తెలంగాణ బీజేపీలో ఆల్‌ ఈజ్ నాట్ వెల్..! షాకిచ్చిన రాజాసింగ్..!!

తెలంగాణలో బీజేపీకి ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు.. చేతి వేళ్లలా.. ఎప్పుడూ విడివిడిగానే ఉంటారు. కలిస్తే.. ఎక్కడ.. ఎవరి ప్రాధాన్యాన్ని ఎవరు తగ్గిస్తారోనని.. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూంటారు. ఈ ఐదుగురిలోకి ప్రత్యేకంగా ఉండే ఎమ్మెల్యే రాజాసింగ్. కరుడుగట్టిన హిందూత్వ వాది అయిన రాజాసింగ్ లోథ్…ఎప్పుటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. అచ్చమైన బీజేపీ నేతగా పేరు తెచ్చుకుంటూ ఉంటాడు. సొంతగా హిందుత్వ సంస్థను కూడా నడుపుడుతున్నారు. పాతబస్తీలో హిందూత్వానికి నిఖార్సైన చిరునామాలా ఎదిగిపోతున్నారు. ఇది ఇతర పార్టీ నేతలకు నచ్చలేదు. అందుకే ఆయనకు బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

కొద్ది రోజుల కిందట.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారు. అప్పుడు రాజాసింగ్ ప్రత్యేకంగా అమిత్ షాను కలుసుకుని పార్టీ పరిస్థితిని వివరించారు. అప్పుడు అమిత్ షా.. ప్రత్యేకంగా తన ఈమెయిల్ ఐడీ ఇచ్చి.. ఎప్పటికప్పుడు వివరాలు పంపించాలని కోరారట. అందర్నీ కలుపుకు వెళ్లాలని లక్ష్మణ్‌కు కూడా సూచించారు. అయితే పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. బస్తీబాట పేరుతో.. ఓ కార్యక్రమం పెట్టుకున్న బీజేపీ… జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుతో వరుసగా కొన్ని రోజులు… బస్తీల్లో కలియదిరిగారు. రాజాసింగ్ నియోజకవర్గాన్ని పట్టిచుకోలేదు. గోషామహల్ ఎమ్మెల్యేకు.. నాంపల్లిలో జరిగిన బస్తీ బాట కార్యక్రమానికి కూడా ఆహ్వానం పంపలేదు. దీంతో… రాజాసింగ్.. ఇక తన దారి తాను చూసుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. లేఖను..తమ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు పంపారు.

రాజాసింగ్ రాజీనామా బెదిరింపు ఇదే మొదటిది కాదు. నేరుగా కేసీఆర్ కే ఇస్తానని ఓ సారి హడావుడి చేశారు. రాజాసింగ్ … బీజేపీ స్థానిక నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తనకు పోటీగా.. ఓ నేతను కూడా బీజేపీలోకి తీసుకొచ్చారు. అలా తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే కాదు.. మజ్లిస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టీఆర్ఎస్‌తో సఖ్యతగా వ్యవహరించడమే దీనికి కారణం. గతంలో ఈయన శివసేన పార్టీలో చేరి.. తెలంగాణలో విస్తరిస్తారన్న ప్రచారం జరిగిది. ఇప్పుడు గోమాతలను కాపాడేందుకు ఉద్యమం చేస్తానంటున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలు రాజాసింగ్ ను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com