ప‌వ‌న్‌ని కెలికితే ఎలా… కొంప‌లంటుకోవూ..!

ఏమాట‌కామాట చెప్పుకోవాలి. కాస్త ప‌బ్లిసిటీ రావాలంటే చాలు.. ‘ప‌వ‌న్ క‌ల్యాణ్‌’ పేరు వాడుకోవాల్సిందే. టాలీవుడ్‌లో ఇదే సంప్ర‌దాయం ఇప్పుడు. ప‌వ‌న్‌ని పొగిడిన వాళ్ల‌కు సోష‌ల్ మీడియా ఇచ్చేది చిన్న స్పేసే. అదే తిట్టామ‌నుకోండి.. కెలికామ‌నుకోండి – బోల్డంత ప‌బ్లిసిటీ. అదీ ఫ్రీగా. కాక‌పోతే… ప‌వ‌న్ పై చేసే నెగిటీవ్ కామెంట్లు ప‌వ‌న్ అభిమానుల్ని బాధిస్తే మాత్రం – అది మ‌రో ప్ర‌హ‌స‌నం అయిపోతుంది. ఈ విష‌యం తెలిసో.. తెలీకో ఓసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో, అటు మెగా ఫ్యామిలీ విష‌యంలో కాస్త వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు డా.రాజ‌శేఖ‌ర్‌. ఆయ‌న ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా చిరుపై సెటైర్లు వేసి గాని వెళ్ల‌రు. గ‌త కొంత‌కాలంగా, కొన్నేళ్లుగా ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉన్నారు. కాబ‌ట్టి మీడియా కూడా రాజ‌శేఖర్‌ని కెల‌క‌లేదు. ఇప్పుడు ఆ స‌మ‌యం, సంద‌ర్భం వ‌చ్చింది. రాజ‌శేఖ‌ర్ న‌టించిన `గ‌రుడ వేగ‌` విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈసారి ప్ర‌మోష‌న్లు కాస్త భారీగానే చేసేట్టు క‌నిపిస్తున్నారు. అందుకే విడుద‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌గానే రాజ‌శేఖ‌ర్ మీడియాలో ఎక్కువ‌గా క‌నిపించ‌డం మొద‌లెట్టారు.

రాజ‌శేఖర్ టీవీల ముందుకొస్తే… చిరు ఫ్యామిలీ గురించి మాట్లాడ‌కుండా ఎందుకు ఉంటారు. దానికి త‌గ్గ‌ట్టు మీడియా కూడా ప‌వ‌న్ – చిరుల‌పై ప్ర‌శ్న‌లు సంధిస్తోంది. అందులో భాగంగానే రాజ‌శేఖ‌ర్ మ‌ళ్లీ ప‌వ‌న్ తో త‌న గొడ‌వ‌, గోడు వెల్ల‌బుచ్చారు. ‘గ‌బ్బ‌ర్ సింగ్‌’ సినిమాలో త‌న‌ని వేళాకోళం చేస్తూ ఓ సీన్ చేశార‌ని ‘ఏం చేస్తిరి ఏం చేస్తిరి’ డైలాగ్ త‌న‌ని హ‌ర్ట్ చేసింద‌ని, త‌న‌ని కావాల‌నే అవ‌మాన ప‌రిచార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వాపోయాడు రాజ‌శేఖ‌ర్‌. ప‌వ‌న్‌తో త‌న‌కున్న గొడ‌వ మ‌ళ్లీ.. పూస గుచ్చిన‌ట్టు చెప్పుకొస్తున్నాడు. అయిపోయిన సంగ‌తి మీడియా కెలికితే.. దాన్ని దాటేయ‌డం మానేసి.. ప‌వ‌న్ విష‌యాన్నేహైలెట్ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఇది కూడా ప‌బ్లిసిటీలో ఓ భాగ‌మా?? పవ‌న్ ని కెలికితే ప‌బ్లిసిటీ వ‌స్తుంది. కానీ… దానికి తోడు కొన్ని త‌ల‌నొప్పులు కూడా తెచ్చుకోవాలి. అస‌లే రూ.25కోట్ల‌తో తీసిన సినిమా ఇదంటున్నారు. అంత రిస్క్ అవ‌స‌ర‌మా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com