్యవసరం. ఈ సినిమాపై దాదాపు రూ.400 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ సినిమాతో ముడిపడి చాలా ఆర్థిక లావాదేవీలు సాగాయి. అన్నీ అనుకొన్నట్టు జరిగితేనే పీపుల్ మీడియాకు ఉపశమనం లభిస్తుంది. నాన్ థియేట్రికల్ రూపంలో రూ.200 కోట్లు ఇప్పటికే వచ్చేశాయి. కానీ ఇది సరిపోదు. పెట్టుబడి మొత్తం తిరిగిరావాలంటే, పాత బాకీలు తీరిపోయి సంస్థ ఆర్థికంగా నిలబడాలంటే బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా గొప్పగా పెర్ఫార్మ్ చేయాలి. సంక్రాంతి సీజన్ లో ఈ సినిమాని విడుదల చేయడం, అది కూడా పండక్కి ముందే బరిలో దింపడం, ప్రభాస్ కి పాన్ ఇండియా మార్కెట్ ఉండడం ‘రాజాసాబ్’ ప్లస్ పాయింట్స్. దాంతో పాటుగా మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నార్త్ లో ఈ సినిమా ప్రమోషన్లు సరిగా లేవు. దాంతో పాటు సంక్రాంతి సీజన్లో మిగిలిన సినిమాల పోటీని తట్టుకోవాలి. ఇవన్నీ జరిగి, విశ్వ ప్రసాద్ క్యాలిక్లేషన్స్ అన్నీ వర్కవుట్ అయితే తప్ప.. పీపుల్ మీడియా గట్టెక్కదు.
