బీజేపీ హైకమాండ్ నుంచి ఒక్క పిలుపు వస్తే చాలు వెళ్లి వాలిపోతానని రాజాసింగ్ అంటున్నారు. తనను బీజేపీ ఎమ్మెల్యేగానే చూడాలని ప్రజలను కోరుతున్నారు. తన వైపు తప్పులు జరిగాయని.. హైకమాండ్ పిలిస్తే వెళ్లి సారీ చెప్పి అయినా పార్టీలో చేరిపోతానని అంటున్నారు. ఇంతకు ముందు ఆయన మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు మధ్య చాలా తేడా ఉంది. తాను చాలా బలవంతుడినని..తాను లేకపోతే బీజేపీకి చాలా నష్టమని ఆయన అనుకున్నారు. చేయాల్సినంత రచ్చ చేశారు. కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏమిటో ఆయనకు అర్థమయింది.
రాజాసింగ్ కు వ్యక్తిగతంగా ఫాలోయింగ్ ఉన్నప్పటికీ బీజేపీ అనే అండ లేకపోతే ఆ ఫాలోయింగ్ కూడా ఉండదు. ఎన్ని వివాదాలు తెచ్చి పెట్టినా ఆయనపై కాస్త సానుకూలంగానే బీజేపీ ఉంది. కానీ ఆయన ఇటీవలి కాలంలో మరీ శృతిమించిపోయారు. పార్టీ క్రమశిక్షణను పూర్తి స్థాయిలో ఉల్లంఘించారు. చివరికి ఆయనను పక్కన పెట్టుకోవడం కన్నా.. వదిలించుకోవడం బెటరనుకున్నారు. ఆయనే రాజీనామా చేయడంతో.. క్షణం ఆలోచించకుండా ఆమోదించేశారు. ఇప్పుడు రాజాసింగ్ కు గడ్డు పరిస్థితి అంటే ఏమిటో తెలిసి వస్తోంది.
గతంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేసి.. మళ్లీ టిక్కెట్ ఇవ్వాలని ఆయన చేయని ప్రయత్నం లేదు. మహారాష్ట్ర, యూపీ నేతలతో చెప్పించుకుని ఎలాగోలా టిక్కెట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత అయినా ఆయన .. ఆలోచించాల్సి ఉంది. కానీ అదేమి లేకుండా రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో తొందరపాటుతో వ్యవహరించి పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు ఆయన ఇస్తామన్నా.. బీజేపీ పెద్దలు తీసుకుంటారా లేదా అన్నది మాత్రం డౌన్.