మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతా..సీఎంపోస్టు లాక్కుంటా అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెడీగా అనలేదు. ఆయన మాటలు వినేవారందరికీ కామెడీగానే ఉంటాయి కానీ ఆయన మాత్రం సీరియస్ గా నే తీసుకున్నారు. తన ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో కొంత మందిని కూడగట్టాలని రాజగోపాల్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
పనులు కాని ఎమ్మెల్యేలతో చర్చలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై కొంత అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను ఏకం చేసే దిశగా రాజగోపాల్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంలో పనులు కాక ఇబ్బంది పడుతున్న వారు, మంత్రి పదవుల విస్తరణ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆశావాహులపై ఆయన దృష్టి సారించారు. వీరితో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక బలమైన గళాన్ని వినిపించేందుకు పావులు కదుపుతున్నారు. ఆర్థికంగా అపారమైన బలం ఉన్న రాజగోపాల్ రెడ్డి, ఆ బలాన్ని రాజకీయ తిరుగుబాటుకు ఇంధనంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ కు వ్యతిరేకంగా వెళ్లడానికి సిద్ధపడని ఎమ్మెల్యేలు
రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలకు ఇతర ఎమ్మెల్యేల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభిస్తోందా అంటే సందేహమే అనిపిస్తోంది. ఆయనతో సమావేశమవుతున్న పలువురు ఎమ్మెల్యేలు.. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి ఎదురుతిరగడం అంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమేనని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రికి హైకమాండ్ వద్ద ఉన్న గట్టి పట్టు, రాష్ట్రంలో ఆయనకు ఉన్న ప్రజాదరణ దృష్ట్యా.. ఇప్పుడు తిరుగుబాటు చేస్తే భవిష్యత్తు నాశనం అవుతుందని వారు రాజగోపాల్ రెడ్డికి సున్నితంగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.
మొండిగా ముందుకెళ్తున్న రాజగోపాల్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డి నైజాన్ని పరిశీలిస్తే, ఆయన ఎప్పుడూ డూ ఆర్ డై తరహా రాజకీయాలకే మొగ్గు చూపుతుంటారు. గతంలో బీజేపీలో చేరి ఉపఎన్నికకు వెళ్లడం, మళ్ళీ కాంగ్రెస్‌లోకి రావడం వంటి పరిణామాలు ఆయన దూకుడుకు నిదర్శనం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిపై ఉన్న పాత కసిని తీర్చుకోవడానికి, కనీసం కొంతమంది ఎమ్మెల్యేలతోనైనా ఒక ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి అధిష్టానంపై ఒత్తిడి తేవాలని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి వర్గం కూడా రాజగోపాల్ రెడ్డి కదలికలపై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఆర్థిక శక్తిని, ఆయనకున్న నెట్‌వర్క్‌ను తక్కువ అంచనా వేయలేమని భావిస్తున్న సీఎం వర్గం..ఓ కంట కనిపెడుతోంది. ఇప్పటికైతే రాజగోపాల్ రెడ్డి..తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారన్న భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది.
